Mahesh Babu: రెండు కోట్ల సెట్ వేస్ట్.. మహేష్ ఇంత సున్నితమా..
ABN , Publish Date - Aug 28 , 2025 | 06:26 PM
ప్రస్తుతం రాజమౌళి బృందం సౌత్ ఆఫ్రికాలో ఉంది. మహేశ్, ప్రియాంక చోప్రాలతోపాటు ప్రధానా పాత్రధారులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని, ఇది కాస్త పెద్ద షెడ్యూల్ అని తెలిసింది.
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్న చిత్రం ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ (SSMB29). మహేశ్ బాబు (Mahesh Babu) హీరోగా ఎస్‌ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో దుర్గా ఆర్ట్ పతాకంపై కె.ఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహేశ్ పుట్టినరోజున ‘గ్లోబ్ ట్రోటర్’ హ్యాష్‌ట్యాగ్‌తో రాజమౌళి ఈ సినిమా అప్‌డేట్‌ను ఓ ఫొటో విడుదల చేసి, ప్రీలుక్‌ను నవంబర్‌లో విడుదల చేస్తామని తెలిపారు. అడవుల నేపథ్యంలో సాగే ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ప్రస్తుతం రాజమౌళి బృందం సౌత్ ఆఫ్రికాలో ఉంది. మహేశ్, ప్రియాంక చోప్రాలతో పాటు ప్రధాన పాత్రధారులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని, ఇది కాస్త పెద్ద షెడ్యూల్ అని తెలిసింది. ఈ షెడ్యూల్ పూర్తయ్యాక చిత్ర బృందం హైదరాబాద్‌కి వస్తుంది.
రెండు కోట్ల సెట్ వృధా..
సౌత్ ఆఫ్రికా షెడ్యూల్ కన్నా ముందు రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ కోసం ఓ సెట్ వేశారట. ఓపెన్ ఏరియా సెట్ అది. ఒక చెరువు సమీపంలో సీన్స్ చిత్రీకరణ అక్కడ జరగాల్సి ఉంది. మహేశ్ సున్నితత్వం గురించి ఆలోచించి మేకర్స్ తగు జాగ్రత్తలు తీసుకున్నారు. సెట్ వర్క్ పూర్తయ్యాక దానిలో షూటింగ్‌కు మహేశ్ ఒకరోజు వెళ్లారట. సెట్‌లో జస్ట్ అరగంట ఉండి ‘నా వల్ల కాదు.. సారీ’ అని చెప్పి షూటింగ్ మధ్యలో వచ్చేశారట. అలా వచ్చేయడానికి కారణం అక్కడ వేడి తట్టుకోలేక చిరాకు పడి వచ్చేశారని సన్నిహితవర్గాల నుంచి సమాచారం అందింది. దాంతో ఆ షెడ్యూల్ ఆగిపోయింది. రెండు కోట్లు సెట్ వృధా అయిందని తెలిసింది.
‘బ్రహ్మోత్సవం’ షూటింగ్‌లోనూ ఇంతే...
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేశ్ హీరోగా నటించిన ‘బ్రహ్మోత్సవం’ చిత్రం విషయంలోనూ ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఓ పాట చిత్రీకరణ ఆరుబయట చేయాల్సి ఉంది. ఆ ఎండలో మహేశ్ చేయలేను అనడంతో ఇన్‌డోర్‌లోనే.. అవుట్‌డోర్ సెట్‌ను తీర్చిదిద్దారు తోట తరణి. అప్పట్లో ఈ వార్త విపరీతంగా వైరల్ అయింది. ఇప్పుడు కూడా అలాంటిదే జరిగింది.