Pragathi: జిమ్‌కి ఆ దుస్తులతో కాకపోతే చీరతో వెళ్తారా.. ప్రగతి కౌంటర్‌..

ABN , Publish Date - Dec 11 , 2025 | 08:05 PM

ఏషియన్‌ ఓపెన్‌ అండ్‌ మాస్టర్స్‌ పవర్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో గెలుపొందాలని, పతకం సాధించాలనేది నటి ప్రగతి కోరిక. దీని కోసం కొన్నేళ్లగా సాధన చేస్తున్నారామె. తాజాగా జరిగిన ఏషియన్‌ ఓపెన్‌ అండ్‌ మాస్టర్స్‌ పవర్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు పతకాలు ఆమెను వరించాయి.

ఏషియన్‌ ఓపెన్‌ అండ్‌ మాస్టర్స్‌ పవర్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో (weight lifting champion) గెలుపొందాలని, పతకం సాధించాలనేది నటి ప్రగతి (Actress pragathi) కోరిక. దీని కోసం కొన్నేళ్లగా సాధన చేస్తున్నారామె. తాజాగా జరిగిన ఏషియన్‌ ఓపెన్‌ అండ్‌ మాస్టర్స్‌ పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో నాలుగు పతకాలు ఆమెను వరించాయి. వాటిని ఇండస్ట్రీల్లోని మహిళా ఆర్టిస్టులకు అంకితం చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. హైదరాబాద్‌లో జరిగిన త్రీ రోజెస్‌ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఆమెను చిత్ర బృందం సన్మానించింది. ఈ సందర్భంగా ప్రగతి మాట్లాడుతూ ‘సరదాగా పవర్‌ లిఫ్టింగ్‌ మొదలుపెట్టి పతకాలు సాధించాను. నేను ప్రాక్టీస్ట్‌ చేస్తున్నప్పుడు చాలామంది ట్రోల్‌ చేశారు. ‘నీకు ఈ వయసులో అవసరమా’ అన్నారు. జిమ్‌లో నా దుస్తులపై కూడా విమర్శలు చేశారు. జిమ్‌కు అలాంటి దుస్తుల్లోనే వెళ్లాలి.

చీర లేదా చుడీదార్‌ కట్టుకుని జిమ్‌ చేయలేం కదా. సినిమాలు మానేసి పవర్‌ లిఫ్టింగ్‌ చేస్తున్నానని కొందరు అన్నారు. అయితే వాళ్లకు తెలియని విషయం నేను ఎప్పటికీ సినిమాలు మానలేను. నటించకపోతే నేను బతకలేను. నాకు గుర్తింపు రావడానికి, నేను అన్నం తినడానికి కారణం ఈ సినిమా పరిశ్రమే! అందుకే దాన్ని ఎప్పటికీ విడిచిపెట్టను. చివరి శ్వాసవరకూ నటన కొనసాగిస్తా. సెట్‌లోనే కన్నుమూయాలని కోరుకుంటా. అయితే కొన్ని సందర్భాలో ఆ ట్రోల్స్‌ చూసి నేను తప్పు చేస్తున్నానేమోనని భయపడ్డాను. ఎదిగిన కూతురు ఉంది. నా వల్ల తనకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమోనని బాధ పడ్డాను. అవన్నీ పక్కన పెట్టి దైర్యంగా ముందుకెళ్లా. నన్ను ట్రోల్‌ చేసిన వారికి నేను గెలిచిన పతకాలతో సమాధానం ఇచ్చాను. నాలుగు పతకాలు గెలిచాను. వీటిని ఇండస్ట్రీలో మహిళలకు అంకితమిస్తున్నా. ఇండస్ట్రీలో కొనసాగాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. మీరు మాకు ఏమిచ్చినా, ఇవ్వకపోయినా.. కొంచెం మర్యాద ఇవ్వండి’ అని ట్రోలర్స్‌ను ఉద్దేశించి ఆమె అన్నారు.  

Updated Date - Dec 11 , 2025 | 10:27 PM