Ram Pothineni: లిరిక్ రైటర్ గా రామ్

ABN , Publish Date - May 03 , 2025 | 04:35 PM

రామ్ పోతినేని లిరిక్ రైటర్ గా అవతారమెత్తాడు. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లతో సతమతమవుతున్న యంగ్ హీరో... తన అప్ కమింగ్ మూవీతో హిట్ కొట్టాలని ఆశ పడుతున్నాడు. అందుకోసం చేస్తున్న ప్రయోగాలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతున్నాయి.

కొన్ని రోజులుగా వ‌రుస ప‌రాజ‌యాల‌తో స‌త‌మ‌తం అవుతున్నాడు ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ (Ram Pothineni). 'ఇస్మార్ట్ శంక‌ర్' (iSmart Shankar) త‌ర్వాత స‌రైన విజ‌యాలే అతనికి దక్కలేదు. దీంతో ఎలాగైనా ఈసారి హిట్ కొట్టాల‌ని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. త‌న తదుప‌రి సినిమాని 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఫేమ్ మహేష్ బాబు. పి (Mahesh Babu P) దర్శకత్వంలో చేస్తున్నాడు. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) సంస్థ నిర్మిస్తోంది. దీనిపై చాలా ఆశ‌లే పెట్టుకున్నాడు రామ్. అయితే ఈ సినిమా కోసం ఓ కొత్త దారి పట్టాడు.


గతంలో నటుడిగా, కొరియోగ్రాఫర్‌గా, ఫైట్స్ కంపోజిషన్‌లో తన ప్రతిభను నిరూపించుకున్న రామ్ ఇప్పుడు కొత్త అవతారం ఎత్తడం ఆసక్తికరంగా మారింది. త‌న అప్ క‌మింగ్ మూవీ కోసం గీత రచయితగా మారాడు. ఆందులో అతను ఓ ప్రత్యేకమైన ప్రేమ గీతాన్ని రాశాడు. ఈ పాటను రామ్, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్స్‌(Bhagyashri Borse) పై చిత్రీక‌రించారు. క్యాచీ పదాలతో ఆకట్టుకునేలా ఇది ఉండబోతోందట. ఈ పాటలో రామ్, భాగ్యశ్రీ బోర్సే మధ్య అదిరిపోయే కెమిస్ట్రీ ఉంటుందని టాక్ నడుస్తోంది.

ఈ పాటకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్ (Vivek–Mervin) స్వరాలు సమకూర్చారు. పాట చాలా అద్భుతంగా వచ్చిందని అంటున్నారు. మే15న రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ పాట విడుదల కానుంది. పాట తయారీలో రామ్ పూర్తి శ్రద్ధ వహించి, రికార్డింగ్ సెషన్‌ను స్వయంగా పర్యవేక్షించాడ‌ట‌. ఈ విషయం తెలిసిన అభిమానులు ఎప్పుడెప్పుడు ఆ పాట బ‌య‌ట‌కు వ‌స్తుందా అని ఎదురుచూస్తున్నారు. మరి రామ్ ను ఈ సినిమా అయినా సక్సెస్ ట్రాక్ లోకి తీసుకొస్తుందేమో చూడాలి.

Updated Date - May 03 , 2025 | 04:35 PM