Sonu nigam: ఏఐతో అద్భుతం... మహ్మద్ రఫీతో సోనూ నిగమ్ లైవ్ కాన్సర్ట్!

ABN , Publish Date - Nov 23 , 2025 | 12:01 PM

తాజాగా ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్ (Sonu Nigam), దివంగత మధుర గాయకుడు మహ్మద్ రఫీ (Md.Rafi)ని, ఆయన గాత్రాన్ని ఏఐతో క్రియేట్ చేసి 'యుగళం' ఆలపించడం సంగీతాభిమానులను అలరిస్తోంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ)(AI)తో పలు అద్భుతాలు జరుగుతాయి అని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఏఐతో మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుందని భయపెట్టేవారూ లేకపోలేదు. 'గతించిన కాలాన్ని కవి వెనక్కి తీసుకు రాగలడు'  అనే సామెత ఉంది. ఇప్పుడు కవికి కూడా పని తగ్గిస్తూ కృత్రిమ మేధ గతంలోని వాస్తవాలను మన కళ్ళకు కట్టే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా తనువు చాలించిన ఎందరో కళాకారులను తెరపై సజీవంగా మన ముందు ఉంచుతోంది ఏఐ. కృత్రిమ మేధతో గతించిన నటీనటులను తెరపై ఆవిష్కరించిన తీరును చూశాం. అలాగే మధుర గాయకులు స్వరాలను ఏఐతో రీ క్రియేట్ చేసి అలరించిన వైనం తెలిసిందే. అయితే ఇప్పటికే కొందరు నటీనటులు, గాయనీగాయకులు తమను అనుకరిస్తూ రూపొందించే అంశాలలో తమ పరువు-ప్రతిష్ఠకు భంగం వాటిల్ల చేసేలా ఏఐని ఉపయోగిస్తున్నారని కోర్టు మెట్లెక్కుతున్నారు. అయినా కళారంగంలో ఏఐ మాత్రం మెల్లగా తన విశ్వరూపం చూపిస్తూనే ఉంది. ఎథిక్స్, లీగల్ ట్రబుల్స్, ఐపీ రైట్స్ గొడవలు ఉన్నప్పటికీ ఏఐ మాత్రం తన ఉనికిని చాటుకుంటూ ముందుకు సాగుతూనే ఉండడం విశేషం! తాజాగా ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్ (Sonu Nigam), దివంగత మధుర గాయకుడు మహ్మద్ రఫీ (Md.Rafi)ని, ఆయన గాత్రాన్ని ఏఐతో క్రియేట్ చేసి 'యుగళం' ఆలపించడం సంగీతాభిమానులను అలరిస్తోంది.

అమెరికా - డల్లాస్ లో ఇటీవల సోనూ నిగమ్ ఓ లైవ్ కాన్సర్ట్ నిర్వహించారు. అక్కడే మధుర గాయకుడు మహ్మద్ రఫీ ఏఐ క్రియేషన్ తో కలసి సోనూ నిగమ్ 'కల్ హో నా హో' (Kal Ho Naa Ho) టైటిల్ ట్రాక్ ను ఆలపించి వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. సోనూ- రఫీ డ్యుయెట్ మొదటిదేమీ కాదు. 2023లో టిక్ టాక్ యూజర్ 'గోస్ట్ రైటర్ 977' పేరుతో 'హార్ట్ ఆన్ మై స్లీవ్' (Heart On My Sleeve) అనే ఏఐ జెనరేటెడ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాటలో డ్రేక్, ద వెకెండ్ వాయిస్ ను ఏఐతో క్రియేట్ చేసి జనం ముందు నిలిపారు. అది అనూహ్యంగా అలరించింది. ఆ స్థాయిలో అలరించిన ఏఐ క్రియేటెడ్ మ్యూజిక్ లేదంటే అతిశయోక్తి కాదు.

