Rajendraprasad: తీరు మార‌ని.. రాజేంద్ర ప్ర‌సాద్‌! మ‌రోసారి.. బూతులు

ABN , Publish Date - Nov 30 , 2025 | 12:33 PM

సీనియర్‌ నటుడు డా.రాజేంద్రప్రసాద్‌కు వేదికలపై నోరు జారడం కొత్తేమి కాదు.. వినకూడని మాటలు అంటారు.. సమర్థించుకుంటారు. తాజాగా బ్రహ్మానందంపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి 

Rajendraprasad

సీనియర్‌ నటుడు డా.రాజేంద్రప్రసాద్‌ (Rajendraprasad) మళ్లీ నోరుజారి వార్తల్లో నిలిచారు. గతంలో ‘రాబిన్‌ హుడ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ మీద నోరు పారేసుకున్నారు రాజేంద్ర ప్రసాద్‌. ఆయన మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు. మరోసారి ఎస్‌.వి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలో చెప్పలేని బూతు తిట్టారు. అప్పుడు రాజేంద్ర ప్రసాద్‌ తీరును తప్పుబట్టారు. ఎన్నో విమర్శలు చేశారు. అయినప్పటికీ రాజేంద్రప్రసాద్‌ ‘మా మధ్యనున్న చనువు, స్నేహం ఇదంతా మామూలే అని తనకు తాను  సమర్థించుకున్నారు. ఈ రెండు వివాదాలు మరువక ముందే మరోసారి నటకిరీటి నోరు జారారు.

‘సఃకుటుంబానాం’... సినిమా సినిమాకు సంబంధించిన ఓ కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్‌, బ్రహ్మానందం (Brahmanandam) కూడా నటించారు. ఈ సినిమా ట్రైలర్‌ ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్‌ చివరలో ఎమోషనల్‌ డైలాగ్‌ చెప్పారు రాజేంద్ర ప్రసాద్‌. అయితే ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో ‘ముసలి ముం... కొడకా’ అంటూ బ్రహ్మానందం మీద నోరు జారారు రాజేంద్ర ప్రసాద్‌. నటకిరీటి తీరుకు వేదికపై బ్రహ్మనందం ఇబ్బంది పడినట్లు ఈ వీడియోలు చూస్తే తెలుస్తోంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

గతంలో నోరు జారిన తర్వాత తన ప్రవర్తన, వ్యవహార శైలిని సమర్థించుకున్నట్టు ఈసారి కూడా రాజేంద్రప్రసాద్‌ సమర్థించుకుంటారేమో చూడాలి. అయితే ప్రేక్షకులు మాత్రం రాజేంద్రప్రసాద్‌ను తప్పుబడుతున్నారు. ఎంత సహనటుడైనా, స్నేహితులైనా నలుగురిలో, అది కూడా ఓ పెద్ద వేదికపై ప్రేక్షకుల్లో బాగా గుర్తింపు ఉన్న నటుడు మరో ఫేమస్‌ నటుడి గురించి అలా మాట్లాడటం సబబు కాదని హితవు పలుకుతున్నారు. మరి కొందరైతే రాజేంద్ర ప్రసాద్‌ని ఏకిపారేస్తున్నారు. మున్ముందు అయినా ఇలాంటి వేదికలపై రాజేంద్రప్రసాద్‌ కాస్త నోరు అదుపులో పెట్టుకుంటే గౌరవం నిలబడుతుందని, తీరు మార్చుకోవాలని చెబుతున్నారు.

Updated Date - Nov 30 , 2025 | 03:52 PM