Raja Singh Vs Rajamouli: హిందూ దేవుళ్లపై కామెంట్ చేస్తే గతి ఏంటనేది తెలియాలి..
ABN , Publish Date - Nov 20 , 2025 | 06:16 PM
‘రాజమౌళి.. నీకు హిందూ దేవుళ్లపై నమ్మకం లేకపోతే.. వారికి సంబంధించిన కథలతో సినిమాలు తీసి కోట్లు ఎందుకు సంపాదిస్తున్నావ్? నువ్వు నాస్తికుడివా? అయితే డిక్లేర్ చేయి! లేదా నీ సినిమా ప్రమోషన్ కోసం హనుమాన్‌పై కామెంట్స్ చేశావా.. - రాజమౌళికి రాజాసింగ్ కౌంటర్
మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ టైటిల్ గ్లింప్స్ విడుదల కార్యక్రమంలో హనుమంతుడిపై (Comments On Hanuman) చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. హిందువులు అంతా రాజమౌళిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. రాష్ట్రీయ వానరసేన దర్శకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజమౌళికి కౌంటర్ ఇచ్చారు. అతను తీసే ప్రతి సినిమాను హిందూ సమాజం బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఆయన ఏమన్నారంటే.. ‘ప్రస్తుతం రాజమౌళికి సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారుతోంది. ఆయన తల్లిదండ్రులకు హనుమంతుడిపై విశ్వాసం ఉందట. కానీ.. ఆయనకు లేదట. నీకు హిందూ దేవుళ్లపై విశ్వాసం లేదు కానీ.. అదే ధర్మం, దేవుళ్లపై సినిమాలు చేసి.. రూ. కోట్లల్లో సంపాదించుకున్నావు కదా..? అని ప్రశ్నించారు.
అసలు నీ ప్లాన్ ఏంటి? ఇప్పుడు ‘వారణాసి’ పేరుతో మహేష్‌బాబును పెట్టి మరో సినిమా తీస్తున్నావ్.. ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా హనుమాన్‌పై ఈ వ్యాఖ్యలు చేశావా? అంటూ నిలదీశారు. లేదా నువ్వు నిజంగానే నాస్తికుడివా? ఏదైంది డిక్లేర్ చెయ్యి అంటూ డిమాండ్ చేశారు. ఇందులో రాజమౌళి తప్పేమీ లేదని, అసలు తప్పంతా హిందువులదే. ఇలాంటి ఫాల్తు డెరెక్టర్‌ను హిందువులు కనుగొనలేక పోతున్నారు. హిందూ దేవుళ్ల పట్ల నమ్మకం లేని రాజమౌళి సినిమాలను హిందువులు ఎందుకు చూడాలి? అంటూ మండిపడ్డారు.
‘ప్రభాస్‌తో ‘బాహుబలి’ సినిమా తీశావు.. అతనితో శివలింగాన్ని ఎత్తించాడు. కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. మళ్లీ హిందు దేవుళ్లపై నమ్మకం లేదని చెబుతున్నాడు. అతను ఇలా కామెంట్ చేయడం ఇది మొదటి సారి కాదు. గతంలో భగవాన్ శ్రీకృష్ణుడికి చెందిన 16 వేల మంది దాసీలను లవర్స్ అంటూ హేళన చేశాడు. రాముడు అంటే ఇష్టం లేదనీ, అతని స్టోరీ బోరింగ్ స్టోరీ అని గతంలో ట్వీట్ చేశాడు. ఇప్పుడు హనుమంతుడిపైన కామెంట్స్ చేశాడు అని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా హిందువులకు ఓ సూచన చేయాలనుకుంటున్నా.. ఇలాంటి దర్శకులపైన ఫిర్యాదు చేయండి! ఇలాంటి వారిని జైల్లో వేస్తేనే హిందూ దేవుళ్లపై కామెంట్స్ చేేస్త ఏం జరుగుతుందో అర్ధమవుతుంది. పనికిరాని డైరెక్టర్ల సినిమాలు చూడొద్దు.. మనం ఇలాంటి వ్యక్తులు తీసిన సినిమాలు చూస్తాం.. దాంతో వాళ్లు కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు. నాస్తికత్వం పేరుతో మన దేవుళ్లపై కామెంట్ చేసే ఇలాంటి వారిని బ్యాన్ చేద్దాం’ అంటూ రాజా సింగ్ వీడియోలో పేర్కొన్నారు.