RGV: విషం కక్కడం ఆపండి.. రాజమౌళికి సపోర్ట్ గా రామ్ గోపాల్ వర్మ

ABN , Publish Date - Nov 21 , 2025 | 02:04 PM

వివాదం ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటాను అని అంటాడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma). వివాదం లేకపోతే కొని తెచ్చుకోవడంలో వర్మ ఎక్స్ పర్ట్. అయితే ఈ మధ్య ఎలాంటి వివాదాలలో కనిపించకపోవడంతో వర్మలో మార్పు వచ్చింది అనుకున్నారు.

RGV

RGV: వివాదం ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటాను అని అంటాడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma). వివాదం లేకపోతే కొని తెచ్చుకోవడంలో వర్మ ఎక్స్ పర్ట్. అయితే ఈ మధ్య ఎలాంటి వివాదాలలో కనిపించకపోవడంతో వర్మలో మార్పు వచ్చింది అనుకున్నారు. కానీ, అలాంటిదేమి లేదు . తాజాగా ఇండస్ట్రీలో రాజమౌళి(Rajamouli) వివాదం హాట్ టాపిక్ గా నడుస్తున్న విషయం తెల్సిందే. వారణాసి(Vaaranaasi) ఈవెంట్ లో జక్కన్న.. హనుమంతుడిని అవమానించాడని హిందూ సంఘాలు మండిపడ్డాయి. ఈ చిన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారి రాజకీయ నేతలు మాట్లాడేవరకు వచ్చింది. ఇంకోపక్క రాజమౌళిపై కేసులు కూడా పెట్టారు. కానీ, జక్కన్న మాత్రం ఇప్పటివరకు దీనిపై స్పందించలేదు.

ఇక చాలామంది జక్కన్నకు విరుద్ధంగా కామెంట్స్ చేస్తూ.. ట్రోల్ చేస్తుండగా.. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. రాజమౌళికి సపోర్ట్ గా నిలిచాడు. రాజమౌళి నాస్తికుడు అయితే తన మనోభావాలను చెప్పే హక్కు లేదా.. అని ప్రశ్నించాడు. 'భక్తులు అని పిలవబడేవారు ఎస్ ఎస్ రాజమౌళిపై విషం కక్కుతున్నవారు .. భారతదేశంలో నాస్తికుడుగా ఉండటం నేరం కాదని తెలుసుకోవాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం ఈ విషం కక్కేవారు దేవుడ్ని నమ్ముతున్నాం అని చెప్పే హక్కు ఎలా అయితే ఉందో.. తాము నమ్మడం లేదు అని చెప్పే హక్కు ఆయనకు ఉంది.

ఇప్పుడు అతను దేవుడిని నమ్మకపోతే తన సినిమాల్లో దేవుడిని ఎందుకు చూపిస్తాడు? అని చేసే వాదన విషయానికి వద్దాం. దాని ప్రకారం, ఒక ఫిల్మ్ మేకర్.. గ్యాంగ్‌స్టర్ సినిమా తీయడానికి గ్యాంగ్‌స్టర్‌గా మారాలా.. ? ఒక దెయ్యం సినిమా తీస్తే దెయ్యంలా మారాలా.. ? ఈ నిజాన్ని ఎవరు చెప్పరెందుకు..? అతను దేవుడిని నమ్మకపోయినా, దేవుడు రాజమౌళి కి 100 రెట్లు ఎక్కువ విజయం, ఎక్కువ సంపద, ఎంతోమంది ఆరాధించే అభిమానులను ఇచ్చాడు. ఇలాంటి విజయాన్ని భక్తులు అని చెప్పుకొనేవారు జీవితాల్లో ఎప్పుడు చూసి ఉండరు

దేవుడు విశ్వాసుల కంటే నాస్తికులను ఎక్కువగా ప్రేమిస్తాడు. దేవుడు ఇలాంటివాటిని పట్టించుకోడు. లేదా దేవుడు నోట్‌ప్యాడ్‌తో కూర్చుని ఎవరు నన్ను నమ్ముతారు, ఎవరు నమ్మరు అనే దానిపై నోట్స్ తీసుకుంటున్నారా?. ఒకవేళ దేవునికే అతనితో ఎలాంటి సమస్య లేకపోతే.. దేవుడిని నమ్మినవారికే బీపీ, హార్ట్ ఎటాక్ లు ఎందుకు వస్తున్నాయి. అసలు సమస్య ఆయన నాస్తికత్వం కాదు.. అసలు సమస్య ఏంటంటే.. దేవుడును నమ్మకపోయినా అతను విజయం సాధించాడు. అది పిచ్చిగా దేవుడ్ని పూజించి విఫలమైనవారిని భయపెడుతుంది. కాబట్టి విశ్వాసులు దేవుడ్ని సమర్ధించడం మానేయాలి. అది వారిని బలహీనులుగా చేస్తుంది.

నిజం ఏమిటంటే.. రాజమౌళి దేవుడ్ని తగ్గించలేదు. ఒకవేళ ఎవరైనా నమ్మడం మానేసిన క్షణంలో విశ్వాసం కూలిపోతుందనే అభద్రతా భావాన్ని పెంచుతుంది. కాబట్టి రెస్ట్ తీసుకోండి. దేవుడు బాగున్నాడు.రాజమౌళి బాగున్నాడు. వారిలో ఎవరినీ అర్థం చేసుకోలేని వ్యక్తులు మాత్రమే బాధపడుతున్నారు. వారణాసి ద్వారా.. దేవుడు, రాజమౌళికి మరింత అదృష్టాన్ని ఇస్తున్నాడు. ఇప్పటికే నిండిపోయిన ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ ను మరింత ఎక్కువ చేస్తున్నాడు. దీని చూస్తూ అసూయతో రగిలిపోయేవారు పక్కన కూర్చొని ఏడుస్తూ ఉంటారు. చివరగా చెప్పొచ్చేది ఏంటంటే.. ఇది దేవునిపై నమ్మకం అంటూ ముసుగువేసుకున్నవారి అసూయ మాత్రమే.. జై హనుమాన్' అంటూ ముగించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Updated Date - Nov 21 , 2025 | 02:18 PM