Sharwanand: మెగాస్టార్, ప్రభాస్‌తో.. పోటీకి శర్వానంద్‌ రెడీ

ABN , Publish Date - Dec 03 , 2025 | 04:05 PM

శర్వానంద్ నటిస్తున్న 'బైకర్' మూవీ విడుదల వాయిదా పడినా... అతని మరో సినిమా 'నారీ నారీ నడుమ మురారి' మాత్రం సంక్రాంతికి వస్తుందని మేకర్స్ చెబుతున్నారు. అదే జరిగితే... శర్వానంద్ సంక్రాంతి సీజన్ లో గట్టి పోటీనే ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Nari Nari Naduma Murari

ఒకప్పుడు 'శతమానం భవతి (Sathamanam Bhavathi), మహానుభావుడు (Mahanubahvudu)' లాంటి పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన హీరో శర్వానంద్‌ (Sharwanand). క్లాస్ ఆడియెన్స్‌కి, ఫ్యామిలీస్‌కి ఆయనంటే ఒక నమ్మకం. కానీ, ఆ తరువాత వచ్చిన సినిమాలేవీ ఆ స్థాయి హిట్‌ను అందుకోలేక పోయాయి. దీంతో శర్వానంద్‌ తన రూట్‌ మార్చక తప్పలేదు. లుక్‌, స్టైలింగ్‌ దగ్గర నుంచి స్టోరీ సెలక్షన్ వరకూ తనను తాను మార్చుకుంటూ వస్తున్నాడు. ఈ ట్రాన్స్‌ఫర్మేషనే ఆయన లేటెస్ట్ మూవీ 'బైకర్' (Biker) లో స్పష్టంగా కనిపిస్తోంది. రీసెంట్‌గా రిలీజైన ఈ మేవీ పోస్టర్స్‌, టీజర్‌ చూస్తే శర్వానంద్‌లో వచ్చిన కొత్త మాస్ యాంగిల్ ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్‌ లుక్ గ్లింప్స్‌ తోటే ఆ సినిమాపై మంచి పాజిటివ్ వైబ్స్‌ క్రియేట్ చేయడంలో సక్సెస్ సాధించాడు. ఇది కచ్చితంగా శర్వానంద్‌కి టర్నింగ్‌ పాయింట్‌ అవుతుందని అందరూ భావించారు.


'బైకర్' సినిమాపై ఇంత పాజిటివ్ బజ్ ఉన్నా, రిలీజ్ విషయంలో మాత్రం ఒక సస్పెన్స్ నడుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే, 'అఖండ 2 తాండవం' (Akhanda 2 Thandavam) రిలీజైన నెక్ట్స్ డే డిసెంబర్ 6న 'బైకర్‌' కూడా విడుదల కావాల్సి ఉంది. కానీ ఏం జరిగిందో ఏమో కానీ సడెన్‌గా ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. టీజర్ ఎంత అద్భుతంగా ఉన్నా, గ్రాఫిక్స్, సౌండ్ మిక్సింగ్ విషయంలో యూనిట్‌ ఏ మాత్రం రాజీ పడదలచుకోలేదట! అందుకే క్వాలిటీ కోసం కొద్దిగా ఆలస్యమవుతోందని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఉన్న పాజిటివ్ బజ్‌ను క్యాష్ చేసుకోవాలంటే సోలో రిలీజ్ డేట్ కీలకం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో టీమ్ బిజీగా ఉన్నా, ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయడానికి యువి క్రియేషన్స్‌ వాళ్లు శతవిధాలా కష్టపడుతున్నారనేది మాత్రం నిజం.


ఇదంతా ఒకెత్తయితే... శర్వానంద్‌ హీరోగా చేస్తున్న మరో సినిమా 'నారీ నారీ నడుమ మురారి' (Naari Naari Naduma Murari) ని శరవేగంగా పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఎందుకంటే, శర్వానంద్‌కి సంక్రాంతి సీజన్‌ ఒక సెంటిమెంట్‌. సంక్రాంతి సీజన్‌లో ఇప్పటి వరకు శర్వానంద్‌ నటించగా వచ్చిన 'ఎక్స్ ప్రెస్ రాజా, శతమానం భవతి' మంచి విజయం సాధించాయి. ఆ సెంటిమెంట్‌ను కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఈ సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో తన 'నారీ నారీ నడుమ మురారి' సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాడు.

NNNM FIRST SINGLE OUT NOW LOCK insta Plain.jpg


ఈ సంక్రాంతికి పోటీ మాములుగా లేదు, ఎన్నడూ లేని విధంగా ఈ సంక్రాంతికి క్రేజ్‌ ఉన్న చిత్రాలన్నీ బరిలో నిలుస్తున్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న 'మన శంకర వరప్రసాద్ గారు' (Mana Shankara Varaprasad Gagu), ప్రభాస్‌ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'ది రాజాసాబ్‌' (The Rajasaab), నవీన్ పోలిశెట్టి హీరోగా చేస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'అనగనగా ఒక రాజు' (Anaganaga Oka Raju), మాస్ మహరాజా రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' (Bhartha Mahaasayulaku Wignapthi) మూవీ సంక్రాంతికి రాబోతున్నాయి. తమిళ స్టార్ హీరో విజయ్‌ చేస్తున్న చివరి చిత్రం 'జన నాయకుడు' (Jana Nayakudu) కూడా వస్తోంది. మరి ఇలా ఐదు సినిమాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్న తరుణంలో శర్వానంద్‌ 'నారీ నారీ నడుమ మురారి' వాయిదా పడొచ్చనే మాట వినిపించింది. కానీ తాజా సమాచారం ప్రకారం నిర్మాత అనిల్ సుంకర తన సినిమానూ ఇదే సీజన్ లో రిలీజ్ చేయాలని భావిస్తున్నాడట. సో... శర్వానంద్ కు ఇటు 'బైకర్', అటు 'నారీ నారీ నడుమ మురారి' సినిమాలు లిట్మస్ టెస్ట్ అనే చెప్పాలి. ఈ రెండు సినిమాల ఫలితాలపైనే శర్వా భవిష్యత్తు కూడా ఆధారపడి ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Also Read: Ravi Mohan: నిన్న రాజ్.. నేడు రవి.. పెళ్లి కాకుండానే వారితో

Also Read: Jai Akhanda: ఎంతపని చేశావ్ తమన్...

Updated Date - Dec 03 , 2025 | 06:39 PM