SV Krishna Reddy: ఎస్పీ కృష్ణారెడ్డి సంచలనం.. కొరియన్ హీరోయిన్‌తో సినిమా! 'వేదవ్యాస్' స్టార్ట్
ABN , Publish Date - Aug 28 , 2025 | 05:12 PM
రెండేళ్ళ గ్యాప్ తర్వాత ఫ్యామిలీ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి మెగాఫోన్ పట్టుకున్నారు. సాదాసీదా స్టార్లు కాకుండా ఎవరూ ఊహించిన క్యాస్టింగ్‌ని ఎంపిక చేసుకున్నారు. ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కావడం విశేషం.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లకు బ్రాండ్ గా నిలిచిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి (S. V. Krishna Reddy) . కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన రెండేళ్ళ క్రితం 'ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు' మూవీతో రీ-ఎంట్రీ ఇచ్చారు. తాజాగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ తో మరోసారి అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. తాజాగా తన 43వ చిత్రం 'వేదవ్యాస్' (Vedavyas) ని హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా ప్రారంభించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) , బ్లాక్‌బస్టర్ దర్శకులు వివి వినాయక్ (V. V. Vinayak), అనిల్ రావిపూడి (Anil Ravipudi) చేతుల మీదుగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. కె. అచ్చిరెడ్డి సమర్పణలో, సాయిప్రగతి ఫిలింస్ బ్యానర్‌పై కాంగ్రెస్ నాయకుడు, వ్యాపారవేత్త కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చాలా ప్రత్యేకతలు కనిపిస్తున్నాయి.
సౌత్ కొరియా నటి జున్ హ్యున్ జీ ( (Jun Ji-hyun) ని ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నారు. జున్ హ్యున్ జీతో పాటు మంగోలియన్ నటుడిని విలన్‌గా ఎంచుకున్నారు. ముహూర్తపు షాట్‌లో దిల్ రాజు జున్‌కి బొకే అందించి టాలీవుడ్‌కు స్వాగతం పలికారు. వీవీ వినాయక్ క్లాప్ కొట్టగా, అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు, జెమినీ కిరణ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మురళీ మోహన్, అలీ, సాయికుమార్ వంటి ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 'వేదవ్యాస్' చిత్రం ఘనవిజయం సాధించాలని, జున్ హ్యున్ జీకి టాలీవుడ్‌లో మంచి ఆదరణ లభించాలని ఆహ్వానితులు ఆకాంక్షించారు.
కృష్ణారెడ్డి సినిమాలపై తనకున్న అభిమానంతో ఈ ప్రాజెక్ట్‌లోకి దిగానని, కుటుంబం మొత్తం ఆనందించే సినిమాగా 'వేదవ్యాస్' రూపొందుతుందని నిర్మాత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తెలిపారు. మరోవైపు సంగీతం కోసం కృష్ణారెడ్డి స్వయంగా ఏడాదిగా కష్టపడి ఆల్బమ్ సిద్ధం చేశారు. హీరో ఎవరనేది త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు. మరి కృష్ణారెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందో చూడాలి.