Kubera Female Team: అవకాశాలు అందుకున్నారు.. నిరూపించుకున్నారు

ABN , Publish Date - Jun 29 , 2025 | 03:54 PM

సినిమా మేకింగ్‌లో శేఖర్‌ కమ్ముల శైలివేరు. ఆయన ఆలోచన ధోరణి ఇతర మేకర్స్‌లా ఉండదు. కొత్తగా ఆలోచిస్తారు. కొత్తదనాన్ని ప్రోత్సహిస్తారు. అలాగే ఇండస్ట్రీకి కొత్తవారిని పరిచయం చేయడంలో ముందుంటారు. 'హ్యాపీడేస్‌’, 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ వంటి చిత్రాలు అందుకు ఉదాహరణ.

సినిమా మేకింగ్‌లో శేఖర్‌ కమ్ముల (Sekhar Kammula) శైలివేరు. ఆయన ఆలోచన ధోరణి ఇతర మేకర్స్‌లా ఉండదు. కొత్తగా ఆలోచిస్తారు. కొత్తదనాన్ని ప్రోత్సహిస్తారు. అలాగే ఇండస్ట్రీకి కొత్తవారిని పరిచయం చేయడంలో ముందుంటారు. 'హ్యాపీడేస్‌’, 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ వంటి చిత్రాలు అందుకు ఉదాహరణ. తాజాగా ఆయన తీసి హిట్‌ కొట్టిన కుబేర చిత్రానికీ  ఎంతోమంది పని చేశారు. అందులో ఎక్కువ శాతం ఆడవారే. డైరెక్షన్‌, కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ ఇలా పలు శాఖల్లో యంగ్‌ లేడీస్‌ పని చేశారు. అందుకే కుబేర విజయం మహిళలదే అని చెబుతున్నారు. వారు ఎవరు. వారి అంతరంగం ఏంటో చూద్దాం.. (Female technicians)

00000-navya.jpg

ప్రజాస్వామిక వాతావరణంలో... (kubera movie Female team)

నా పేరు అమూల్య. డైరక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌ డైరక్టర్‌గా పనిచేశా. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. శేఖర్‌ కమ్ముల ‘హ్యాపీడేస్‌’ విడుదలయినప్పుడు నాకు 12 ఏళ్లు. ఆ సినిమా చూసి డైరక్టర్‌ కావాలనుకున్నా. పెద్దయిన తర్వాత ఆయన దగ్గర అసిస్టెంట్‌గా పనిచేయటం ఒక గొప్ప అనుభవం. నేను పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లో. ముంబాయిలోని సుభాష్‌ ఘాయ్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో రైటింగ్‌, డైరెక్షన్‌లలో డిగ్రీ చేశా. ఇండస్ట్రీలో అడుగుపెట్టే సమయానికి నాకు ఎవరూ తెలీదు. పరిచయస్తులు ఇచ్చే సమాచారం ఆధారంగా అవకాశాలు వెతుక్కోవాల్సి వచ్చింది. అయితే అవకాశాలు త్వరగానే వచ్చాయి. ‘పరంపర’ వెబ్‌ సిరీస్‌ డైరక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశా. ఆ తర్వాత శేఖర్‌గారి దగ్గర చేరాను. షూటింగ్‌ సమయాల్లో రాత్రి, పగలు తేడా లేకుండా పనిచేయాల్సి ఉంటుంది. ఒక విధంగా చూస్తే మహిళలకు అది కష్టమే! కానీ అదృష్టవశాత్తు నేను చేసిన ప్రాజెక్టులలో నాకు పెద్ద కష్టం కాలేదు. ‘కుబేర’ టీమ్‌లో చాలామంది అమ్మాయిలు ఉండటం దీనికి ఒక కారణం. రెండోది శేఖర్‌ సార్‌ అనుసరించే విలువలు. ఆయన దగ్గర మన అభిప్రాయాలను సూటిగా చెప్పవచ్చు. ప్రతి వ్యక్తి అభిప్రాయానికి గౌరవం లభిస్తుంది. ఇలాంటి ప్రజాస్వామిక వాతావరణంలో పనిచేస్తున్నప్పుడు పెద్దగా ఒత్తిడి అనిపించదు. ఇక ఆయన ఎవరిపైనా చిరాకు పడటం చూడలేదు. డైరక్షన్‌ అనేది చాలా ఒత్తిడితో కూడుకున్న వ్యవహారం. అంత ఒత్తిడిలోను ఎప్పుడూ ఎవరిపైనా చిరాకు పడేవారు కాదు. ఆయన దగ్గర నుంచి నేను తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన విషయం అది. ఇక ‘కుబేర’ షూటింగ్‌ సమయంలో నేను మరచిపోలేని సంఘటన ఒకటి ఉంది. ధనుష్‌ పాటను 800 మంది జూనియర్‌ ఆర్టిస్టులతో చిత్రీకరించాం. మా అందరిపైనా విపరీతమైన ఒత్తిడి ఉంది. షూటింగ్‌ పూర్తయ్యాక... ధనుష్‌ సర్‌ వెళ్లిపోయిన వెంటనే అందరం రిలాక్స్‌ అయిపోయాం. బ్యాండ్‌ వాళ్లు వాయించటం ఆపలేదు. దాంతో అందరూ డ్యాన్స్‌ చేయటం మొదలుపెట్టారు. లైట్‌ బాయ్‌ నుంచి డైరక్షన్‌ డిపార్ట్‌మెంట్‌ వాళ్ల వరకూ అందరూ దాదాపు గంట డ్యాన్స్‌ చేశారు. నా జీవితంలో మరచిపోలేని సంఘటన అది.

