Mowgli: బండి స‌రోజ్ ఎఫెక్ట్‌.. సెన్సార్ బోర్డ్‌కు 'మోగ్లీ' టీమ్ బహిరంగ క్షమాపణలు

ABN , Publish Date - Dec 11 , 2025 | 05:47 PM

'మోగ్లీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సెన్సార్ ఆఫీసర్ ను ఉద్దేశించి బండి సరోజ్ చేసిన వ్యాఖ్యలకు చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ క్షమాపణలు చెప్పాడు. అలానే బండి సరోజ్ సైతం బహిరంగ క్షమాపణలు కోరాడు.

TG Vishwa Prasad

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) పతాకంపై తెరకెక్కిన సినిమా 'మోగ్లీ' (Mowgli). రోషన్ కనకాల (Roshan Kanakala) హీరోగా సందీప్ రాజ్ (Sandeep Raj) రూపొందించిన ఈ సినిమా, 'అఖండ 2' (Akhanda -2) కారణంగా ఒకరోజు ఆలస్యంగా జనం ముందుకు వస్తోంది. 'అఖండ 2' కారణంగా తమ చిత్రం విడుదలలో అస్పష్టత నెలకొనడంతో ఆ చిత్ర దర్శకుడు సందీప్ రాజ్ తో పాటు, ప్రతినాయకుడి పాత్ర చేసిన బండి సరోజ్ కుమార్ (Bandi Saroj Kumar) సైతం సోషల్ మీడియా వేదికగా తమ బాధను వ్యక్తం చేశారు. ఆ తర్వాత ప్రీ రిలీజ్ ఫంక్షన్ లోనూ, సోషల్ మీడియాలోనూ బాలకృష్ణ (Balakrishna) అభిమానులను ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడారు. 'అఖండ 2' సినిమాతో పాటు తమ 'మోగ్లీ' చిత్రాన్ని చూసి ఆదరించమని బండి సరోజ్ కుమార్ కోరాడు. అంతవరకూ బాగానే ఉంది. అయితే అదే ఊపులో... సెన్సార్ ఆఫీసర్ ను దారుణంగా విమర్శించాడు బండి సరోజ్ కుమార్.


'మోగ్లీ' సినిమాకు సెన్సార్ సభ్యులు 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ విషయాన్ని బండి సరోజ్ కుమార్ ప్రస్తావిస్తూ, 'ఈ సినిమాకు 'ఎ' సర్టిఫికెట్ వచ్చింది. అంత మాత్రాన అసభ్యంగా ఉండదు. సెన్సార్ బోర్డ్ ఆఫీసర్ భయపడిపోయాడంటా... ఎవడ్రా వీడు... వీడి పెర్ఫార్మెన్స్ ఏంటీ? వీడు రూత్ లెస్ కాప్ లాగా నటించలేదు... నా ముందు రూత్ లెస్ కాప్ ఉన్నాడని భయపడ్డాను... నేను దీంట్లో కాంప్రమైజ్ అవను... అయాం సారీ అని 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చాడట... ఈ విషయం నాకు దర్శకుడు సందీప్ రాజ్ చెప్పాడు' అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడాడు.

తెర వెనుక ఏం జరిగిందో కానీ ఇది జరిగి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే... బండి సరోజ్ కుమార్ 'సెన్సార్ ఆఫీసర్ గారు... నా ప్రవర్తనకు సారీ' అంటూ సోషల్ మీడియా వేదికగా బహిరంగ క్షమాపణలు తెలిపాడు.


ఇదే సమయంలో చిత్ర నిర్మాత, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జి. విశ్వప్రసాద్ సెన్సార్ ఆఫీసర్, మెంబర్స్ ను ఉద్దేశించి బహిరంగ క్షమాపణలు కోరారు. ఆయన ఆ లేఖలో 'బండి సరోజ్ గారు అనుకోకుండా చేసిన వ్యాఖ్యలకు మేం విచారం వ్యక్తం చేస్తున్నాం. సెన్సార్ ప్రక్రియను మేం అత్యంత గౌరవంగా భావిస్తాం. బాధ్యతతో, నైతికతతో కంటెంట్ ను పర్యవేక్షించే సెన్సార్ బోర్డ్ పట్ల మాకు ఎంతో గౌరవం ఉంది. అత్యుత్తమ పరిపాలనా నైపుణ్యం, పరిశ్రమలో విశేష అనుభవం ఉన్న సభ్యులతో కూడిన మీ బృందం అందించే మార్గదర్శకాలను మేం ఎప్పుడూ పాటిస్తాం. ఆ వ్యాఖ్యలు అనుకోకుండా వెలువడినవిగా భావించి, క్షమించమని కోరుతున్నాం. ఆ కంటెంట్ ను సోషల్ మీడియా నుండి తొలగిస్తున్నాం. మీ నిరంతర సహకారం, మద్దతుకు మా కృతజ్ఞతలు' అని పేర్కొన్నారు.

అయితే... సెన్సార్ సర్టిఫెకెట్ వంకతో మరోసారి 'మోగ్లీ' బృందం పబ్లిసిటీ స్టంట్ ను షురూ చేసిందని కొందరు నెటిజర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Updated Date - Dec 11 , 2025 | 05:58 PM