Pawan Kalyan Stands: అన్నం పెట్టిన పరిశ్రమకు అండగా ఉంటా
ABN , Publish Date - Jul 22 , 2025 | 06:15 AM
‘నిర్మాతలు కనుమరుగవుతున్న ఈ సమయంలో ఒక బలమైన చిత్రం నిర్మించి, ఒడుదొడుకులు తట్టుకొని నిలబడిన నిర్మాతకు అండగా ఉండాలనే ఉద్దేశంతో.. నా బిజీ షెడ్యూల్‌ని...
‘నిర్మాతలు కనుమరుగవుతున్న ఈ సమయంలో ఒక బలమైన చిత్రం నిర్మించి, ఒడుదొడుకులు తట్టుకొని నిలబడిన నిర్మాతకు అండగా ఉండాలనే ఉద్దేశంతో.. నా బిజీ షెడ్యూల్‌ని వదిలేసి, ప్రత్యర్థులు నన్ను విమర్శిస్తున్నా ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే సినీ పరిశ్రమ నాకు అన్నం పెట్టింది. అలాంటి పరిశ్రమకు ఎల్లప్పుడూ అండగా ఉంటాను’ అని అన్నారు పవన్‌కల్యాణ్. ఆయన కథానాయకుడిగా నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో సోమవారం ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో చిత్రబృందం పాల్గొంది. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ ‘ఒక సినిమా చేయడమంటే ఎన్నో యుద్ధాలు చేయాలి. అది ఆర్థికంగా కావచ్చు, సృజనాత్మకంగా కావచ్చు. ప్రాంతీయ స్థాయి సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఏ.ఎమ్.రత్నం. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా రత్నం పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రతిపాదించాను. ఆయన నా నిర్మాత అని కాదు.. ఇలాంటి వ్యక్తి ఉంటే సినీ పరిశ్రమ బాగుంటుందని ప్రతిపాదించాను. సినిమా అంటే నాకు అపారమైన గౌరవం. రత్నం లాంటి నిర్మాత ఇబ్బంది పడకూడదని ఈ సినిమాని నా భుజాలపైకి తీసుకున్నాను. కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతిభ ఉంటే ఎవరైనా సినీ రంగంలో రాణించవచ్చు. ‘భీమ్లానాయక్’ విడుదలైనప్పుడు అందరి సినిమాల టిక్కెట్లు వందల్లో ఉంటే, నా సినిమాకు పదుల్లో ఉండేవి. నేనెప్పుడూ రికార్డుల కోసం ప్రయత్నించను. అసలు నేను యాక్టర్ అవ్వాలనే కోరుకోలేదు. ఒక సగటు మనిషిగా జీవించాలనే ఆలోచన తప్ప నాలో ఏం లేదు. ఒక సినిమా చేయాలంటే చాలా కష్టం. హిట్లు, ఫ్లాప్స్ కాకుండా నేను అభిమానులు చూపే ప్రేమనే నమ్మాను. నా బలం మీ అందరి అభిమానమే. కీరవాణి అద్భుతమైన సంగీతం ఇచ్చారు. మనోజ్ పరమహంస ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారు. చిత్రీకరణకు వారానికి ఐదు రోజుల్లో రోజూ రెండు గంటలే కేటాయించినా, దానికి తగ్గట్లు వర్క్ చేసిన టీమ్ కృషి వెలకట్టలేనిది. చిత్ర ప్రమోషన్స్ కోసం నిధి అగర్వాల్ ఎంతో కష్టపడ్డారు. ఈ విషయంలో ఆమెను అభినందించాలి.
ఈ సినిమా సబ్జెక్ట్ నాకు చాలా ఇష్టమైనది. ఇందులో నేను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఉపయోగించిన క్లైమాక్స్‌లో 18 నిమిషాల ఫైట్ కంపోజ్ చేశా’’ అని అన్నారు. చిత్ర దర్శకుడు జ్యోతి కృష్ణ మాట్లాడుతూ ‘ఽ17వ శతాబ్దం మొఘల్స్ నేపథ్యంలో ఉండే సినిమా ఇది. ఆ సమయంలో ఔరంగజేబుకి, వీరమల్లు అనే కల్పిత పాత్రకి మధ్య జరిగే యుద్ధం ఈ సినిమా’ అని చెప్పారు. నిర్మాత ఏ.ఎమ్ రత్నం మాట్లాడుతూ ‘‘నేను ఇన్ని సినిమాలు నిర్మించినా, ఇది చాలా స్పెషల్. ఇందులో పవన్‌కల్యాణ్ విశ్వరూపం చూస్తారు. ఈ చిత్రాన్ని నిర్మించినందుకు గర్వంగా ఉంది’’ అని తెలిపారు. నిర్మాత దయాకర్ రావు మాట్లాడుతూ ‘‘అభిమానులకు ఈ సినిమా విందుభోజనంలా ఉండబోతోంది. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ వినోదం అందివ్వబోతున్నాం’’ అని చెప్పారు. నిధి అగర్వాల్ మాట్లాడుతూ ‘‘పవన్‌కల్యాణ్‌తో పనిచేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. ఇది నా కెరీర్‌లోనే ప్రత్యేకమైన చిత్రం’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు, కర్టాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ కండ్రే, నటులు బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సంగీత దర్శకుడు కీరవాణి తదితరులు పాల్గొన్నారు.