Pawan kalyan Press meet: రత్నంగారు నలిగిపోవడం చూడలేక.. పవన్‌ ప్రెస్‌మీట్‌

ABN , Publish Date - Jul 21 , 2025 | 12:11 PM

పవన్‌కల్యాణ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'హరిహర వీరమల్లు’. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు

Pawan Kalyan At harihara Veeramallu Press meet

పవన్‌కల్యాణ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'హరిహర వీరమల్లు’. తొలుత క్రిష్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మిగతా సగభాగాన్ని ఎ.ఎం.జ్యోతికృష్ణ తెరకెక్కించారు. నిధీ అగర్వాల్‌. ఎ.ఎ.రత్నం నిర్మాత. ఈ నెల 24న పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు.

ఆయన మాట్లాడుతూ ‘నేను యాక్సిడెంటల్‌గా యాక్టర్‌నయ్యా. గచ్చంతరం లేక టెక్నీషియన్‌ అయ్యాను. సినిమాలో నటించడం తప్ప సినిమాను ఎలా ప్రమోట్‌ చేయాలో నాకు తెలీదు. మీడియాతో మాట్లాడటానికి పొగరు, అహంకారం కాదు. సినిమా గురించి ఎక్కువ మాట్లాడకూడదు అనిపిస్తుంది. ఎ.ఎం.రత్నంగారి కోసం మీడియా ముందుకొచ్చా. సినిమా బతకాలి.. ఆయన కష్టానికి ఫలితం దక్కాలి అని ఈ ప్రెస్‌మీట్‌ నిర్వహిస్తున్నాం. నేను సినిమాల్లోకి రాకముందు రత్నం గారితో వర్క్‌ చేయాలని అనుకునేవాడిని. రీజనల్‌ సినిమాను పాన్‌ ఇండియా స్థాయికి ఆయన ఎప్పుడో తీసుకెళ్లారు. తమిళంలో హిట్‌ అయిన సినిమాను మళ్లీ తీసి తెలుగులోనూ హిట్‌ చేసే సత్తా గత నిర్మాత ఆయన.

HHVM.jpg

ఆయనతో ఖుషి చేసే అవకాశం నాకు దక్కింది. అప్పుడు ఆయన నాకు ఇచ్చిన ఫ్రీడమ్‌ ఇప్పటికీ మరువలేను. ఆయన నిర్మాణ సంస్థలో సినిమా చేయాలని క్యూ కట్టిన దర్శకుడు, హీరోలను చూశా. కానీ ఈ రోజున ఆయన నలిగిపోతుంటే నాకు చాలా బాధ కలిగింది. సినిమా కోసం అనేక యుద్దాలు చేయాలి. అది క్రియేటివ్‌గా కావచ్చు.. ఆర్దికంగా కావచ్చు. అలాంటిది అన్ని రత్నం గారు ఈ సినిమాకు చూశారు. అవన్నీ చూసే ఎలాగైనా ఈ సినిమా పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నా. కొన్ని వ్యక్తిగత కారణాలు, ప్రొఫెషనల్‌ ఇష్యూతో క్రిష్‌గారు పక్కకు జరిగిన ఆయన తీసుకొచ్చిన కంటెంట్‌ మాత్రం చాలా బలమైనది, విలువైనది. ఆయన తర్వాత ఈ సినిమాను.. జ్యోతికృష్ణ టేకప్‌ చేశారు.  


