Samantha: నాకొక గుర్తింపును ఇచ్చారు

ABN , Publish Date - Jul 07 , 2025 | 03:02 AM

‘నేను ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా, ఏ పరిశ్రమలో పనిచేసినా ..తెలుగు ప్రేక్షకులు నన్ను చూసి గర్వపడాలని భావిస్తాను. ఇన్నేళ్ల ప్రయాణంలో నాకు మద్దతుగా...

‘నేను ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా, ఏ పరిశ్రమలో పనిచేసినా ..తెలుగు ప్రేక్షకులు నన్ను చూసి గర్వపడాలని భావిస్తాను. ఇన్నేళ్ల ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచినందుకు ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాను. మీరంతా నాకంటూ ఒక గుర్తింపునూ, కుటుంబాన్నీ ఇచ్చారు’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు నటి సమంత. అమెరికాలో జరుగుతున్న తెలుగు అసోసిషియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా) వేడుకల్లో పాల్గొన్నారు సమంత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ తానా వేడుకల్లో పాల్గొనడానికి నాకు 15 ఏళ్లు పట్టిందంటే నమ్మలేకపోతున్నా. ప్రతి ఏటా ఇక్కడ జరిగే వేడుకలు, తెలుగువారి గురించి వింటూనే ఉన్నాను. నా తొలి చిత్రం ‘ఏ మాయ చేసావే’ నుంచి నన్ను మీ మనిషిలా భావించారు. నాపై ప్రేమను చూపించారు. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు చెప్పడానికి నాకు ఇన్నేళ్లు పట్టింది. కెరీర్‌ పరంగా ముఖ్యమైన దశలో ఉన్నాను. ట్రాలాలా పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించాను. నిర్మాతగా ‘శుభం’తో తొలి అడుగు వేశా. నార్త్‌ అమెరికాకు చెందిన తెలుగువారు నా చిత్రాన్ని ఎంతగానో మెచ్చుకున్నారు’ అని అన్నారు.

Updated Date - Jul 07 , 2025 | 03:02 AM