Sukumar: బాలీవుడ్ బాద్షాతో సుకుమార్
ABN , Publish Date - Jun 11 , 2025 | 06:26 PM
టాలీవుడ్ మోస్ట్ క్రేజీ డైరెక్టర్ బాలీవుడ్ పై మోజు పడుతున్నాడా? తోటి డైరెక్టర్లు అదృష్టం పరీక్షించుకుంటున్న కొద్దీ తనకూ ఆశపుడుతోందా? కావాల్సినంత క్రేజ్ ఉండటంతో బీటౌన్ ఎంట్రీకి ఇదే కరెక్ట్ అని ఫీల్ అవుతున్నాడా? అంటే అవుననే అనిపిస్తోంది. బీటౌన్ ఫ్యాన్స్ కూడా అదే ఆశపడుతుండటం ఆసక్తికరంగా మారింది.
‘పుష్ప’ ఫ్రాంచైజ్‌తో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు దర్శకుడు సుకుమార్ (Sukumar). బీటౌన్ కు పరిచయమైంది ఈ రెండు సినిమాలతోనే అయినా మోస్ట్ పవర్ ఫుల్ మాస్ డైరెక్టర్ గా అక్కడి వారిని తెగ ఆకట్టుకున్నాడు. పుష్ప (Pushpa)తో పాన్ ఇండియా లెవెల్లో కావాల్సినంత పేరు రావడంతో.. సుకుమార్ కూడా ఇప్పుడు బాలీవుడ్ పై కన్నేస్తున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ఓ క్రేజీ కాంబినేషన్ ను తెరపైకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)తో కలిసి సుకుమార్ తన తదుపరి ప్రాజెక్ట్ చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ సిట్యూవేషన్స్ చూస్తుంటే మాత్రం సుక్కు ఇతర ప్రాజెక్టులతోనే చాలా బిజీగా ఉన్నాడు. ఇప్పటికే సుకుమార్ ‘పుష్ప 3 (Pushpa3): ది రాంపేజ్’తో పాటు రామ్ చరణ్ (Ram Charan)తో మరో చిత్రం కోసం సన్నాహాలు చేస్తున్నాడు. రామ్ చరణ్ ప్రాజెక్ట్ స్క్రిప్ట్‌ను ఫైనలైజ్ చేసేందుకు తన టీమ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ స్క్రిప్ట్ పనులు పూర్తయ్యేందుకు మరో 2-3 నెలలు, ప్రీ-ప్రొడక్షన్‌కు మరో 8 నెలల సమయం పట్టవచ్చు. అంటే, షారుఖ్ ఖాన్, సుకుమార్‌తో కలిసి పనిచేయాలనుకున్నా, దాదాపు రెండేళ్లు వేచి ఉండాల్సి ఉంటుంది.
ఇదిలా ఉంటే.. ఇటీవల సన్నీ డియోల్ (Sunny Deol ), గోపీచంద్ మలినేని ( Gopichand Malineni)తో కలిసి ‘జాట్’ (Jaat) సినిమాతో హిట్ సాధించడంతో బాలీవుడ్ లోకి సుకుమార్ ఎంట్రీ ఇస్తే బాగుటుందని బీటౌన్ మీడియా వార్తలు రాస్తోంది. ఒకవేళ షారుఖ్ ఖాన్, సుకుమార్ కాంబో సెట్ అయితే, అది బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుందని వారు భావిస్తున్నారు. ఈ కాంబినేషన్ ఫ్యాన్స్‌లోనూ భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.