నిర్మాతల షరతులకు ఫెడరేషన్ అంగీకరించాలి
ABN , Publish Date - Aug 14 , 2025 | 05:51 AM
సినీ కార్మికుల వేతన సమస్యకు ఓ పరిష్కారం తెచ్చేందుకు బుధవారం నిర్మాతల మండలి సభ్యులు, ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు మరోసారి ఫిల్మ్ ఛాంబర్‌లో సమావేశమయ్యారు. చర్చల్లో వేతనాల పెంపు అంశం ఇంకా కొలిక్కి రాలేదని, మరో...
సినీ కార్మికుల వేతన సమస్యకు ఓ పరిష్కారం తెచ్చేందుకు బుధవారం నిర్మాతల మండలి సభ్యులు, ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు మరోసారి ఫిల్మ్ ఛాంబర్‌లో సమావేశమయ్యారు. చర్చల్లో వేతనాల పెంపు అంశం ఇంకా కొలిక్కి రాలేదని, మరో రెండు మూడు సార్లు నిర్మాతలు, ఫెడరేషన్ నాయకుల మధ్య చర్చలు జరగాల్సి ఉందని ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘వేతనాలు పెంచాలంటే ఫెడరేషన్ నాయకులు, నిర్మాతలు కోరుతున్న కొన్ని షరతులకు అంగీకరించాలి. ఇదే విషయాన్ని ఛాంబర్ దృష్టికి తీసుకువచ్చాం. వాటిపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటే నిర్మాతలు వేతనాలు పెంచడానికి సిద్ధంగా ఉన్నారు. రూ.2 వేల కంటే తక్కువకి పనిచేసే వారికి ఒక పర్సెంటేజీ ఆఫర్ చేశాం. అంతకంటే ఎక్కువ తీసుకునే వారికి మరో పర్సెంటేజీ ఆఫర్ ప్రతిపాదించాం. ఫెడరేషన్‌లోని అన్ని యూనియన్లతో మాట్లాడుకుని వస్తే, దీనిని పరిష్కరిస్తాం. ప్రస్తుతం సానుకూల ధోరణిలోనే చర్చలు సాగిస్తున్నాం’ అని చెప్పారు. ‘నిర్మాతలు వారి షరతులు చెప్పారు. మరో రెండు మూడు రోజుల పాటు చర్చలు సాగుతాయి’ అని నిర్మాత సి.కల్యాణ్ పేర్కొన్నారు. ‘ఈ రోజు జరిగిన చర్చలు సరిగ్గా సాగలేదు. నిర్మాతలు కాలయాపన ధోరణి ప్రదర్శిస్తున్నారు. మేము ఇరువైపులా న్యాయం జరగడానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నా, నిర్మాతలు దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారు’ అని ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘గతంలో మేము చెప్పిన షరతులపై ఈ సమావేశంలో మాట్లాడాం. మేము చెప్పిన షరతులను అంగీకరిస్తే ఎలాంటి న్యాయం చేస్తారో చెప్పాలని కోరాం. ఏ రోజుకు ఆ రోజు వేతనాల చెల్లింపు గురించి చర్చించలేదు’ అని ఫెడరేషన్ కార్యదర్శి అమ్మిరాజు అన్నారు.