Ramana Gogula: ' ఆస్ట్రేలియా నుంచి అమెరికా వరకూ సంగీత యాత్ర
ABN , Publish Date - Nov 23 , 2025 | 03:55 PM
రమణ గోగుల తన సంగీత ప్రస్థానంలో తొలిసారిగా పూర్తి స్థాయి గ్లోబల్ కాన్సర్ట్ టూర్ (Global Concert Journey) చేపడుతుండటం తెలుగు సంగీత చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనుందని నిర్వాహకులు అభిప్రాయ పడ్డారు.
ఆస్ట్రేలియా నుంచి అమెరికా వరకూ సంగీత ప్రియులను అలరించేందుకు సంగీత యాత్రని నిర్వహిస్తున్నట్టు సంగీత దర్శకుడు రమణ గోగుల (Ramana gogula) తెలిపారు. ‘ఇన్ కాన్వర్సేషన్స్ విత్ ది ట్రావెలింగ్ సోల్జర్ - రమణ గోగుల ఆస్ట్రేలియా టూర్’ పేరుతో సాగనున్న ఈ టూర్ ను మెల్‌బోర్న్ మామా క్రియేటివ్ స్పేస్, టాప్ నాచ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆస్ట్రేలియా సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుందని శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అధికారికంగా ప్రకటించారు. 'మొదట ఆస్ట్రేలియాతో మొదలై, ఆ తర్వాత లండన్, అమెరికా మీదుగా ఈ యాత్ర సాగుతుందని, ప్రవాస భారతీయుల్ని కళ, కథలతో ఏకం చేయడమే లక్ష్యమని ఆయన అన్నారు.
రమణ గోగుల తన సంగీత ప్రస్థానంలో తొలిసారిగా పూర్తి స్థాయి గ్లోబల్ కాన్సర్ట్ టూర్ (Global Concert Journey) చేపడుతుండటం తెలుగు సంగీత చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనుందని నిర్వాహకులు అభిప్రాయ పడ్డారు. ఈ టూర్ కేవలం సంగీత కచేరీలకు మాత్రమే పరిమితం కాదు. రమణ గోగుల ఐకానిక్ పాటలు, వాటి వెనుక ఉన్న జ్ఞాపకాలు, తెర వెనక ఉన్న కథలతో కూడిన ఒక భావోద్వేగభరితమైన అన్వేషణ అని చెప్పారు. పర్యటనలో భాగంగా మెల్‌బోర్న్ మామా క్రియేటివ్ స్పేస్ ఒక వినూత్నమైన 'డాక్యు-మ్యూజికల్ సిరీస్'ను రూపొందిస్తోంది. ఈ డాక్యుమెంటరీని ఒక ప్రీమియం ఇండో-ఆస్ట్రేలియన్ మ్యూజికల్ జర్నీగా ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మామా క్రియేటివ్ స్పేస్ వ్యవస్థాపకుడు సతీష్ వర్మ మాట్లాడుతూ 'రమణ గోగుల ఎప్పుడూ ఇలాంటి కాన్సర్ట్స్ చేయలేదు. ఇది కేవలం ఒక టూర్ కాదు, ఇదొక భావోద్వేగాల ఉద్యమం. ఖండాంతరాల్లో ఉన్న మ్యూజిక్ లవర్స్ రమణ గోగుల గారి కళను, కథను వింటూ అనుభూతి చెందాలని కోరుకుంటున్నాము' అని అన్నారు.
టూర్ షెడ్యూల్ వివరాలు:
2026 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా పర్యటనతో ఈ ప్రపంచ యాత్ర ప్రారంభమవుతుంది. తదుపరి దశల్లో యూకే, అమెరికా పర్యటనలు ఉంటాయి.
ఆస్ట్రేలియా (ఫిబ్రవరి 2026): మెల్‌బోర్న్, సిడ్నీ, పెర్త్.
యూకే (2026): లండన్, మాంచెస్టర్ (ప్రణాళికలో ఉంది).
అమెరికా (2026): ఈస్ట్ కోస్ట్ & వెస్ట్ కోస్ట్ (ప్రణాళికలో ఉంది).
ఈ మ్యూజికల్ జర్నీ ప్రవాస భారతీయులను కళ, కథల ద్వారా ఏకం చేయడమే లక్ష్యంగా సాగనుంది.