Rana: నెపోటిజంపై రానా రియాక్షన్‌.. పని చేయాల్సిందే

ABN , Publish Date - Jun 07 , 2025 | 07:31 PM

ఏ చిత్ర పరిశ్రమలో అయిన నెపోటిజం అనేది హాట్‌ టాపిక్కే. ఇప్పటికే ఈ విషయంపై బాలీవుడ్‌లో ఎన్నోసార్లు చర్చ జరిగింది. టాలీవుడ్‌లోనూ అప్పుడప్పుడూ ఈ వివాదం గురించి చర్చ నడుస్తుంటుంది.


ఏ చిత్ర పరిశ్రమలో అయిన నెపోటిజం (Nepotism) అనేది హాట్‌ టాపిక్కే. ఇప్పటికే ఈ విషయంపై బాలీవుడ్‌లో ఎన్నోసార్లు చర్చ జరిగింది. టాలీవుడ్‌లోనూ అప్పుడప్పుడూ ఈ వివాదం గురించి చర్చ నడుస్తుంటుంది. దీనిపై తాజాగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రానా దగ్గుబాటి (Rana Daggubati)). ‘రానా నాయుడు 2’ వెబ్‌ సిరీస్‌ (Rana naidu 2)ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన  ఇంటర్వ్యూలో ఆయన నెపోటిజం గురించి మాట్లాడారు.

‘‘చిత్ర పరిశ్రమకు చెందిన కుటుంబం నుంచి రావడం వల్ల ఇండస్ర్టీ గురించి మరింత ఎక్కువగా తెలుసుకునే వెసులుబాటు మాత్రమే ఉంటుంది.  అవకాశాలు రావడానికి కుటుంబ నేపథ్యం కాస్త ఉపయోగపడుతుంది. కుటుంబానికి చెందిన రంగంలోకి అడుగుపెట్టడం వల్ల ఇతరులతో పోలిస్తే ఈ పరిశ్రమ గురించి మరింతగా అర్థం చేసుకునేందుకు అవకాశం ఉంది. సినీ పరిశ్రమలోనూ ఇదే పరిస్థితి ఉంటుంది. ఫిల్మ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న కుటుంబం నుంచి పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పుడు అవకాశాలు త్వరగా వస్తాయి. అంతకుమించి ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే, ఫిల్మ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నా లేకున్నా.. చివరకు నువ్వు మాత్రం కెమెరా ముందు నిల్చోవాల్సిందే. యాక్ట్‌ చేయాల్సింది. నువ్వు చేేస పని మీదే నీ కెరీర్‌ ఆధారపడి ఉంటుంది. మా అమ్మ ఫిల్మ్‌ లేబరేటరీలో వర్క్‌ చేశారు. నాన్న స్టూడియో నడిపిస్తున్నారు. బాబాయ్‌ నటుడు. దానివల్లే నాకు ఆ మూడు విభాగాలపై అవగాహన ఉంది’’ అని రానా అన్నారు.

వెంకటేశ్‌, రానా కీలక పాత్రధారులుగా నటించిన వెబ్‌ సిరీస్‌ ‘రానా నాయుడు’. నెట్‌ఫ్లిక్స్‌ (Netflix Ott) ఓటీటీలో 2023లో విడుదలై ప్రేక్షకాదరణ పొందిన సిరీస్‌ ఇది.  దీనికి కొనసాగింపుగా ‘రానా నాయుడు 2’ రానుంది. తాజాగా వచ్చిన ప్రమోషనల్‌ కంటెంట్‌ చూస్తే తొలి సిరీస్‌ కన్నా ఇది రెట్టింపు వినోదాన్ని పంచేలా కనిపిస్తుంది. అర్జున్‌ రాంపాల్‌, సుర్వీన్‌ చావ్లా, కృతి కర్బంద, సుశాంత్‌ సింగ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ర్టీమింగ్‌ కానుంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది.

Updated Date - Jun 07 , 2025 | 07:36 PM