Eega: రాజమౌళి ధైర్యానికి నిదర్శనం 'ఈగ'.. రీ-రిలీజ్ ఫిక్స్‌..

ABN , Publish Date - Dec 28 , 2025 | 07:08 PM

మగధీర సినిమా తీసిన సమయంలో రాజమౌళిపై పెద్ద చర్చే నడిచింది. రాజమౌళి సినిమాలు హిట్టవ్వడానికి కారణం కేవలం అందులోని స్టార్ హీరోలే అని విమర్శకులు అనేవారు. ఆ మాటలను తిప్పికొట్టడానికి రాజమౌళి ఎంచుకున్న మార్గం అందరినీ ఆశ్చర్యపరిచింది.

టాలీవుడ్ సినిమా చరిత్రను బాహుబలికి ముందు.. బాహుబలికి తర్వాత అని ఎలా చెప్పుకుంటామో, అలాగే దర్శకుడు రాజమౌళి (SS Rajamouli) సత్తాను కూడా ఈగ సినిమాకు ముందు.. ఈగ (Eega)తర్వాత అని విశ్లేషించుకోవాలి. ఓటమెరుగని మొనగాడు ఎస్.ఎస్. రాజమౌళి పేరు వింటేనే బాక్సాఫీస్ రికార్డులు గజగజ వణుకుతాయి. ఆయన తీసినవి తక్కువ సినిమాలే కావొచ్చు, కానీ ప్రతి చిత్రంలోనూ ఒక సరికొత్త మాయాజాలాన్నిసృష్టిస్తారు. సినిమా సినిమాకు వైవిధ్యాన్ని చూపిస్తూ గ్లోబల్ డైరెక్టర్‌గా ఎదిగిన జక్కన్న కెరీర్‌లో ఈగ ఒక అద్భుత ప్రయోగం.

మగధీర సినిమా తీసిన సమయంలో రాజమౌళిపై పెద్ద చర్చే నడిచింది. రాజమౌళి సినిమాలు హిట్టవ్వడానికి కారణం కేవలం అందులోని స్టార్ హీరోలే అని విమర్శకులు అనేవారు. ఆ మాటలను తిప్పికొట్టడానికి రాజమౌళి ఎంచుకున్న మార్గం అందరినీ ఆశ్చర్యపరిచింది. స్టార్ హీరో నాని (Nani) పాత్రను కేవలం 30 నిమిషాలకే ముగించేసి, ఒక చిన్న కీటకాన్ని హీరోగా పెట్టి సినిమా మొత్తం నడిపించారు. ఒక సామాన్యుడు ఊహించని విధంగా, ఒక ఈగతో విలన్‌ను భయపెట్టించి, ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించిన ఘనత కేవలం ఆయనకే సొంతం. నాని, సమంత, కిచ్చ సుదీప్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈగ 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. మన దేశంలోనే కాకుండా, జపాన్ వంటి దేశాల్లోనూ ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ ఉంది. అక్కడి ప్రజలు ఇప్పటికీ ఈగ సినిమాను ఒక మాస్టర్ పీస్‌గా ఆరాధిస్తారు. టెక్నికల్ పరంగా రాజమౌళిని మరో స్థాయికి తీసుకెళ్లిన సినిమా ఇదే. గ్రాఫిక్స్ వాడకంలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తూనే, భావోద్వేగాలను పండించడంలో రాజమౌళికి మించిన వారు లేరు అనేలా నిరూపించుకున్నాడు.

ఈ ఏడాది బాహుబలి ది ఎపిక్ పేరుతో రెండు భాగాలను కలిపి రీ-రిలీజ్ చేసి రాజమౌళి సెన్సేషన్ క్రియేట్ చేశారు. రీ-రిలీజ్ సినిమాల్లో 50 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఏకైక చిత్రంగా బాహుబలి చరిత్ర సృష్టించింది. అదే ఉత్సాహంతో ఇప్పుడు ఈగను కూడా రీ-రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 2027 వేసవిలో మహేష్ బాబుతో తీయబోయే వారణాసి విడుదల కానున్న నేపథ్యంలో, వచ్చే ఏడాది ఈగను థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈసారి కేవలం తెలుగులోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో డబ్ చేసి విడుదల చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. మరి అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ చిన్న ఈగ, రీ-రిలీజ్ లో ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తుందో వేచి చూడాలి.

Updated Date - Dec 28 , 2025 | 07:15 PM