దివంగతులైన కళాకారులను ఏఐతో రీక్రియేట్ చేసే ముందు సదరు కళాకారుల కుటుంబ సభ్యుల అనుమతి తీసుకోవాలని కొందరు అంటున్నారు. అయితే కళాకారులు అందరివారు - వారి కుటుంబానికి మాత్రమే పరిమితం కారు అన్నది మరికొందరి వాదన. ఆ మధ్య 'కీడా కోలా' (Keeda Kola)అనే తెలుగు సినిమా కోసం దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (S P Balasubrahmanyam) గాత్రాన్ని కృత్రిమ మేధతో పునః సృష్టించారు. దానిపై ఎస్పీబీ తనయుడు ఎస్పీ చరణ్ ఆ మూవీ మేకర్స్ కు లీగల్ నోటీసు పంపించారు. తాము బాలుసార్ కు నివాళిగానే అలా చేశామని మేకర్స్ తరువాత వివరణ ఇచ్చారు. గ్రేట్ సింగర్స్, ఆర్టిస్ట్స్ వంటివారికి ట్రిబ్యూగానే ఏఐని ఉపయోగించుకుంటున్నారు కొందరు. సోనూ నిగమ్ కూడా మహ్మద్ రఫీకి నివాళి అర్పిస్తూనే తన కాన్సర్ట్ లో ఏఐ క్రియేషన్ ను ఉపయోగించారు. అందువల్ల సోనూపై లీగల్ యాక్షన్ తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవచ్చు.

టెక్నాలజీ పెరిగే కొద్దీ దానితో అద్భుతాలు సృష్టించవచ్చు. అయితే అది ఇతరులకు ఇబ్బంది కలిగించనంత వరకూ తప్పేమీ లేదు. కానీ, ఏఐ ఆధారంగా కొందరు అదే పనిగా ప్రముఖుల ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా ప్రవర్తిస్తున్నారు. అది నిస్సందేహంగా నేరమే! కళాకారుల అభిమానులకు ఆనందం పంచుతూ దివంగతులైన వారిని ఏఐతో క్రియేట్ చేయడం తప్పేమీ కాదని అధిక సంఖ్యాకులు అంటున్నారు.  
ఎ.ఆర్.రహమాన్ కూడా 2024లో రజనీకాంత్ 'లాల్ సలామ్' (Laal Salaam) సినిమా కోసం దివంగత గాయకులు బాంబా బక్యా (Bamba Bakya, Shahul Hameed), షాహుల్ హమీద్ గాత్రాలను ఏఐతో రీ క్రియేట్ చేశారు. వారి గాత్రాలతో పాటు దీప్తి సురేశ్, అక్షయ శివ్ కుమార్ ను కలిపి 'లాల్ సలామ్'లోని "దిమిరి ఎళుడా..." (Thimiri Yezhuda...) అంటూ సాగే పాటను స్వరపరిచారు రహమాన్. అయితే రహమాన్ దివంగత గాయకుల కుటుంబసభ్యుల నుండి అనుమతి తీసుకొనే ఆ పాటను రూపొందించడం గమనార్హం!

కొందరు మహ్మద్ రఫీ, కిశోర్ కుమార్ (Kishore Kumar) గాత్రాలను కృత్రిమ మేధతో రూపొందించి వారిద్దరూ కలసి పాడినట్టుగానూ కొన్ని గీతాలను రూపొందించారు. వారి కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత ఏమీ తలెత్తలేదు. కొందరు స్టార్స్ అదే పనిగా తమ గాత్రాలను, పాతకాలం నాటి సౌష్టవాన్ని ఏఐతో రీక్రియేట్ చేయమంటూ ప్రోత్సహిస్తున్నారు. కెనడియన్ సింగర్ గ్రైమ్స్ (Grimes) తన గాత్రాన్ని ఏఐతో వినియోగించుకోవచ్చునని చాటింపేశారు. కొందరు హాలీవుడ్ స్టార్స్ తమ పాతరోజుల నాటి రూపాన్ని ఏఐతో రీక్రియేట్ చేసుకొని వాడుకోవచ్చుననీ అనుమతినిచ్చారు. ఏఐని ఉపయోగించే శంకర్ తన 'ఇండియన్ -2' (Indian-2)లో దివంగత నటులు నెడుముడి వేణు (Nedumudi Venu), వివేక్ (Vivek) ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా ఏఐతో గత కాలపు కళాకారులను, గాయనీగాయకుల గాత్రాలను రీ క్రియేట్ చేసే సమయంలో ఎలాంటి లీగల్ ఇష్యూస్ తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. రాబోయే రోజుల్లో ఇంకా ఏయే రీతుల్లో కృత్రిమ మేధ అలరిస్తుందో చూడాలి.

Updated Date - Nov 23 , 2025 | 12:05 PM