The Paradise: రూటు మార్చిన.. సంపూర్ణేష్‌ బాబు! 'ది ప్యారడైజ్' నాని ఫ్రెండ్‌గా.. బ‌ర్నింగ్ స్టార్‌

ABN , Publish Date - Dec 19 , 2025 | 07:04 PM

కామెడీ స్టార్ హీరో సంపూ రూట్ మార్చాడు. ఇప్పుడు సీరియస్ పాత్రలపై దృష్టి పెట్టాడు. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న 'ది ప్యారడైజ్'లో సంపూ... బిర్యాని అనే సీరియస్ క్యారెక్టర్ చేస్తున్నాడు.

The Paradise Movie

నేచురల్ స్టార్ నాని (Nani) ఇమేజ్ ను మార్చుకున్నట్టే కామెడీ స్టార్ సంపూర్ణేష్‌ బాబు (Sampoornesh Babu) సైతం తన ఇమేజ్ ను మార్చుకునే ప్రయత్నంలో పడ్డాడు. అందుకు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) మూవీ 'ది పారడైజ్' (The Paradise) తోనే శ్రీకారం చుట్టాడు. ప్రస్తుతం నాని 'ది ప్యారడైజ్' మూవీలో నటిస్తున్నాడు. తెలుగులో ఇంతవరకూ వచ్చిన కాన్సెప్ట్ బేస్డ్ యాక్షన్ మూవీస్ ఇదో మైలు రాయి కాబోతోందని ప్రమోషన్స్ చూస్తుంటే అర్థమౌతోంది. అలాంటి ఓ ఎపిక్ యాక్షన్ మూవీలో సంపూర్ణేష్‌ బాబు హీరో జడల్ స్నేహితుడు బిర్యానీ పాత్రను పోషిస్తున్నాడు.


'ప్యారడైజ్ లో బిర్యానీ' అని చెప్పుకోవడానికి కాస్తంత కామెడీగా ఉంటుంది కానీ సంపూ గెటప్ చూస్తే మాత్రం చిన్నపిల్లల ఒళ్లు జలదరించడం ఖాయం. కుడి చేతిలో పొడవైన ఇనుప ఆయుధాన్ని ధరించి, మరో చేతితో సిగరెట్ తాగుతున్న ఈ గెటప్ చూస్తే ఎవరైన ఒక్క నిమిషం ఇది సంపూ నేనా అనే సందేహంలో పడతారు. రెండు చేతులు రక్తంతో తడిచి ఉండటం చూస్తుంటే... ఏదో నరమేథం పూర్తి చేసి రిలాక్స్డ్ గా సిగరెట్ తాగుతున్న భావన కలుగుతోంది.

ఇంతవరకూ ప్రేక్షకులను తన కామెడీతో ఎంటర్ టైన్ చేసింది చాలని బహుశా సంపూ కూడా భావించినట్టున్నాడు. మరి అతని కోరికకు తగ్గట్టుగా 'ది ప్యారడైజ్'లో సంపూ యాక్షన్ అవతార్ తో ఏమేరకు మెప్పిస్తాడో చూడాలి. అయితే విలనీ పండించే కామెడీయన్స్ మనకేమీ కొత్త కాదు... నిన్న కాక మొన్న సునీల్ (Sunil) 'పుష్ప'లోనూ, దానికి ముందు కొన్ని సినిమాల్లోనూ నికార్సైన విలన్ గా నటించి మెప్పించాడు. ఇప్పుడు తమిళ సినిమా రంగంలోని మెయిన్ విలన్స్ జాబితాలో సునీల్ కూడా చేరిపోయాడు. ఏమో రేపు సంపూ కూడా హద్దులు చెరిపేసుకుని పరభాషల్లోనూ ప్రతినాయకుడిగా అవకాశాలు సంపాదించుకుంటాడేమో!

Updated Date - Dec 19 , 2025 | 08:12 PM