Tollywood: రంగంలోకి రేవంత్‌ సర్కార్‌.. అతి త్వరలోనే పరిష్కారం

ABN , Publish Date - Aug 21 , 2025 | 05:20 AM

సినీ కార్మికుల సమ్మె 17వ రోజుకు చేరుకున్న తరుణంలో.. బుధవారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ను సినిమా హబ్‌గా మార్చాలన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సంకల్పానికి సినీ కార్మికుల సమ్మె అడ్డంకిగా మారుతోందని...

సినీ కార్మికుల సమ్మె 17వ రోజుకు చేరుకున్న తరుణంలో.. బుధవారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ను సినిమా హబ్‌గా మార్చాలన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సంకల్పానికి సినీ కార్మికుల సమ్మె అడ్డంకిగా మారుతోందని భావించిన ప్రభుత్వం.. సమస్యకు ముగింపు పలకడానికి నేరుగా రంగంలోకి దిగింది. ఈ మేరకు సమ్మె వ్వవహారంపై ఇరువర్గాలతో చర్చించి పరిష్కరించాలని హోమ్‌ శాఖ ప్రధాన కార్యదర్శి రవి గుప్తను, కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ ప్రధాన కార్యదర్శి దాన కిశోర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ వ్యవహారంలో ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు పాత్ర కీలకంగా మారనుంది. ప్రభుత్వ జోక్యంతో అతి త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారమవుతుందని సినీ ప్రముఖులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌, ఫిల్మ్‌ ఫెడరేషన్‌ నాయకులను పిలిపించుకుని చర్చలు జరిపినట్లు సమాచారం. ‘ఇప్పటికే 30 శాతం వేతన పెంపును అంగీకరించిన నిర్మాతల సినిమాలకు మా కార్మికులు పనిచేస్తున్నారు. గురువారం నుంచి 20 శాతం వేతన పెంపును ఇచ్చే నిర్మాతల సినిమాలకు కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అని ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ప్రతినిధులు కమిషనర్‌ సీవీ ఆనంద్‌కు వివరించినట్లు తెలిసింది. త్వరలోనే జూబ్లీహిల్స్‌ నియోజక వర్గానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో.. అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న సినీ కార్మికుల ఓట్లు కీలకం కావడం కూడా ఈ తాజా పరిణామానికి కారణమనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

Updated Date - Aug 21 , 2025 | 06:10 AM