Ritwik Ghatak: 'మధుమతి' రచయిత.. రిత్విక్ ఘటక్ శతజయంతి

ABN , Publish Date - Nov 04 , 2025 | 09:01 PM

ప్రఖ్యాత బెంగాల్ సినిమా దర్శకుడు, స్క్రీన్ రైటర్, నటుడు, నాటక రచయిత రిత్విక్ ఘటక్ (Ritwik Ghatak) శతజయంతి నవంబర్ 4న పూర్తయింది.

Ritwik Ghatak

ప్రఖ్యాత బెంగాల్ సినిమా దర్శకుడు, స్క్రీన్ రైటర్, నటుడు, నాటక రచయిత రిత్విక్ ఘటక్ (Ritwik Ghatak) శతజయంతి నవంబర్ 4న పూర్తయింది. 1925 నవంబర్ 4వ తేదీన అవిభాజ్య భారతదేశంలోని రాజ్ షాహీలో జన్మించారు. ప్రస్తుతం ఈ నగరం బంగ్లాదేశ్ లో ఉంది. రిత్విక్ ఘటక్ అంటే తెలియని బెంగాలీయుడు ఉండడు.

అయితే ఇతరులకు ఆయన పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే సినిమా దిలీప్ కుమార్, వైజయంతి మాల జంటగా బిమల్ రాయ్ తెరకెక్కించిన 'మధుమతి' (Madhumati)(1958). ఈ సినిమాకు ముందు పునర్జన్మ కథలతో అనేక చిత్రాలు రూపొందాయి. అయినప్పటికీ 'మధుమతి' సక్సెస్ తో పలు భాషల్లో పునర్జన్మ కథలు విరివిగా వెలుగు చూశాయి. ఆ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే సమకూర్చింది రిత్విక్ ఘటక్. 'మధుమతి' సినిమా బిగ్ హిట్ గా నిలచింది. రిత్విక్ ఘటక్ కెరీర్ లో ఇదొక్కటే కమర్షియల్ హిట్.

 Ritwik Ghatak

భారతీయ సినిమాకు అంతర్జాతీయంగా గుర్తింపు సంపాదించి పెట్టిన సత్యజిత్ రే (Satyajit Ray), ఆయన సమకాలికులు తపన్ సిన్హా, మృణాల్ సేన్ వంటి వారి పేర్లు గుర్తుకు వచ్చిన ప్రతీసారి రిత్విక్ ఘటక్ ను కూడా బెంగాలీయులు గుర్తు చేసుకుంటారు. ఘటక్ తెరకెక్కించిన చిత్రాలు కమర్షియల్ సక్సెస్ చూడక పోయినా, ఆయన భావాలను విద్యాధికులు విశేషంగా గౌరవించే వారు.

రిత్విక్ ఘటక్ 1948లో రాసిన తొలి నాటిక 'కాలో సాయర్' విశేషాదరణ చూరగొంది. ఆయన కలం నుండి జాలువారిన "దోలిల్, కటో ధానే కటో ఛాల్, నేతాజీ కే నై, జ్వాల" వంటి నాటకాలు బెంగాలీయులను విశేషంగా అలరించాయి. వీటిలో రిత్విక్ నటించడం విశేషం. నాటకరంగంలో రిత్విక్ తనదైన బాణీ పలికించారు.

 Ritwik Ghatak

హృషికేశ్ ముఖర్జీ 'ముసాఫిర్' సినిమాకు తొలిసారి స్క్రీన్ ప్లే రాశారు రిత్విక్. 'మధుమతి' చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే సమకూర్చారు. "స్వరలిపి, కుమారి మోన్, దీపర్ నామ్ తియా రోంగ్, రాజ్ కన్య, హీరేర్ ప్రజాపతి" వంటి చిత్రాలకు రచనలో పాలు పంచుకున్నారాయన. "తథాపి, చిన్నమూల్, కుమారి మోన్ సుబర్ణరేఖ, తిటాష్ ఏక్తీ నాదిర్ నామ్, జుక్తీ టక్కో ఆర్ గప్పో" వంటి బెంగాలీ చిత్రాలలో నటించారు. 1974లో స్వీయ దర్శకత్వంలో రూపొందించిన 'జుక్తీ టక్కో ఆర్ గప్పో' సినిమాకు బెస్ట్ స్టోరీ రైటర్ గా నేషనల్ అవార్డు అందుకున్నారు రిత్విక్. 1970లో 'పద్మశ్రీ' అవార్డు లభించింది.

రిత్విక్ తనయుడు రితాబన్ ఘటక్ (Ritaban Ghatak)కూడా తండ్రి బాటలో పయనిస్తూ నిర్దేశకుడుగా మారారు. రిత్విక్ మెమోరియల్ ట్రస్ట్ స్థాపించి ఎంతోమంది ఔత్సాహికులకు ప్రోత్సాహక బహుమతులు అందించారు రితాబన్. రిత్విక్ శతజయంతి సందర్భంగా పలువురు మేధావులు ఆయన సంస్మరణ సభ నిర్వహించి ఘటక్ ప్రతిభను ఎంతగానో శ్లాఘించారు.

Updated Date - Nov 04 , 2025 | 09:02 PM