రామాయణ బడ్జెట్ అవతార్‌ను మించి
ABN , Publish Date - Jul 16 , 2025 | 03:00 AM
భారతీయులు ఎంతగానో అభిమానించే ఇతిహాసం రామాయణం. ఇంతవరకూ ఎంతో మంది తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రామాయణ గాథను తెరకెక్కించారు. ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. ఇప్పుడు మరో సారి...
భారతీయులు ఎంతగానో అభిమానించే ఇతిహాసం రామాయణం. ఇంతవరకూ ఎంతో మంది తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రామాయణ గాథను తెరకెక్కించారు. ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. ఇప్పుడు మరో సారి దర్శకుడు నితిశ్ తివారీ ‘అంతకుమించి’ అనే రీతిలో, భారీ స్థాయిలో రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ప్రకటించిన రోజు నుంచే అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ సినిమా ప్రపంచ ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతి కలిగించాలని, నిర్మాణపరంగా రాజీ పడకూడదనీ నిర్మాత నమిత్ మల్హోత్రా తపన. ‘రామాయణ’ మొదటి భాగం రూ.900 కోట్లని, రెండు భాగాలకూ కలపి రూ.1600 కోట్లు అవుతాయని ప్రచారం జరిగింది. అయితే తమ సినిమా బడ్జెట్ ‘అంతకుమించి’ అంటూ అసలు బడ్జెట్ రూ.4000 కోట్ల రూపాయలు అని అధికారంగా వెల్లడించి అందరినీ ఆశ్చర్య పరిచారు. భారతీయ సినిమా కనీవినీ ఎరుగని భారీ బడ్జెట్ అది! ‘భారతీయ ఇతిహాస గ్రంఽథం రామాయణానికి దృశ్యరూపమివ్వాలన్న ఈ ప్రయాణం ఐదారేళ్ల క్రితం మొదలైంది. ‘రామాయణ’ను తీయాలనుకుంటున్నప్పుడు దీని బడ్జెట్ విని అందరూ నన్ను పిచ్చోడనుకున్నారు. ఎందుకంటే ఈ సినిమా రెండు భాగాల బడ్జెట్ చిత్రీకరణ పూర్తయ్యే సమయానికి 500 మిలియన్ డాలర్లు (రూ.4000 కోట్లు) దాటిపోతుంది. ప్రపంచంలోనే అతిగొప్ప కథను అందరికీ అందించడానికి చేస్తున్న ప్రయత్నమిది. ప్రపంచమంతా చూడాల్సిన ఓ అతిపెద్ద చిత్రాన్ని హాలీవుడ్ చిత్రాలకు వెచ్చించే దాని కంటే తక్కువ ఖర్చుతోనే తీస్తున్నామన్న భావన నాకుంది’’ అని చెప్పారు.
పలు హాలీవుడ్ చిత్రాల కంటే ఎక్కువ
ఇప్పుడు ఈ బడ్జెట్ గురించి విన్న వారంతా ‘వామ్మో ఓ భారతీయ సినిమాకు ఇంత బడ్జెట్టా’ అని నోరెళ్లబెడుతున్నారు. ఇప్పటి వరకూ హాలీవుడ్ చిత్రాలనే వేల కోట్ల రూపాయలతో తీస్తున్నారు. ‘అవతార్’ సినిమా బడ్జెట్ 237 మిలియన్ డాలర్లు (రూ.2000 కోట్లు). ‘అవెంజర్స్’ తొలి రెండు భాగాలకు అయిన ఖర్ఛు 300 మిలియన్ డాలర్లు (రూ.2500 కోట్లు). మూడు, నాలుగు భాగాలకు కలిపి దాదాపు 700 మిలియన్ డాలర్లు (రూ.6000 కోట్లు). ఇక ‘హాబిట్’ ట్రయాలజీ బడ్జెట్ 623 మిలియన్ డాలర్లు (రూ.5500 కోట్లు). ప్రస్తుతానికి అవెంజర్స్ 3, 4, ‘హాబిట్’ ట్రయాలజీ చిత్రాలు మాత్రమే ‘రామాయణ’ బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చుతో నిర్మితమయ్యాయి.
ఆ మూడు భారతీయ చిత్రాల కంటే..
ఇప్పటివరకూ దేశంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రాలంటే ‘కల్కి 2898 ఏడీ’ (రూ.600 కోట్లు), ‘ఆదిపురుష్’ (రూ.550 కోట్లు), ‘ఆర్‌ఆర్‌ఆర్’ (రూ.500 కోట్లు) స్ఫురిస్తాయి. అయితే వీటన్నింటి బడ్జెట్ కలిపినా ‘రామాయణ’లోని ఓ భాగానికి అయ్యే ఖర్చు కంటే తక్కువే. రెండు భాగాలుగా తెరకెక్కిన ‘బాహుబలి’ (రూ.430 కోట్లు) బడ్జెట్.. ‘రామాయణ’ కంటే పదిరెట్లు తక్కువగానే ఉండడం గమనార్హం. కాగా, ఈ చిత్రంలో రామునిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్ నటించనున్నారు.