Kalki 2: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'కల్కి-2' షూటింగ్‌కు డార్లింగ్!
ABN , Publish Date - Dec 31 , 2025 | 10:08 AM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన విజువల్ వండర్ 'కల్కి 2898 AD' సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్‌లో వచ్చిన విజువల్ వండర్ 'కల్కి 2898 AD' (Kalki 2898 AD) సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. గతేడాది జూన్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ప్రభాస్ గ్లోబల్ స్టామినాను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె వంటి దిగ్గజ తారలతో పాటు విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ లాంటి స్టార్ హీరోలు మెరిసిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అందులో ముందుగా రాబోతున్న చిత్రం 'ది రాజా సాబ్'. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ హారర్ కామెడీ మూవీ వచ్చే ఏడాది జనవరి 9న సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. ఈ సినిమా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకంతో మేకర్స్ సహా అభిమానులు కూడా ఉన్నారు.

అయితే రాజా సాబ్ విడుదలైన వెంటనే ప్రభాస్ అభిమానులకు మరో మెగా అప్‌డేట్ అందనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో ప్రభాస్ కల్కి పార్ట్-2 షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు ఫిలిం నగర్ వర్గాల సమాచారం. మొదటి భాగం ముగిసిన తీరు చూస్తే, రెండో భాగంలో కమల్ హాసన్ వర్సెస్ ప్రభాస్ మధ్య జరిగే యుద్ధం అత్యంత కీలకంగా ఉండబోతోంది. ఈ యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ కోసమే నాగ్ అశ్విన్ భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారట. ప్రస్తుతం ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' మూవీ పనుల్లో తలమునకలై ఉన్నారు. కల్కి 2 ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని, స్పిరిట్ షూటింగ్‌కు కొన్ని రోజులు విరామం ఇచ్చి కల్కి సెట్స్‌లో అడుగుపెట్టాలని ప్రభాస్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సందీప్ రెడ్డి వంగా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్.
వైజయంతీ మూవీస్ నిర్మాతలు సైతం త్వరలోనే కల్కి 2 పనులు ప్రారంభమవుతాయని హింట్ ఇవ్వడంతో, ఫిబ్రవరి నుండే షూటింగ్ స్టార్ట్ అవ్వడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. జనవరిలో రాజా సాబ్ రిలీజ్, ఫిబ్రవరిలో కల్కి 2 షూటింగ్ ప్రారంభం కావడం అంటే ఇది డార్లింగ్ ఫ్యాన్స్‌కు నిజంగానే పూనకాలు తెచ్చే వార్త.