Santhana Prapthirasthu: వినోదాల విందు ఖాయం

ABN , Publish Date - Nov 06 , 2025 | 06:53 PM

విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన 'సంతాన ప్రాప్తిరస్తు' మూవీ నవంబర్ 14న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా దిల్ రాజు చేతుల మీదుగా మూవీ ట్రైలర్ విడుదలైంది.

Santhana prapthirasthu Movie

విక్రాంత్ (Vikranth), చాందినీ చౌదరి (Chandini Chowdary) జంటగా నటిస్తున్న 'సంతాన ప్రాప్తిరస్తు' (Santhana Prapthirasthu) సినిమా నవంబర్ 14న విడుదల కాబోతోంది. మధుర శ్రీధర రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాను సంజీవ్ రెడ్డి డైరెక్ట్ చేశాడు. షేక్ దావూద్ జి స్క్రీన్ ప్లే అందించారు. గురువారం ఈ సినిమా ట్రైలర్ ను దిల్ రాజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఆనంద్ దేవరకొండ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ, 'మా అన్నయ్య విజయ్ దేవరకొండ నటించిన 'పెళ్ళిచూపులు' థియేటర్స్ లో వర్కౌట్ కాదని చాలామంది అన్నా ధైర్యంగా శ్రీధర్ సార్ ధైర్యంగా ముందుకెళ్ళారు. అలానే నాకు 'దొరసాని' సినిమాలో తొలి అవకాశం ఇచ్చింది కూడా ఆయనే. ఆయన హార్డ్ వర్క్ తప్పనిసరిగా పే చేస్తుంది. అది సంతాన ప్రాప్తిరస్తు విషయంలో నిజమౌతుందనే నమ్మకం ఉంది' అని అన్నారు.


దిల్ రాజు మాట్లాడుతూ, 'అప్పట్లో 'కళ్యాణ ప్రాప్తిరస్తు' అనే మాట వినేవాళ్ళం... ఇప్పుడు 'సంతాన ప్రాప్తిరస్తు' అనే మాట వింటున్నాం. ఇవాళ లివ్ ఇన్ రిలేషన్, వెడ్డింగ్ అనేవి సులువు అయిపోయాయి. అయితే పిల్లలు పుట్టడమే సమస్యగా మారిపోయింది. ఇవాళ ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడం ఛాలెంజ్ గా మారిపోయింది. ఇవాళ్టి నుండీ మీరు మరింత కష్టపడి ఆ పనిని సక్సెస్ ఫుల్ గా చేయాలి. ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.

హీరోయిన్ చాందినీ చౌదరి మాట్లాడుతూ - 'మన సొసైటీలో ఫెర్టిలిటీ ఇష్యూ చాలా ఉంది. అయితే దాని గురించి మాట్లాడేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇదొక మాట్లాడకూడని విషయమని అనుకుంటున్నారు. మేల్ ఫెర్టిలిటీ అనే ఇష్యూను తీసుకుని ఎంటర్ టైన్ మెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఎక్కడా హద్దు దాటకుండా సెన్సబుల్ గా ప్రేక్షకులంతా కలిసి చూసేలా మా చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు సంజీవ్ రెడ్డి. ట్రైలర్ ను అందరికీ షేర్ చేయండి. మీ ఫ్యామిలీ , ఫ్రెండ్స్ తో ఈ నెల 14న థియేటర్స్ కు రావాలని రిక్వెస్ట్ చేస్తున్నా' అని అన్నారు.


హీరో విక్రాంత్ మాట్లాడుతూ, 'ఆనంద్, నేను యూఎస్ లో ఉద్యోగాలు చేసి సినిమా మీద ప్యాషన్ తో ఇక్కడికి వచ్చాం. ఆనంద్ 'బేబి' మూవీతో మంచి విజయాన్ని అందుకున్నారు. నేను గతంలో ఒక సినిమా చేశాను. ఆ మూవీ సరిగ్గా ఆదరణ పొందలేదు. నిరాశలో ఉన్న ఆ టైమ్ లో మధుర శ్రీధర్ గారు నీతో సినిమా చేస్తాను అని సపోర్ట్ గా నిలబడ్డారు. ఆ తర్వాత హరి ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. ఈ చిత్రంలో చైతన్య అనే సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ క్యారెక్టర్ లో నటించాను. ఆ పాత్రకు తగినట్లు నన్ను దర్శకుడు సంజీవ్ గారు మార్చేశారు. సెట్ లోకి వెళ్లాక నన్ను నేను చూసుకుంటే కొత్తగా అనిపించింది. ఇందులో మేల్ ఫెర్టిలిటీ అనే కొత్త విషయం ఉంది. కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్, సినిమా చివరలో ఎమోషన్స్ ఉన్నాయి. ఒక మంచి మెసేజ్ కూడా ఉంది. ఇవన్నీ ఇప్పుడున్న ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించే ఎలిమెంట్స్. కాబట్టి ఈ సినిమా తప్పకుండా మీ ఆదరణ పొందుతుందని నమ్ముతున్నాను' అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నిర్మాతలతో పాటు రైటర్ కళ్యాణ్ రాఘవ్, షేక్ దావూద్ జి, డైరెక్టర్ సంజీవ్ రెడ్డి, సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఈ మూవీ మేకింగ్ అనుభవాలను తెలిపారు.

Updated Date - Nov 06 , 2025 | 06:53 PM