Super Subbu: గ్రామీణ నేపథ్యంలో.. ‘సూపర్ సుబ్బు’ సిరీస్
ABN , Publish Date - Oct 14 , 2025 | 10:57 PM
సందీప్ కిషన్, మిథిలా పార్కర్ జంటగా ‘డీజే టిల్లు’ ఫేమ్ మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్న గ్రామీణ నేపథ్య సిరీస్ ‘సూపర్ సుబ్బు’ త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.
గ్రామీణ నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన కథతో కొత్త వెబ్ సిరీస్ ‘సూపర్ సుబ్బు’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సిరీస్‌లో హీరో సందీప్ కిషన్, హీరోయిన్‌గా మిథిలా పార్కర్ నటిస్తున్నారు. ‘డీజే టిల్లు’ ఫేమ్ మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తుండగా, రాజీవ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలకా నిర్మిస్తున్నారు. ఈ సిరీస్ వచ్చే ఏడాది నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. సోమవారం జరిగిన మీడియా సమావేశంలో టీమ్ సభ్యులు సిరీస్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
సందీప్ కిషన్ మాట్లాడుతూ .. “ప్రస్తుతం తెరకెక్కుతోన్న కథలు మన జీవితాల్ని ప్రతిబింబిస్తున్నాయి. ‘సూపర్ సుబ్బు’ కథ విన్న వెంటనే ఇది అందరికీ చేరుతుందని అనిపించింది. ఈ సిరీస్ ఆద్యంతం నవ్వుల భరితంగా ఉంటుంది. ప్రేక్షకులు దీనిని తప్పక ప్రేమిస్తారని నమ్మకం ఉంది,” అని చెప్పారు.
దర్శకుడు మల్లిక్ రామ్ మాట్లాడుతూ.. “గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథాంశం మనకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. కొత్తదనం, హృదయానికి హత్తుకునే భావోద్వేగాలు కలగలిపిన ఈ సిరీస్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. చూసిన తర్వాత గుర్తుండిపోయే కంటెంట్ అనిపిస్తుంది,” అన్నారు.
హీరోయిన్ మిథిలా పార్కర్ మాట్లాడుతూ.. “ఇందులోని పాత్రలు చాలా రియలిస్టిక్‌గా, మన దగ్గర వారిలా అనిపిస్తాయి. ఈ కథలో భాగం కావడం నాకు చాలా స్పెషల్‌గా అనిపిస్తోంది,” అని తెలిపారు.