SS Rajamouli: జక్కన్న పబ్లిసిటీ రూట్‌ మార్చేశారా.. 

ABN , Publish Date - Nov 11 , 2025 | 02:00 PM

సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం ఓ ఆర్ట్‌. అది బాగా తెలిసిన వ్యక్తి  రాజమౌళి. ఆయన పబ్లిసిటీ స్ట్రాటజీనే వేరు. ఆయన క్రియేటివ్‌ ఆలోచనలతో ఆ రీచ్‌ ఎక్కడికో వెళ్లిపోతుంది



సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం ఓ ఆర్ట్‌. అది బాగా తెలిసిన వ్యక్తి  రాజమౌళి. ఆయన పబ్లిసిటీ స్ట్రాటజీనే వేరు. ఆయన క్రియేటివ్‌ ఆలోచనలతో ఆ రీచ్‌ ఎక్కడికో వెళ్లిపోతుంది. అయితే పబ్లిసిటీలో కూడా రెగ్యులర్‌గా కాకుండా ఆయన కొత్త ఒరవడి తీసుకొస్తారాయన. ప్రస్తుతం మహేష్‌ బాబుతో చేస్తున్న 'ఎస్‌ఎస్‌ఎంబీ29' (SSMB29) విషయంలో ఆయన థాట్స్‌ (Rajamouli creativity) అన్ని భిన్నంగా ఉన్నాయి.

మమూలుగా స్టార్‌ హీరోల సినిమాలంటే ఎంటైర్‌ మీడియా అక్కడే ఉంటుంది. ఆయా ఈవెంట్‌లను ఛానళ్లు అన్ని ప్రమోట్‌ చేస్తాయి. కానీ 15న జరగబోయే గ్లోబ్‌ట్రోట్‌ ఈవెంట్‌ను జక్కన్న ఎక్స్‌క్లూజివ్‌గా జియో, హాట్‌స్టార్‌కి ఇచ్చేశారు. అలాగే ఈ సినిమా అప్డేట్స్‌ విషయంలో కూడా కొత్త ఎత్తుగడను ఫాలో అవుతున్నారు. ముందు నుంచీ కూడా ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వకుండానే సినిమాకు విపరీతంగా హైప్‌ తీసుకొచ్చిన రాజమౌళి.. ఇప్పుడు ఏ అప్‌డేట్‌ లేకుండానే డైరెక్ట్‌గా కంటెంట్‌ మీడియాకు వదిలేస్తున్నారు. ఇందులో విలన్‌గా నటిస్తున్న పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఫస్ట్‌ లుక్‌ అందుకు ఉదాహరణ. ఆ లుక్‌ వచ్చేవరకు అది వస్తుందన్న సమాచారం కూడా లేదు.

సోమవారం 'సంచారి' అనే పాటను విడుదల చేశారు. దీనిపై కూడా ముందస్తు సమాచారం ఏమీ లేదు. డైరెక్ట్‌ రిలీజ్‌ చేసేశారు. ఆ పాట వస్తుందని సినిమా సర్కిల్స్‌లోనే చాలా మందికి తెలీదు. ముందుగా  పాట యాపిల్‌ మ్యూజిక్‌లో స్ర్టీమ్‌ అయింది, తర్వాత యూట్యూబ్‌లో దర్శనమిచ్చింది. కాకపోతే రిలీజ్‌ అయిన తర్వాత రావాల్సిన రీచ్‌ ఇప్పటికే వచ్చేసింది. మామూలుగా ఇలాంటి పాట వస్తుందంటే ఫస్ట్‌ సింగిల్‌ వస్తుందని, లేదా ఇంకేదో అప్‌డేట్‌ ఇస్తామని పోస్టర్‌ రూపంలో ముందుగా సమాచారం ఇస్తారు. ఏ సమయానికి వస్తుందో సమయం కూడా చెబుతారు. ఈ మధ్యన భారీ బడ్జెట్‌ చిత్రాలన్నీ చేసే పని ఇదే. కానీ రాజమౌళి తీరు చూస్తుంటే ఆ పాత పద్ధతికి స్వస్తి చెప్పినట్లు అర్థమవుతుంది. ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి కొత్త పద్ధతి ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Nov 11 , 2025 | 02:05 PM