Sudheer Babu: సుధీరూ.. ఆ దేవుడు కూడా కాపాడలేదయ్యా

ABN , Publish Date - Nov 07 , 2025 | 05:26 PM

ప్రేక్షకులు.. అంతకు ముందులా లేరు. స్టార్ హీరో కుటుంబం నుంచి వచ్చాడు.. సినిమా బాగాలేకున్నా అభిమానులుగా బావుందని చెప్పాలి.

Sudheer Babu

Sudheer Babu: ప్రేక్షకులు.. అంతకు ముందులా లేరు. స్టార్ హీరో కుటుంబం నుంచి వచ్చాడు.. సినిమా బాగాలేకున్నా అభిమానులుగా బావుందని చెప్పాలి. రికార్డ్ కలక్షన్స్ అందుకున్నట్లు చూపించాలి. ఇలాంటివన్నీ ఒకప్పుడు. ఇప్పుడు ఎవరైనా సరే కథ నచ్చాలి. యాక్టింగ్ నచ్చాలి. లేకపోతే నిర్మొహమాటంగా ముఖం మీద చెప్పేస్తున్నారు. అది హీరో కొడుకైనా.. హీరో అల్లుడైనా.

ఘట్టమనేని ఇంటి అల్లుడుగా సుధీర్ బాబు తెలుగుతెరకు పరిచయమయ్యాడు. నేపోటిజం అనేది కేవలం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి మాత్రమే పనికి వస్తుంది. అలానే సుధీర్ బాబు కూడా హీరోగా పరిచయం అవ్వడానికి మాత్రమే కృష్ణ అల్లుడు, మహేష్ బామ్మర్ది అనే ట్యాగ్ లైన్స్ పనికొచ్చాయి. కానీ, విజయాలు మాత్రం అతడు ఎంచుకున్న కథల మీదనే ఆధారపడి ఉన్నాయి. శివ మనసులో శృతి, ప్రేమ కథా చిత్రం, సమ్మోహనం లాంటి సినిమాలే అందుకు నిదర్శనం.

అయితే.. సుధీర్ విజయాపజయాలను పక్కన పెట్టి వరుస సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. కానీ, కొద్దిగా అలోచించి.. ఆచితూచి అడుగులు వేసి ఉంటే బావుండేది అనేది ఇండస్ట్రీ వర్గాల సలహా. కథలో దమ్ముంటే హీరో ఎవరు.. ఎలా ఆన్నాడు.. ఎలా చేశాడు అనేది పట్టించుకోవడమే మానేశారు అభిమానులు. హీరో ఆరడుగులు ఉన్నాడా.. ఆరు పలకల శరీరం చూపించాడా అని ఆలోచించే జనరేషన్ కాదు ఇది. కానీ, సుధీర్ ఇంకా ఆ మైండ్ సెట్ లోనే ఉన్నాడనిపిస్తుంది.

గత కొంతకాలంగా పరాజయాలతోనే కాలం గడిపేస్తూ వస్తున్నాడు సుధీర్. ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ చేసుకుంటూ వస్తున్నా.. విజయం మాత్రం దక్కడం లేదు. గతేడాది హరోంహర, మా నాన్న సూపర్ హీరో అంటూ వచ్చాడు. రెండు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ట్రెండ్ కు తగ్గట్లు ఉంటుంది కదా అని ఈసారి దెయ్యాలు - దేవుడు, హారర్ అంటూ జటాధర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

జటాధర ట్రైలర్ చూసి ధన పిశాచి, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీ, మహేష్ మరదలు శిల్ప శిరోడ్కర్ కీలక పాత్రలో నటించడం.. ఇవన్నీ సినిమాకు ప్లస్ పాయింట్స్ అవుతాయని అనుకున్నారు. కానీ, సినిమాలో కథే లేకపోతే ఎంతమంది ఉండి ఏమి ప్రయోజనం అని సినిమా చూసిన నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. అసలు ఎలా ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది.. ఎలా ఫినిష్ చేశారు. ఒక్కసారైనా సినిమా ఫినిష్ అయ్యాక చూసుకోవాల్సింది అని చెప్పుకొస్తున్నారు. దేవుడు షాట్స్ రెండు వేసి.. పూనకాలు తెప్పించేయొచ్చు అనుకుంటే.. ఇప్పుడు ఆ దేవుడు కూడా సుధీర్ ను కాపాడలేకపోయాడు అని చెప్పొచ్చు.

ప్రస్తుతం అందరూ సుధీర్ కి ఇచ్చే సలహా ఒకటే. కథలపై ఫోకస్ చేసి.. నెమ్మదిగా ఆచితూచి అడుగులు వేయాలని.. బాడీ మీద చూపించే శ్రద్ద కథలపై పెట్టి.. చిన్న బడ్జెట్ అయినా కూడా ప్రేక్షకులను మెప్పించే సినిమాలు తీయమని కోరుతున్నారు. లేకపోతే హీరోగా కాకపోయినా విలన్ గా అయినా సెటిల్ అవ్వమని హిత్ భోద చేస్తున్నారు. మరి సుధీర్ ఇప్పటికైనా మారతాడా.. ? లేదా.. ? అనేది చూడాలి.

Indian Panorama: గోవాలో సంక్రాంతికి వస్తున్నాం....

Sujeeth: సచిన్ తో సుజిత్.. ఫ్రేమ్ అదిరిపోయిందిగా

Updated Date - Nov 07 , 2025 | 05:26 PM