Tollywood: లిక్కర్ స్కామ్‌లో.. వెలుగులోకి సంచ‌ల‌న విష‌యాలు

ABN , Publish Date - Jul 14 , 2025 | 01:31 PM

జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

sit

జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నల్లధనాన్ని వైట్ మనీగా మార్చేందుకు సినిమా ఫీల్డ్‌ను వేదికగా మార్చుకున్నారని తాజాగా సిట్ విచారణలో వెల్లడైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ED ఎంటర్‌టైన్‌మెంట్స్ (ED Entertainments) పేరుతో గ‌తంలో సినిమాలు నిర్మించి, పెద్ద మొత్తంలో నల్లధనాన్ని చక్కగా లీగల్‌గా మార్చుకున్నట్లు ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజ్‌ కెసిరెడ్డి వ్యవహారశైలిని పరిశీలించిన అనంత‌రం సిట్‌ వెల్లడించింది.

కొత్త‌గా ED ఎంటర్‌టైన్‌మెంట్స్ (ED Entertainments) స్థాపాంచి 2022లో సుమంత్ హీరోగా మళ్లీ మొదలైంది, 2023లో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా స్పై చిత్రాలను నిర్మించిన రాజ్ కెసిరెడ్డి, ఈ రెండు సినిమాల పేరుతో రూ.40 కోట్లకు పైగా నల్లధనాన్ని వెచ్చించినట్లు సిట్ విచారణలో తేలింది. అయితే కంపెనీ మాత్రం కేవలం రూ.12 కోట్లు ఖర్చయ్యాయని, వాటిని అప్పుగా తీసుకున్నట్లు రికార్డుల్లో చూపించిందని అధికారుల ద‌ర్యాప్తులో తేలింది.

అయితే.. బాక్సాఫీస్‌ వద్ద ఈ రెండు సినిమాలు డిజాస్ట‌ర్లుగా నిలిచినా ఓటీటీ, శాటిలైట్, ఇత‌ర హక్కుల ద్వారా సంస్థకు రూ.36 కోట్ల మేర ఆదాయం వచ్చింది. దీంతో మొత్తం రూ.40 కోట్ల బ్లాక్‌మ‌నీ వినియోగించి, దాదాపు అంతే డ‌బ్బును వైట్‌గా మార్చుకున్నట్లు నిర్థారితమైంది. కాగా.. ఓ పాన్‌ ఇండియా హీరో భార్య పేరు మీదుగా ఈ సంస్థ ఖాతాలోకి రూ.1 కోటి చేరినట్లు గుర్తించిన అధికారులు తిరిగి ఆ మొత్తాన్ని ఆమెకు చెల్లించలేదని సిట్ పేర్కొంది. ఇది కూడా వారు జ‌రిపిన నకిలీ లావాదేవీలకు ఇది ఓ ఉదాహరణ అని అధికారులు వ్యాఖ్యానించారు. ఇందుకు సంబ‌ధించిన పూర్తి వివ‌రాల‌ను సిట్ త్వ‌ర‌లోనే కోర్టుకు స‌మ‌ర్పించ‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు.

దీంతో ఇప్పుడు ఈ అంశం టాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. బ్లాక్ మ‌నీని వైట్‌గా మార్చుకునేందుకు సినిమా ప‌రిశ్ర‌మ‌ను వాడుకోవ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అంతేగాక జోర్డాన్ వంటి దేశాల్లో భారీ ఎత్తున షూటింగ్‌లు జ‌రిపి అసలు ఖర్చుల వివరాలను రికార్డుల్లో చూపించకపోవడం, నటుల పారితోషికాల‌ను తక్కువగా చూపించడమూ వంటి ఇత్యాది ప‌లు అంశాల్లోనూ ప‌లు అవ‌క‌త‌వ‌క‌లు జరిగిన‌ట్లు అనుమానాలు వ్య‌క్దం అవుతున్నాయి. అయితే త‌ను నిర్మించిన రెండు చిత్రాలు నిరాశ ప‌ర్చినా ఆపై టాప్ డైరెక్ట‌ర్ల‌తో చిత్రాలు తీసేందుకు ఫ్లాన్ చేసిన‌ప్ప‌టికీ కాలం క‌లిసి రాక సినిమా నిర్మాణాల‌కు స్వ‌స్తి ప‌లికారు. ఇప్పుడు లిక్క‌ర్ స్కామ్‌లో పీక‌ల్లోతుల్లో కూరుకు పోయింది.

Updated Date - Jul 14 , 2025 | 02:16 PM