Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర విషాదం.. ఆమె తండ్రి కన్నుమూత
ABN , Publish Date - Jul 30 , 2025 | 10:41 AM
హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి 'విమల్ కుమార్ రాజ్ పుత్ (68) కన్నుమూశారు.
టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి 'విమల్ కుమార్ రాజ్ పుత్ (68) (Vimal Kumar Rajput) కన్నుమూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఈ నెల 28న సాయంత్రం హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచారు. కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు ఈ రోజు (జూలై 30న) ఢిల్లీలో నిర్వహించనున్నారు.
పాయల్ రాజ్‌పుత్ తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ''నా పక్కన లేకపోయినా, మీ ప్రేమ నన్ను ప్రతిరోజూ నడిపిస్తుంది. మీ చిరునవ్వు, మీ గొంతు, మీ ఉనికి నాకు చాలా గుర్తుంది. మీరు ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోవచ్చు, కానీ నా హృదయం నుండి ఎప్పటికీ వెళ్ళిపోరు. లవ్ యు నాన్న..'' అంటూ పోస్టు చేసింది.
ఇదిలాఉంటే.. కార్తికేయ హీరోగా అజయ్ భూపతి తెరకెక్కించిన 'ఆర్.ఎక్స్. 100' (RX 100) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్ ఆ సినిమా ఘన విజయం సాధించడంతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత వరుసగా ఆమెకు పలు అవకాశాలు వచ్చాయి. దాంతో హైదరాబాద్ లోనే పాయల్ స్థిరపడింది. ఈ క్రమంలో తెలుగులో RX 100, వెంకీ మామ, మంగళవారం, ఆర్డీఎక్స్ లవ్, రక్షణ, డిస్కో రాజా, జిన్నా వంటి చిత్రాలతో పాటు 3 రోజెస్ అనే వెబ్ సిరీస్‌తో టాలీవుడ్‌లో మంచి గుర్తింపును దక్కించుకుంది.
ప్రస్తుతం ఆమె ముని దర్శకత్వంలో తెరకెక్కుతున్న వెంకటలచ్చిమి అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. పాయల్ ప్రస్తుతం ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రముఖులు, సినీ పరిశ్రమలోని పలువురు ఆమె కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.