Damodar Prasad: అఖండ 2 ఎఫెక్ట్.. 16 చిన్న సినిమాలకు నష్టం!
ABN , Publish Date - Dec 11 , 2025 | 05:34 AM
‘అఖండ 2’ చిత్రం విడుదల కొత్త తేదీ (డిసెంబర్ 12)కు మారడం చిన్న సినిమాలపై కచ్చితంగా ప్రభావం చూపుతుందని ప్రముఖ నిర్మాత, ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ కేఎల్ దామోదర ప్రసాద్ అభిప్రాయపడ్డారు.
భారీ అంచనాలున్న ‘అఖండ 2’ (Akhanda 2) చిత్రం విడుదల కొత్త తేదీ (డిసెంబర్ 12)కు మారడం చిన్న సినిమాలపై కచ్చితంగా ప్రభావం చూపుతుందని ప్రముఖ నిర్మాత, ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ కేఎల్ దామోదర ప్రసాద్ (Damodar Prasad) అభిప్రాయపడ్డారు. అఖండ కొత్త విడుదల తేదీ కారణంగా ఆ రోజున రావాల్సిన చిన్న సినిమాలు తమ షెడ్యూళ్లను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది మిగిలిన సినిమాలకు భారమేనని ఆయన బుధవారం జరిగిన ‘ఈషా’ (Eesha) చిత్రం ప్రెస్‌మీట్‌లో వ్యాఖ్యానించారు.
తేదీల గందరగోళం: అఖండ సినిమా ప్రభావం చిన్న సినిమాలపై పడిందని తాను ప్రత్కేకంగా చెప్పాల్సిన పనిలేదనీ, ఆ తేదీన ఎన్ని చిన్న సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమేనని దామోదర్ ప్రసాద్ అన్నారు. ‘అఖండ 2’ ఈ నెల 12కు మారడం వల్ల మిగిలిన నిర్మాతలు తమ తేదీలను మార్చుకుంటున్నారు కదా అన్నారు.
అయితే జరిగిన సంఘటన దురదృష్టకరమని, ఇండస్ట్రీలో ఇలాంటివి మామూలేనని ఆయన పేర్కొన్నారు. పరిస్థితులు మన చేతిలో లేనప్పుడు జరిగినదాన్ని సానుకులంగా స్వీకరించి ముందుకెళ్లడమే మనం చేయగలిగిన పని అని దామోదర ప్రసాద్ అన్నారు. సినిమా చిన్నదైనా, పెద్దదైనా అంతిమంగా అది వ్యాపారమేనని చెప్పారు.
సినిమా పరిశ్రమ ప్రాథమికంగా ఒక అన్‌ఆర్గనైజ్డ్ సెక్టార్ అని దామోదర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. చిన్న సినిమాలకు సేఫ్టీ ఉండాలని కోరుకుంటామనీ, పరిస్థితులను బట్టి మరో మార్గం చూసుకుంటామని అన్నారు. ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం ఫిల్మ్ ఛాంబర్‌లో చాలా మాట్లాడుకుంటామని, కానీ ఒక నెల తర్వాత మళ్లీ అంతా మామూలేనని ఆయన అన్నారు.