Fedaration Strike: సామరస్యమే.. అయినా కొలిక్కిరాని సమస్య
ABN , Publish Date - Aug 13 , 2025 | 07:32 PM
సినీ కార్మికుల సమ్మెకు పరిష్కారం దిశగా అడుగులు వేయడానికి ఫిలిమ్ ఛాంబర్, నిర్మాతలు, ఫెడరేషన్ పెద్దలు బుధవారం సమావేశమయ్యారు.
గత కొన్నాళ్ళుగా సాగుతున్న సినీ కార్మికుల సమ్మెకు (Fedaration Strike) పరిష్కారం దిశగా అడుగులు వేయడానికి ఫిలిమ్ ఛాంబర్, నిర్మాతలు, ఫెడరేషన్ పెద్దలు బుధవారం సమావేశమయ్యారు. దాదాపు నాలుగు గంటల పాటు చర్చలు సాగాయి. అనంతరం తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ అధ్యక్షులు దిల్ రాజు, నిర్మాతల మండలి అధ్యక్షుడు కె.ఎల్. దామోదర ప్రసాద్, తెలుగు ఫిలిమ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ మీడియా ముందుకు వచ్చారు. అందరి తరపున టీఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు చర్చల సారాంశాన్ని తెలిపారు.
చర్చలు సామరస్య పూర్వక వాతావరణంలో జరిగాయని, అందరూ సినిమా పరిశ్రమ బాగు కోసం తపించేవారేనని దిల్ రాజు అన్నారు. 2018, 2022 సంవత్సరాలలో ఫెడరేషన్ తో నిర్మాతలు చర్చించినప్పుడు కొన్ని వర్కింగ్ కండిషన్స్ ను ప్రతిపాదించామని, అయితే అవి ఇప్పటి దాకా అమలు కాలేదని, వాటిని అంగీకరించాలని నిర్మాతలు కోరినట్టు రాజు చెప్పారు. ప్రస్తుతం ఫెడరేషన్ వారి డిమాండ్ వేతనాల పెంపు కాబట్టి దానిపై చర్చించామని, రూ.2000లోపు వేతనం ఉన్నవారికి అడిగినంత శాతం ఇవ్వడానికి నిర్మాతలు అంగీకరించారని, అంతకు మించి వేతనం తీసుకొనేవారికి మరో పర్సంటేజ్ ఇస్తామని చెప్పినట్టు ఆయన వివరించారు.
గతంలోని వర్కింగ్ కండిషన్స్ గురించి, ఈ వేతనాల పెంపులోని తేడా గురించి ఫెడరేషన్ వారికి తెలిపామని, వారు ఫెడరేషన్ లోని అన్ని యూనియన్స్ తో చర్చించిన తరువాత మరోసారి చర్చలు సాగుతాయని దిల్ రాజు తెలిపారు. ఇది మొదటి సమావేశమే, స్నేహపూర్వక వాతావరణంలో సాగడం శుభసూచకమని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిని బట్టి ఈ రోజు సాగిన చర్చలకు ఇంకా కొనసాగింపు ఉందని తేలిపోయింది. మరి ఎన్ని రోజుల్లో సినీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సమ్మెకు ముగింపు లభిస్తుందో చూడాలి.