  • అమూల్య, డైరక్షన్‌ డిపార్ట్‌మెంట్‌ (Amulya)

00-navya.jpg

అదే ఆయన ప్రత్యేకత

శేఖర్‌గారు సెట్‌లో పని చేస్తున్నప్పుడు చూడటం నేను మరచిపోలేని అనుభవం. ‘కుబేర’ నుంచి ఎంతో నేర్చుకున్నా. ఉదాహరణకు... ఒకఅసోసియేట్‌ డైరక్టర్‌ను కాబట్టి నాకు కథ తెలుసు. సీన్లు తెలుసు. కొన్నిసార్లు ఒక షాట్‌ను అనేకసార్లు తీయాల్సి వచ్చేది. ‘శేఖర్‌ సార్‌ ఏ షాట్‌ను ‘ఓకే’ చేశారా?’ అని గమనిస్తూ ఉండేదాన్ని. చాలా సందర్భాలలో- ఆయనకు ఒక షాట్‌ నచ్చేది. కానీ దానితో సంతృప్తి పడేవారు కాదు. నటీనటులకు చిన్న చిన్న మార్పులు సూచించేవారు. ఎడిటింగ్‌ టేబుల్‌ మీద చూసినప్పుడు- ఆ మార్పులే మొత్తం సీన్‌ను మార్చేసేవి. శేఖర్‌ సార్‌కు అంత ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎందుకు ఉందో నాకు అప్పుడు అర్ధమయ్యేది. ఆలాగే ఆయనకు జీవితం పట్ల ఉన్న దృక్పథం చాలా గొప్పది. దాని నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఎన్ని సవాళ్లు ఎదురైనా- ‘వీటిని మనం దాటగలం’ అనే ఆత్మవిశ్వాసం ఆయనలో కనిపించేది. ఆఫీసుకు వచ్చిన వెంటనే అందరినీ పలకరించేవారు. పేరు పేరునా ‘‘అన్నం తిన్నావా?’’ అని అడిగేవారు. ఇంకో విషయాన్ని కూడా ఇక్కడ చెప్పాలి. సాధారణంగా షూటింగ్‌లలో మహిళలకు బాత్‌రూమ్‌ల లాంటి సౌకర్యాలు లభించవు. ఎవరైనా డిమాండ్‌ చేస్తే- ‘‘ఇలా అయితే అమ్మాయిలతో పనిచేయటం కష్టం. అడ్జెస్ట్‌ అయిపోవాలి’’ అనే కామెంట్‌లు వినిపిస్తూ ఉంటాయి. కానీ ‘కుబేర’ షూటింగ్‌లో మాత్రం మహిళల కోసం ప్రత్యేకమైన సౌకర్యాలన్నీ కల్పించారు. భవిష్యత్తులో అందరూ ఈ ఒరవడిని పాటిస్తారనుకుంటున్నాను.

- కీర్తి, డైరక్షన్‌ డిపార్ట్‌మెంట్‌ (Keerthi)


