నిర్మాతలే సమస్యను పెంచుతున్నారు
ABN , Publish Date - Aug 17 , 2025 | 05:58 AM
సినీ కార్మికుల సమ్మె 13వ రోజుకు చేరుకుంది. కానీ నిర్మాతలు సంప్రదింపుల పేరుతో కాలయాపన చేస్తున్నారు. మేము షరతులకు అంగీకరించట్లేదని బయట మాట్లాడుతున్నారు’ అని...
సినీ కార్మికుల సమ్మె 13వ రోజుకు చేరుకుంది. కానీ నిర్మాతలు సంప్రదింపుల పేరుతో కాలయాపన చేస్తున్నారు. మేము షరతులకు అంగీకరించట్లేదని బయట మాట్లాడుతున్నారు’ అని ఫిల్ ్మ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ అన్నారు. సినీ కార్మికుల సమ్మె.. వారి వేతనాల పెంపుపై శనివారం ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ స్పందించారు. ‘మమ్మల్ని మీడియా ముందు మాట్లాడవద్దు అని చెప్పి, నిర్మాతలు మాత్రం శుక్రవారం ప్రెస్‌మీట్ పెట్టారు. మేము రెండు పాత షరతులను అంగీకరించట్లేదని అన్నారు, అది తప్పు. మాతో చర్చించకుండానే మేము షరతులకు అంగీకరించట్లేదు అని ఎలా చెబుతారు. 50 ఏళ్ల నుంచి లేని కండిషన్స్ ఇప్పుడు పెడితే ఎలా. మీరు ఎంత వేతనం ఇస్తారో కచ్చితంగా చెబితే, కార్మికులతో చర్చిండడానికి సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే స్పష్టం చేశాం. బ్లాంక్ పేపర్ కూడా తీసుకొచ్చి వారికి ఇచ్చాం. మీకు నచ్చినట్లు రాయండి అని చెప్పాం. నిర్మాతలు కూడా కష్టాల్లో ఉన్నారని తెలుసు. అందుకే దిగి వచ్చి చర్చలకు సిద్ధం అని మరోసారి చెప్తున్నాము. కానీ వారు చర్చలకు అందుబాటులో ఉండడం లేదు. షూటింగ్ చేసుకునేవాళ్లకు ఎలా సహకరించాలో.. షూటింగ్ చేయని వారి నుంచి ఎలా డబ్బులు రాబట్టాలో మాకు తెలుసు. గౌరవ వేతనం అనేది సినిమాను, కష్టాన్ని బట్టి.. అలాగే, ఛాంబర్, కౌన్సిల్ నిర్ణయాలను బట్టి ఉంటుంది. వేతనాల గురించి మాట్లాడితే ఏవేవో పాయింట్లు తెస్తున్నారు. గతం గురించి మాట్లాడితే మేమూ మాట్లాడాల్సి ఉంటుంది. నిర్మాతలే సమస్యను పెంచుతున్నారు. వారి నిర్ణయం చెబితే మా కార్యాచరణ మేము ప్రకటిస్తాం’ అని అన్నారు.