Hari Hara Veera Mallu: వీరమల్లుకు.. కొత్త తలనొప్పి! సినిమా అడ్డుకుంటాం.. హై కోర్ట్‌లో పిల్
ABN , Publish Date - Jul 06 , 2025 | 10:10 PM
పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు సినిమాకు ఇప్పట్లో కష్టాలు తీరేట్లు కనబడడం లేదు.
ఐదేండ్ల క్రితం మొదలైన పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హరి హర వీరమల్లు (Hari Hara Veera Mallu) సినిమాకు ఇప్పట్లో కష్టాలు తీరేట్లు కనబడడం లేదు. ఇప్పటికే రెండు నెలలుగా అడ్డంకులను, అవరోధాలను, దాటుకుని వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా గత నెల జూన్12 నే విడుదల కావాల్సి ఉండగా విజువల్స్ ఆలస్యం వల్ల వాయిదా పడగా ఆ కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసుకుని ఇటీవలే కొత్త విడుదల తేదీని సైతం ప్రకటించి ప్రచార కార్మక్రమాలు షురూ చేశారు. జూలై 24న విడుదలకు సిద్ధమైంది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి మరో రూపంలో పెద్ద అడ్డంకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమాను విడుదలను ఎట్టి పరిస్థితుల్లో ఆపేయాలంటూ పలువురు కోట్లు మెట్లు ఎక్కేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.
మరో పక్షం రోజుల్లో విడుదల కాబోతున్న హరిమర వీరమల్లు సినిమాను రాబిన్ హుడ్‌గా పేరుగాంచిన తెలంగాణ మహాబూబ్ నగర్‌కు చెందిన పండుగల సాయన్న జీవిత కథను సినిమాగా తెరకెక్కించారని, కానీ మేకర్స్ ఈ సినిమా అంతా కల్పితమని, ఓసారి కాదు విజయ నగర స్థాపకులు హరిహర బుక్క రాయలు స్టోరీ అంటూ మమ్మల్ని తప్పుదోవ పట్టించేలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ లాంటి పెద్ద నటుడు ఇలాంటి సంబంధం లేని స్టోరితో సినిమా ఎలా తీస్తున్నారని తెలిపారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌లో చార్మినార్ ప్రాంతాన్ని, ఔరంగాజేబ్ ల గురించి చూయించారని మరి బుక్క రాయలుకు, సాయన్నకు, ఔరంగా జేబుల మధ్య సుమారు ఆరు వందల యేండ్ల తేడా ఉందని అన్నారు.
ట్రైలర్ చూస్తే పవన్ కల్యాణ్ పాత్ర పండుగల సాయన్న కథను పోలి ఉందని అలాంటిది ఆయన కథను ఆయనకు సంబంధం లేని కాలంతో ముడి పెట్టి తీయడమేంటని దుయ్య బట్టారు. అసలు డబ్బుల కోసం, కమర్షియల్ సినిమా తీస్తూ సాయన్న కథను చరిత్రకు సంబంధం లేకుండా నిజాములు, మొగలుల సమయంలో ఉన్నట్లు ఎలా తీస్తారని, అదే చరిత్రగా చూయించే ప్రయత్నం జరుగుతుందని, దీనిని తప్పకుండా అడ్డుకుంటామని, కోర్టుకు వెళతామని అన్నారు. అవసరమైతే పవన్ కల్యాణ్ గారిని కూడా కలుస్తామని, ఆయన మాకు శత్రువు కాదని మాకు ఉన్న గొడవ కేవలం ఈ సినిమాతోనే అని స్పష్టం చేశారు. చూడాలి మరి ఈ ఇష్యూ మున్మందు ఎంతవరకు వెళుతుందో.