Ram Charan: పూణేలో పాట చిత్రీకరణ... వీడియో లీక్...
ABN , Publish Date - Oct 11 , 2025 | 12:58 PM
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న పెద్ది మూవీ పాట చిత్రీకరణ ప్రస్తుతం పూణే సమీపంలో జరుగుతోంది. ఆ పాటకు సంబంధించిన క్లిప్సింగ్స్, ఫోటోస్ లీక్ అయ్యాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న 'పెద్ది' చిత్రం పాట చిత్రీకరణ ప్రస్తుతం పూణేలోని సావ్లా ఘాట్ దగ్గర జరుగుతోంది. అక్టోబర్ 9వ తేదీ నుండి ఈ పాటను పూణే సమయంలోని పలు ప్రాంతాలలో చిత్రీకరిస్తున్నారు. అకాడమీ అవార్డ్ విన్నర్, మాస్ట్రో ఎ.ఆర్. రెహమాన్ ఈ పాటకు స్వరాలు సమకూర్చగా, స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ దీనికి వర్క్ చేస్తున్నారు. ఈ పాట విజువల్ ట్రీట్ గా ఉండాలనే ఉద్దేశ్యంలో పూణే చుట్టుపక్కల ఉన్న లోయ ప్రాంతాలలో రిస్క్ తీసుకుని చిత్ర బృందం చిత్రీకరణ జరుపుతోంది. అయితే ఈ మధ్య స్టార్స్ చిత్రాలకు లీకేజ్ సమస్య ఒకటి ఏర్పడింది. 'పెద్ది' చిత్రానికీ అది తప్పలేదు. అక్కడి యూనిట్ సభ్యులు ఆ అందమైన లొకేషన్స్ ను, పాట చిత్రీకరిస్తున్న చిన్నపాట వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేశారు. అక్కడి వాళ్ళ సంభాషణ వింటే... ఈ పాట చిత్రీకరణ కోసం యూనిట్ ఎంత రిస్క్ తీసుకుంటోందో అర్థమౌతుంది.
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ముందు అనుకున్నట్టుగానే ఈ సినిమాను వచ్చే యేడాది మార్చి 27న విడుదల చేయబోతున్నారు. రామ్ చరణ్ తన పాత్ర కోసం కంప్లీట్ గా మేకోవర్ కాగా, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి దీనికి ఎడిటర్.