‘అమ్మ’ అధ్యక్షురాలిగా శ్వేతా మీనన్‌!

ABN , Publish Date - Aug 16 , 2025 | 05:27 AM

అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌ (అమ్మ) నూతన అధ్యక్షురాలిగా నటి శ్వేతా మీనన్‌ ఎన్నికయ్యారు.

  • ‘అమ్మ’ చరిత్రలో మహిళకు ఇదే తొలి అవకాశం

అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌ (అమ్మ) నూతన అధ్యక్షురాలిగా నటి శ్వేతా మీనన్‌ ఎన్నికయ్యారు. శుక్రవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ కొచ్చిలో జరిగిన పోలింగ్‌లో శ్వేతకు 159 ఓట్లు రాగా, ఆమె ప్రత్యర్ధి, నటుడు దేవన్‌కు 132 ఓట్లు వచ్చాయి. దాంతో శ్వేత ఎన్నికయినట్లు ప్రకటించారు. 31 ఏళ్ల ‘అమ్మ’ చరిత్రలో ఒక మహిళ అధ్యక్షురాలిగా ఎన్నిక కావడం ఇదే ప్రథమం. పలువురు నటులు, దర్శకులపై నటీమణులు లైంగిక ఆరోపణలు చేసిన నేపథ్యంలో అధ్యక్షుడిగా ఉన్న మోహన్‌లాల్‌ నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేశారు. దీని వల్ల 2027లో జరగాల్సిన ఎన్నికలను ఇప్పుడే నిర్వహించారు.


అధ్యక్ష స్థానానికి పోటీ పడుతున్న శ్వేతా మీనన్‌పై కొన్ని రోజుల క్రితం ఓ కేసు నమోదు అయింది. ఈ నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో ఆమె గెలుపుపై ఉత్కంఠ ఏర్పడింది. 27 ఓట్ల ఆధిక్యంతో శ్వేత గెలిచి రికార్డ్‌ సృష్టించారు. తన గెలుపుపై ఆమె స్పందిస్తూ ‘ఇకపై ‘అమ్మ’ అంటే ఓ మహిళ అని గర్వంగా చెప్పవచ్చు’ అన్నారు. అసోసియేషన్‌ నుంచి వైదొలిగిన సభ్యులకు శ్వేత తిరిగి స్వాగతం పలికారు. అవసరమైతే తను వ్యక్తిగతంగా వారిని ఆహ్వానిస్తానని కూడా చెప్పారు. మోడలింగ్‌ నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టిన శ్వేత మలయాళ, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించారు. తెలుగులో ‘ఆనందం’, ‘జూనియర్స్‌’, ‘రాజన్న’ తదితర చిత్రాల్లో మెరిశారు.

Updated Date - Aug 16 , 2025 | 05:27 AM