Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావును కలిసిన బండ్ల గణేష్

ABN , Publish Date - Jun 10 , 2025 | 07:34 PM

కోట శ్రీనివాసరావు(Kota Srinivasa Rao).. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు అని చెప్పొచ్చు. విలన్ గా భయపెట్టాలన్నా.. కామెడీతో నవ్వించాలన్నా.. ఎమోషన్స్ తో ఏడిపించాలన్నా.. ఆయనకు ఆయనే సాటి.

Kota Srinivasa Rao

Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు(Kota Srinivasa Rao).. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు అని చెప్పొచ్చు. విలన్ గా భయపెట్టాలన్నా.. కామెడీతో నవ్వించాలన్నా.. ఎమోషన్స్ తో ఏడిపించాలన్నా.. ఆయనకు ఆయనే సాటి. తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న కోట శ్రీనివాసరావు ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు. వయో వృద్ధాప్య సమస్యలతో ఆయన పోరాడుతున్నట్లు తెలుస్తోంది.

తాజాగా కోట శ్రీనివాసరావును నటుడు, నిర్మాత బండ్ల గణేష్(Bandla Ganesh) కలిశాడు. ఆయన ఇంటికి వెళ్లి మరీ ఆరోగ్యం గురించి విచారించినట్లు తెలుస్తోంది. ఇక కోటతో కలిసి దిగిన ఫోటోను బండ్ల గణేష్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. " కోట శ్రీనివాసరావు గారితో ఈరోజు.. కోటా బాబాయ్ ను కలవడం చాలా సంతోషాన్నిచ్చింది" అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

కోటాను చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. కోటా గారు ఏంటి ఇలా మారిపోయారు.. ఆయనకు ఏమైంది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలికి కట్టుతో, సన్నబడిపోయి అసలు గుర్తుపట్టలేన్నంతగా మారిపోయారు. సడెన్ గా చూస్తే ఆయనను కోటా అని అనుకోరు. కోటా చివరగా 2023 లో వచ్చిన సువర్ణ సుందరి అనే సినిమాలో కనిపించారు.

తుదిశ్వాస తీసుకొనేవరకు సినిమాల్లో నటించాలని ఉందని, కానీ, మేకర్స్ ఎవరు తనకు ఛాన్స్ లు ఇవ్వడం లేదని గతంలో ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు కోటా ఆరోగ్యం అంతగా సహకరించడం లేదని తెలుస్తోంది. ఈ ఫోటో చూసాక అభిమానులు కోటా ఆరోగ్యం బావుండాలని కోరుతూ కామెంట్స్ పెడుతున్నారు.

Updated Date - Jun 10 , 2025 | 10:17 PM