Rashmika Mandanna: మరో వివాదంలో రష్మిక.. కన్నెర్ర చేసిన కన్నడిగులు

ABN , Publish Date - Jul 05 , 2025 | 05:54 PM

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే.

Rashmika Mandanna

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఇండస్ట్రీ మొత్తంలో అమ్మడు మాత్రమే టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈమధ్యనే కుబేర (Kuberaa) సినిమాతో వంద కోట్ల క్లబ్ లో చేరిన రష్మీకి.. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా మారింది. సినిమాల విషయం పక్కన పెడితే.. రష్మిక ఎప్పుడు వివాదాలను ఏరికోరి కొనితెచ్చుకుంటుంది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. అమ్మడు కావాలనే మాట్లాడుతుందో.. లేక నోటి దురుసు వలన మాట్లాడుతుందో అర్ధమే కాదు.


ముఖ్యంగా కన్నడ ఇండస్ట్రీ గురించి రష్మిక ఏది మాట్లాడినా వివాదమే. రష్మిక కన్నడ నటి అన్న విషయం అందరికీ తెల్సిందే. ఎన్నోసార్లు ఆమె తన సొంత ఇండస్ట్రీపైనే విమర్శలు చేసింది. ఆమె మొదటి సినిమా కిర్రాక్ పార్టీ దగ్గర నుంచి ఇప్పటివరకు కన్నడ ఇండస్ట్రీపై పలుసార్లు దుమారం రేపేవిధంగా మాట్లాడింది. మాట్లాడిన ప్రతిసారి కన్నడిగులు రష్మిక మీద ఫైర్ అవుతూనే వస్తున్నారు. అయినా కూడా నేషనల్ క్రష్ లో ఇసుమంతైనా మార్పు రాలేదు. ఈ జనరేషన్ లో ఏది మాట్లాడితే ఏలాంటి గొడవ వస్తుందో అని చాలామంది నోళ్లు కట్టేసుకుంటున్నారు. కానీ రష్మిక మాత్రం తన నోటికి ఏది వస్తే అది మాట్లాడేసి ఇదిగో ఇలా వివాదంలో ఇరుక్కుంటూనే ఉంది.


తాజాగా రష్మిక ఒక ఇంటర్వ్యూలో తాను కొడవ కమ్యూనిటీ నుంచి వచ్చానని చెప్పుకొచ్చింది. కర్ణాటకలో ఇదొక కమ్యూనిటీ. అయితే ఇది చెప్పడంలో తప్పు లేదు. కానీ, ఈ భామ అంతకుమించి కొడవ కమ్యూనిటీ నుంచి వచ్చి ఇండస్ట్రీలో సెటిల్ అయిన ఏకైక హీరోయిన్ నేనే అని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది. అదే ఇప్పుడు కన్నడిగులను కన్నెర్ర చేసేలా చేసింది. 'నేను కొడవ కమ్యూనిటీ నుంచి వచ్చాను. ఇప్పటివరకు ఎవరు మా కమ్యూనిటీ నుంచి రాలేదు. అసలు నేను ఆడిషన్స్ కు వెళ్తున్నాను అన్న విషయం కూడా ఇంట్లో చెప్పలేదు. ఆడిషన్ సక్సెస్ అయ్యాక చెప్పాను' అని చెప్పుకొచ్చింది.


ఇక కన్నడిగులు రష్మిక వ్యాఖ్యలుపై ఫైర్ అవుతున్నారు. ముందు వెనుకా తెలుసుకోకుండా మాట్లాడితే బాగోదని, నిన్ను నువ్వు గొప్పగా చెప్పుకోవడానికి కమ్యూనిటీని వాడుకొనవసరం లేదు. నీకన్నా ముందే చాలామంది హీరోయిన్స్ కొడవ కమ్యూనిటీ నుంచి ఇండస్ట్రీకి వచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు. నటి ప్రేమ కూడా కొడవ కమ్యూనిటీ నుంచి వచ్చిందే. నీకన్నా ముందు ఆమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ్, కన్నడలో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించింది. ఆమె మాత్రమే కాకుండా నిధి సుబ్బయ్య, హర్షిక పూనాచ, శుభ్ర అయ్యప్ప వీరందరూ అదే కమ్యూనిటీకి చెందిన వారు. దీంతో వీరి పేర్లు చెప్తూ నెటిజన్స్ రష్మికను ఏకిపారేస్తున్నారు.

Updated Date - Jul 05 , 2025 | 05:58 PM