SS Thaman: టాలీవుడ్ లో యూనిటీ లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన థమన్
ABN , Publish Date - Dec 14 , 2025 | 08:30 PM
అఖండ 2 తాండవం (Akhanda 2 Thaandavam) విడుదల వాయిదా అనేది పాపం నిర్మాతల కంట్రోల్ లో లేకుండా అలా జరిగిపోయిందని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (Thaman) అన్నాడు.
SS Thaman: అఖండ 2 తాండవం (Akhanda 2 Thaandavam) విడుదల వాయిదా అనేది పాపం నిర్మాతల కంట్రోల్ లో లేకుండా అలా జరిగిపోయిందని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (Thaman) అన్నాడు. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా బోయపాటి శ్రీను (Boyapati Sreenu) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అఖండ 2 తాండవం. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించారు. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన సంయుక్త మీనన్ నటించింది. ఇక ఈ సినిమా రిలీజ్ సమయంలో కొన్ని కారణాల వలన వాయిదా పడిన విషయం తెల్సిందే. డిసెంబర్ 5 న రిలీజ్ కావాల్సిన అఖండ 2 డిసెంబర్ 12 న రిలీజ్ అయ్యింది.
లేట్ గా వచ్చినా కూడా బాలయ్య- బోయపాటి మరో విజయాన్ని అందుకున్నారు. అఖండ సీక్వెల్ గా తెరకెక్కిన అఖండ 2 సైతం మంచి పాజిటివ్ టాక్ తో ముందుకు సాగుతుంది. దీంతో చిత్రబృందం సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ మీట్ లో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మాట్లాడుతూ.. ' ప్రతి బాలయ్య సినిమా 10 వ తరగతి పరీక్షలా ఉంటుంది. ఎప్పుడు చదువుతూనే ఉంటాం. ఎలా కొత్తగా చేయాలి. ఫ్యాన్స్ ను ఎలా మెప్పించాలి అని. శివుడు వచ్చినప్పుడు తాండవం కొత్తగా ఎలా చేయాలి అనేది ఆలోచించాం. ఈ సినిమాకోసం పనిచేసిన గేయ రచయితలు, గాయకులు చాలా కష్టపడ్డారు. నేను అనుకున్నట్లు రాయమని గేయరచయితలను అడిగినప్పుడు వారు కూడా దానికి తగ్గట్లే రాసారు. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ 77 రోజులు పట్టింది. కేవలం ఇంటర్వెల్ చేయడానికే 11 డేస్ పట్టింది. మేము ప్రతి గుడికి వెళ్లి ప్రార్థన చేశాం. ఈ సినిమాను, మమ్మల్ని గట్టెక్కించు అని వేడుకున్నాం.' అనిచెప్పుకొచ్చాడు.
ఇక సినిమా వాయిదా పడడం గురించి థమన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'డిసెంబర్ 5 న రావాల్సిన సినిమా 12 కి వచ్చింది. వాళ్లు అనుకుంటే ముందే కేసు వేయొచ్చు. కరెక్ట్ గా లాస్ట్ మినిట్ లో వచ్చి ఆపారు. దీన్నిబట్టే తెలుస్తుంది ఎంత యూనిటీ లేకుండా ఉంది ప్రపంచం అని.. ఇక్కడ అంతా మనమే .. నాదే అన్నట్లు ఉంది. కానీ, మనం అన్నదాంట్లో అందరూ ఉండాలి. అలా ఉంటే మనం పెరుగుతామే తప్ప తగ్గిపోము. ఛానెల్ కి వెళ్లి సలహాలు ఇస్తున్నారు తప్ప.. ఒక్కరైనా ప్రొడక్షన్ ఆఫీస్ కి వచ్చి మాట్లాడితే ప్రొడ్యూసర్స్ కి ఇంకా బలం వచ్చేది. గోపి, రామ్ అందరూ మంచోళ్ళు అని చెప్తున్నారు.. మరి అలాంటప్పుడు వారి గురించి ఛానెల్ లో తప్పుగా మాట్లాడడం ఎందుకు.. ? ఇండస్ట్రీలోనే ఒక యూనిటీ లేదు. నాలుగు గోడల మధ్య జరిగేది.. ప్రపంచమంతా చాలా బ్యాడ్ గా వెళ్తుంది.
టాలీవుడ్ ఇండస్ట్రీ చాలా గొప్పది. ఇక్కడ ఉన్నంత ఫ్యాన్స్ ఇంకెక్కడా ఉండరు. ఇక్కడ ఉన్నంతమంది హీరోలు వేరే ఏ లాంగ్వేజ్ లో లేరు. ఇప్పుడు బయట అంతా టాలీవుడ్ గురించే మాట్లాడుకుంటున్నారు. టాలీవుడ్ కి దిష్టి తగిలింది. యూట్యూబ్ తెరిస్తే ఒకరిని ఒకరు తిట్టుకోవడం . .చాలా నెగిటివిటీ అయిపోయింది. అలా కాకుండా అందరూ యూనిటీగా ఉండాలి. ప్రతి సినిమా నా సినిమానే అనుకోవాలి. నా ఇండస్ట్రీని నేను సపోర్ట్ చేయకపోతే ఎవరు చేస్తారు. ఎవరికైనా దెబ్బ తగిలితే బ్యాండేజ్ వేయండి.. అంతే కానీ బ్యాండ్ వాయించకండి. అలా ఆలోచించేదే తప్పు. అఖండ 2 విడుదల వాయిదా అనేది పాపం నిర్మాతల కంట్రోల్ లో లేకుండా అలా జరిగిపోయింది. కావాలనీ ఎవరు తమ సినిమాను వాయిదా వేయరు కదా. దేవుడు దర్శనం ఒక వారం లేటుగా అయింది. ఎప్పుడు ఈ సినిమా వచ్చినా ప్రేక్షకాదరణ అందుకుంటుందని మాకు నమ్మకం ఉండింది.ఈ రోజు అదే నిజమయ్యింది' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.