0000-navya.jpg

అనేక ప్రపంచాలుఉన్నాయి

నేను పుట్టి పెరిగింది చెన్నైలో. ఇంతకు ముందు ధనుష్‌ సార్‌కు డిజైనర్‌గా పనిచేశా. శేఖర్‌ సార్‌ ఈ సినిమా కథ చెప్పిన వెంటనే వాటిలో ఉన్న ప్రపంచాలు, వాటి మధ్య వైరుధ్యాలు నాకు స్పష్టంగా కనిపించాయి. ఈ వైరుధ్యాలను ఒకేసారి చూపించాలి. ఏ డిజైనర్‌కైనా ఈ చిత్రం ఒక సవాల్‌ అనే చెప్పాలి. ఇందులో నలుగురు బిచ్చగాళ్లు ఉంటారు. ఒకరు తిరుపతి నుంచి, ఒకరు కేరళ నుంచి, ఒకరు కోల్‌కతా నుంచి, మరొకరు అసోం నుంచి వచ్చిన వారు. ఈ ప్రాంతాల్లో ప్రజలు దుస్తులు ధరించే విధానం వేరుగా ఉంటుంది. ఈ బిచ్చగాళ్లు వేసుకొనే దుస్తులు వాటిని ప్రతిబింబించాలి. దాని కోసం చాలా రీసెర్చ్‌ చేయాల్సి వచ్చింది. ఈ నలుగురిలో ఒక అమ్మాయి కూడా ఉంటుంది. ఈ అమ్మాయికి ఎలాంటి దుస్తులు వేయాలనే విషయంపై చాలా చర్చ జరిగింది. సాధారణంగా మనం గ్రామీణ ప్రాంతాల్లో పేదవారిని గమనిస్తే- వారు దుస్తులపైన ఒక గుడ్డను ధరిస్తారు. అది చున్నీ కావచ్చు, తువ్వాలు కావచ్చు. ఈ అమ్మాయికి కూడా అలాంటి దుస్తులనే డిజైన్‌ చేశాం. వారి దుస్తులు సహజంగా కనిపించటం కోసం చాలా కష్టాలు పడ్డాం. ముందు ఉతికే వాళ్లం. ఎండబెట్టే వాళ్లం. చిరుగులు కోసం రాతి మీద తోమేవాళ్లం. ధనికుల విషయానికి వస్తే మాకు అనేక రిఫరెన్స్‌లు లభించాయి. బాగా ధనికులు గాడీ రంగులు వేసుకోరు. వారు వేసుకొనే సూట్స్‌, షర్ట్స్‌... అన్నీ క్లాసిక్‌గా ఉంటాయి. వారు పెట్టుకొనే వాచ్‌లు, కళ్లజోళ్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ సినిమాలో సంక్లిష్టమైన సన్నివేశాలున్నాయి. వాటికి తగ్గట్టుగా దుస్తులను డిజైన్‌ చేయటం నిజంగా సవాలే! ఒక సీన్‌లో ధనుష్‌ మడ అడవుల ప్రాంతంలో బాగా తడిసిపోయి రోడ్డు మీదకు వస్తారు. ఆయన దుస్తుల మీద బురద, చిన్న చిన్న ముళ్లు కనిపించాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాలలో తీసుకున్న శ్రద్ధ్ద కూడా ఈ చిత్ర విజయానికి కారణమయింది.

కావ్య శ్రీరాం, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ (kavya)

01-navya.jpg

పేరు చెప్పినప్పుడు థ్రిల్‌ అయ్యా...

నేను తోట తరణి గారి దగ్గర పనిచేసేదాన్ని. ఆయన ద్వారానే నాకు ‘కుబేర’లో పనిచేసే అవకాశం వచ్చింది. నేను ఇంటర్‌ దాకా గుంటూరులో చదివాను. ఆ తర్వాత జేఎన్‌టీయూలో... ఆర్కిటెక్చర్‌లో డిగ్రీ చేశాను. ‘మసుదా’ అనే థ్రిల్లర్‌ సినిమాకు పనిచేశా. ప్రస్తుతం ‘ఘాటి’, ‘హరిహరవీరమల్లు’ సినిమాలకు పనిచేస్తున్నా. ‘కుబేర’ గురించి చెప్పాలంటే- శేఖర్‌ సార్‌ గురించి తప్పని సరిగా చెప్పాలి. ఆయన దగ్గర పని చేస్తున్నప్పుడు... ‘ఒకరు ఎక్కువ-ఒకరు తక్కువ’ అనే తేడా కనిపించదు. అందరికీ తమ అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ లభిస్తుంది. అంతదాకా ఎందుకు... ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌లో శేఖర్‌ సార్‌ మాట్లాడుతూ నా పేరు కూడా ప్రస్తావించారు. నాకు విపరీతమైన థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఇక ‘కుబేర’ షూటింగ్‌ సమయంలో మేము ఎదుర్కొన్న ఛాలెంజ్‌ డంప్‌ యార్డ్‌ సెట్‌. దీనిని వీలైనంత సహజంగా తీర్చిదిద్దటానికి ప్రయత్నించాం. స్ర్కిన్‌ మీద నిజంగా డంప్‌ యార్డ్‌లోనే తీసినంత బాగా వచ్చింది. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ అనగానే అంతా మగవాళ్లే అనే అభిప్రాయం ఉంది. ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి. మహిళా ఆర్ట్‌ డైరక్టర్లు కూడా వస్తున్నారు. వారందరూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.

ఇంద్రాణి, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌

sekhar.jpeg

Updated Date - Jun 29 , 2025 | 04:04 PM