SS Rajamouli: డబ్బులు పోవడమే కాదు.. ప్రాణాలు పోయేదాకా వెళ్తుంది..
ABN , Publish Date - Nov 17 , 2025 | 05:49 PM
సినీ ఇండస్ట్రీని కొన్నేళ్లగా పట్టి పీడిస్తున్న పైరసీ భూతాన్ని అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు (Telangana Police) చేస్తున్న కృషి అభినందనీయమని దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి (SS rajamouli) అన్నారు.
సినీ ఇండస్ట్రీని కొన్నేళ్లగా పట్టి పీడిస్తున్న పైరసీ భూతాన్ని అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు (Telangana Police) చేస్తున్న కృషి అభినందనీయమని దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి (SS rajamouli) అన్నారు. హైదరాబాద్‌లో సీపీ సజ్జనార్‌తో (CP Sajjanar) సమావేశం అనంతరం రాజమౌళి మీడియాతో మాట్లాడారు. ‘జరిగిన దానిలో పోలీసులు కష్టం చూస్తే సినిమాలో ఇదొక సూపర్ హిట్ సీన్‌లా ఉంది. విలన్ ఛాలెంజ్ చేస్తే రెండు నెలల తర్వాత హీరో అతడిని కటకటాల వెనక వేసినట్లు ఉంది. భస్మాసురిడి హస్తంలా తన తలమీద తనే చేయిపెట్టుకున్నాడు. పోలీసులతో ఆటలొద్దు. ఈ సందర్భంగా ఒక్కటి చెప్పాలనుకుంటున్నా. జీవితంలో ఏదీ ఉచితంగా రాదు. ఒకవేళ అలా వస్తే దాని వెనక పెద్ద ప్రమాదం ఉండక తప్పదు. చావు వరకూ తీసుకెళ్తుంది. ‘సినిమాలేగా ఏముంది ఫ్రీగా చూస్తున్నాం’ అని అందరూ అనుకుంటున్నారు.

పైరసీ చేసే వాళ్లేం సంఘ సేవ చేయడం లేదు. పెద్ద సర్వర్లు ఉపయోగించి పైరసీ చేస్తున్నారు. దానికి డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది? మేము వాళ్లకు డబ్బులు ఇవ్వడం లేదు.. మా సినిమాలను పైరసీ చేసి సంపాదిస్తున్నారు. అంటే మీరు ఇస్తున్నారు. మీ వ్యక్తిగత డేటాను అమ్మడం వల్ల ఇస్తున్నారు. ఈ పర్సనల్ డేటా అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. మీ పేరు, ఫోన్ నంబర్, ఆధార్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ ఉంటే చాలు మీరు సైబర్ బారిన పడతారు. ఈ డేటాను క్రిమినల్స్‌కు అమ్ముతున్నారు. మీరు నంబరే కదా అని ఎంటర్ చేస్తున్నారు. దాని మూలంగా ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. డబ్బులు పోవడమే కాదు.. ప్రాణాలు పోయే వరకూ తీసుకెళ్తుంది. వాళ్లు చేసే దాని వల్ల మాకంటే మీరే ఎక్కువ నష్టపోతున్నారు. అర్థం చేసుకోండి. ఇలాంటి సైట్లలో ఫ్రీగా సినిమాలు చూసి కష్టాల్లో పడకండి’ అని రాజమౌళి సూచించారు.