Pawan Kalyan: తూతూమంత్రంగా చేస్తాడనిపించుకోకూడదనే కష్టపడ్డా..

ABN , Publish Date - Jul 22 , 2025 | 07:08 PM

వైకాపా చేస్తున్న బాయ్‌కాట్‌ ట్రెండ్‌ ఈ సినిమాకు నడవదు. తుపాకీ పెట్టి ఎవరూ బలవంతంగా సినిమాలు చూపించరు. అది ప్రేక్షకుల ఛాయిస్‌ - Pawan kalyan

'పవన్‌ రాజకీయాలతో బిజీ అయిపోయాడు.. ఇకపై చేసే సినిమాలు తూతూమంత్రంగా ఉంటాయనే మాట రాకూడదనే ఉద్దేశంతోనే ఈ సినిమా కోసం చాలా కష్ట పడ్డాను. కథలో ఉన్న బలానికి నా బెస్ట్ ఇచ్చాను' అని పవన్ కళ్యాణ్ అన్నారు.  ప్రస్తుతం ఆయన నటించి ‘హరిహర వీరమల్లు’ చిత్రం ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టారు. క్రిష్‌, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎ.ఎం.రత్నం నిర్మించారు. ఈ నెల 24న విడుదల కానుందీ సినిమా. దీనితో పవన్‌ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌లో సినిమాను ప్రమోట్‌ చేసిన ఆయన నేడు ఏపీలో ప్రమోషన్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ..

‘గత ప్రభుత్వం నా సినిమాలను తొక్కి పెట్టాలని చూసినా నేను, నా అభిమానులు భయపడలేదు. నేను డబ్బుకి లొంగే మనిషిని కాదు. ఒక సినిమా విడుదలవుతుందంటే, గుండెల్లో ఉన్న బరువు దిగినట్లు ఉంటుంది. ఎన్నికలకు ఏడాది ముందు నుంచి చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితుల కారణంగా నేను ఒప్పుకొన్న సినిమాలు ఆలస్యమవుతూ వచ్చాయి. నాకున్న ఏకైక ఆదాయం సినిమాలే. అందుకే సినిమాలు పూర్తి చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. గత ప్రభుత్వం నా సినిమాలను ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నాలు  తప్పకుండా చేస్తారు. వైకాపా చేస్తున్న బాయ్‌కాట్‌ ట్రెండ్‌ ఈ సినిమాకు నడవదు. తుపాకీ పెట్టి ఎవరూ బలవంతంగా సినిమాలు చూపించరు. అది ప్రేక్షకుల ఛాయిస్‌. ప్రత్యర్థులు ఏం చేస్తారో చేయనివ్వండి’ అని పవన్‌కల్యాణ్‌ అన్నారు.


నా నిర్మాతలు అర్థం చేసుకున్నారు..

మనిషికి సహాయం చేయకపోయిన పర్వాలేదు. కానీ, హాని చేయకూడదు. ‘మా మోచేతి నీళ్లు తాగండి’ అన్నట్లు గత ప్రభుత్వం వ్యవహరించింది. నా సినిమా టికెట్లు రూ.10-15కే అమ్మినా భయపడలేదు. ఎన్నికల ముందు సినిమా జీవితం, రాజకీయ జీవితం బ్యాలెన్స్‌ చేయలేకపోయా. ‘కరోనాతో ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది పెద్ద మనసుతో అర్థం చేసుకోండి’ అని నా నిర్మాతలను కోరాను. వాళ్లు అర్థం చేసుకున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలలు అసలు ఖాళీ లేదు. దీంతో ఒక ప్రణాళిక ప్రకారం రోజూ ఉదయం 6 నుంచి 9 వరకూ చిత్రీకరణకు కేటాయించి సినిమా పూర్తి చేశాం’.

స్టేల్‌ అయ్యే కథ కాదిది..
క్రిష్‌, ఏఎం రత్నం ఈ కథతో వచ్చినప్పుడు ఆసక్తికరంగా అనిపించింది. ఏపీలోని కొల్లూరు లభించిన  కోహినూర్‌ డైమండ్‌ చుట్టూ ఎంత చరిత్ర నడిచిందో అందరికీ తెలిసిందే. ఆ వజ్రాన్ని మన ప్రాంతాన్ని తీసుకురావడమే ఈ కథ. దర్శకుడు క్రిష్‌ మంచి స్క్రీన్ ప్లేతో ఈ కథను సిద్థం చేశారు. కరోనా కారణంగా సినిమాకు దెబ్బ తగిలింది.  ఒక్క సినిమా అయితే, ఇంకా ముందే అయిపోయేదేమో. సినిమా మొదలై ఐదేళ్లు అయితే, పాతబడిపోయింది. అదృష్టవశాత్తూ దీనికి ఆ పరిస్థితి కాదు. చారిత్రాత్మక చిత్రం కావడంతో ఇది స్టేల్‌ కాలేదు. అందరం కష్టపడి మంచి అవుట్‌పుట్‌తో సినిమాను తీసుకొస్తున్నాం. ఈ సినిమా కోసం నా బెస్ట్‌ ఇచ్చాను. మంచి కథ ఉన్న సినిమా ఇది. క్రిష్‌ దీనిపై గ్రౌండ్‌ లెవల్లో ఎంతో వర్క్‌ చేశారు. కొన్ని కారణాల వల్ల ఆయన సినిమా నుంచి తప్పుకొన్నారు. కానీ సినిమా ఎసెన్స్‌ మాత్రం ఆయనదే. నేను ఆర్టిస్ట్‌గా కన్నా సాంకేతిక నిపుణుడిగా ఎక్కువగా ఆలోచిస్తా. మార్షల్‌ ఆర్ట్స్‌లో నాకు ప్రావీణ్యం ఉండటం వల్ల సన్నివేశాల్లో లాజిక్కులు చూసుకుంటా. నా మనసుకు హత్తుకున్న సన్నివేశాలు ఉన్నప్పుడు నేను చేస్తానని పట్టుబడతా. క్లైమాక్స్‌ ఎలా తీయాలో ఒక ఆలోచన ఉంది. దాన్ని నా శైలిలో కొరియోగ్రఫీ చేశా. 20ల్లో చేసినట్లు ఇప్పుడు యాక్షన్‌ సీన్స్‌ చేయలేం. రాజకీయాల వల్ల శరీరాన్ని కూడా పెద్దగా పట్టించుకోలేదు. పవన్‌ రాజకీయాలతో బిజీ అయిపోయాడు.. ఇకపై చేసే సినిమాలు తూతూమంత్రంగా చేస్తాడనిపించుకోకూడదనే ఉద్దేశంతోనే ఈ మూవీ కోసం కష్టపడి చేశా' అని అన్నారు.

Updated Date - Jul 22 , 2025 | 07:28 PM