Akira Nandan: అకీరాతో పాన్ వరల్డ్ సినిమా.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Dec 15 , 2025 | 03:13 PM
ప్రస్తుతం టాలీవుడ్.. వారసుల కోసం ఎదురుచూస్తోంది. ఎప్పటి నుంచో స్టార్ హీరోల వారసులు ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తారా అని ఎదురుచూస్తోంది.
Akira Nandan: ప్రస్తుతం టాలీవుడ్.. వారసుల కోసం ఎదురుచూస్తోంది. ఎప్పటి నుంచో స్టార్ హీరోల వారసులు ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తారా అని ఎదురుచూస్తోంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నట వారసుడు అకీరా నందన్ (Akira Nandan) టాలీవుడ్ ఎంట్రీ కోసం అభిమానులు మాత్రమే కాదు ఇండస్ట్రీ మొత్తం కళ్ళు కాయలు కాచేలా వేచి చూస్తోంది. పవన్ రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. మహా అయితే ఏడాదికి ఒక సినిమా చేయగలడు. ఆ సినిమా వచ్చినప్పుడు మాత్రమే ఫ్యాన్స్ కు పండగ.. మిగతా రోజులు మొత్తం పవన్ ఎప్పుడు వస్తాడు అని ఎదురుచూపులే. అదే అకీరా ఎంట్రీ ఇస్తే..కొడుకులో తండ్రిని చూసుకుంటాం అనేది ఫ్యాన్స్ వాదన.
ఇక అకీరా విషయానికొస్తే.. ఆరడుగుల బులెట్ అని చెప్పొచ్చు. అందంలో తండ్రిని మించిపోయాడు. ఇక కళలు కూడా తండ్రిలానే అన్ని నేర్చుకున్నాడు. అయితే మొదటి నుంచి అకీరాకు నటన మీద కన్నా సంగీతం మీదనే మక్కువ ఎక్కువ అని అందరికీ తెల్సిందే. దీంతో అసలు అకీరా హీరోగా ఎంట్రీ ఇస్తాడా.. ? అనే అనుమానాలు లేకపోలేదు. అటు తల్లి రేణు దేశాయ్ మాత్రం అకీరా ఒప్పుకుంటే హీరోగా లాంచ్ చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పుకొస్తుంది. ఇటు పవన్.. ఇంకాస్త టైమ్ పడుతుంది అని చెప్పుకొస్తున్నారు.
ఇప్పటికిప్పుడు అకీరాని లాంచ్ చేయడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే కనుక ప్రొడక్షన్ హౌసెస్ అన్ని పవన్ ఇంటి ముందు క్యూ కడతాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మొదటి నుంచి కూడా అకీరాను లాంచ్ చేయాలనీ చాలామంది నిర్మాతలు ఆసక్తి చూపుతున్న విషయం తెల్సిందే. అలాంటి నిర్మాతల్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఒకరు. పవన్ కళ్యాణ్ తో ఆయనకు ఒక సపరేట్ బంధం ఉంది. వీరి కాంబోలోనే బ్రో సినిమా వచ్చింది. సినిమాల విషయం పక్కన పెడితే పర్సనల్ గా పవన్ - విశ్వప్రసాద్ మధ్య ఒక మంచి స్నేహ బంధం ఉంది.
తాజాగా ఒక పాడ్ క్యాస్ట్ లో టీజీ విశ్వప్రసాద్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే కనుక అకీరాతో పాన్ వరల్డ్ సినిమా చేయాలనీ ఉందని చెప్పుకొచ్చాడు. ' పవన్ కళ్యాణ్ గారితో నాకు మంచి అనుబంధం ఉంది. సినిమాలు అనే కాదు పర్సనల్ గా కూడా మంచి బంధం ఉంది. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అలా అని నేను వెళ్లి సినిమాలు చేయండి అనడం కరెక్ట్ కాదు. అకీరాతో సినిమా చేయమని పవన్ గ్రీన్ సిగ్నల్ నాకు ఇస్తే కచ్చితంగా చేస్తా. ఎలాంటి జోనర్ అంటే.. అది అకీరాకు నచ్చాలి. కచ్చితంగా పాన్ వరల్డ్ సబ్జెక్టుతోనే తీస్తా' అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.