Pawan-Kalyan.jpg

ప్రత్యర్థులు తిడుతున్నా సినిమా పూర్తి చేశా..
సినిమా పూర్తయ్యేదాకా కూడా నేను నమ్మను. అందుకే నేను నా సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడను. కానీ ఈ సినిమా గురించి మాట్లాడాలనిపించింది. రత్నంగారు ఎంతగా కష్టపడ్డారో చూశాను. నిర్మాతకు ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. అవన్నీ తట్టుకుని సినిమా తీసి విడుదల చేస్తారు. అలాంటి నిర్మాత కోసం నిలబడాలనిపించింది. ఓ వైపు అటు పార్టీ, రాజకీయ పరంగా బిజీగా ఉన్నా, సినిమాలు చేసుకుంటున్నాడు అని నా ప్రత్యర్థులు తిడుతున్నా.. ఈ కార్యక్రమం నిర్వహించానంటే అది సినిమా మీద నాకున్న ఆపార గౌరవం. సినిమా నాకు అన్నం పెట్టింది. అది నాకు ఆక్సిజన్‌. రత్నంగారి తపన చూసి ఈ సినిమా పూర్తి చేయాలని వచ్చి చేశాను. నా బెస్ట్‌ ఈ సినిమాకు ఇచ్చాను. ముండుటెండల్లో నా దగ్గర లేని టైమ్‌ను సర్దుకుని ఈ సినిమా క్లైమాక్స్‌ కోసం 56 రోజులు సమయం కేటాయించాను.

ఒకప్పుడు నేర్చుకున్న మార్షల్‌ ఆర్ట్స్‌ లాంటి విద్యలు ఎన్నో ఈ సినిమాకు ఉపయోగపడ్డాయి. ఈ సినిమా మొదటి భాగానికి యాక్షన్‌ పార్ట్‌ ఆయువుపట్టు. కోహినూర్‌ వ్రజం ట్రావెల్‌ నేపధ్యంలో సాగే కథ ఇది. అద్భుతమైన కథ ఇచ్చిన క్రిష్‌కు ధన్యవాదాలు. సినిమాకు ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. అన్ని తట్టుకుని ఇక్కడి దాకా వచ్చాం. సినిమా విషయంలో నీరసం వచ్చినా ప్రతిసారీ కీరవాణి ప్రాణవాయువులా తన సంగీతంతో హైప్‌ ఇచ్చారు.  కాస్టింగ్‌ కోసం రత్నం, క్రిష్‌ బాగా వర్క్‌ చేశారు. ఔరంగజేబు పాత్రలో ముందు ఒకరిని నటింపచేసి, తరువాత బాబీ డియోల్‌ను తీసుకొచ్చారు. జ్యోతి కృష్ణ సత్తా ఉన్న దర్శకుడు. మనోజ్‌ పరమహంస సపోర్ట్‌తో రత్నం గారి అనుభవంతో హరిహర వీరమల్లు బాగా వచ్చింది. దీని రిజల్ట్‌ ప్రజల చేతిలో ఉంది. దాని గురించి నేను ఎప్పుడూ ఆలోచించను.  


Ok.jpg

ఈ సినిమా అనాధ కాదు .. 

ఛాలెంజింగ్‌ కండీషన్స్‌లో రత్నం ఈ సినిమాను పూర్తి చేశారు. ఆయన తపన చూసి నా భుజాన వేసుకుని సినిమాకు పని చేశా. మిగతా హీరోలతో కంపైర్‌ చేస్తే నా సినిమాలకు బిజినెస్‌ తక్కువే. మనకున్న హీరోల్లో నేను ఒకడిని అని ఫీలవుతాను. కోట్లాది మంది ప్రజలకు అండగా ఉండేవాడిని. దేశ సమస్యల కోసం పోరాటాలు చేసేవాడిని. నా సినిమాకు అండగా ఉండలేనా అనిపించింది. నా సినిమాల సమయంలో గతంలో ఎన్నో ఇబ్బందులు పెట్టారని మీకూ తెలుసు. నిధీ అగర్వాల్‌ సింగిల్‌ హ్యండెడ్‌గా ప్రమోషన్స్‌ చేస్తుంటే నాకే సిగ్గేసింది. ఈ సినిమా అనాధ కాదు. అందుకే నేను ఉన్నానని చెప్పటానికే ఈ ప్రెస్మీట్‌ పెట్టాను. రత్నం గారి మౌనం మంచితనమే నన్ను ఈ రోజు మీ దగ్గరికీ ఇలా నిలబెట్టింది.

రేపు నా కుమారుడు అయినా అంతే..

మా ప్రభుత్వం రాగానే చిత్ర పరిశ్రమను సాధరంగా అక్కున చేర్చుకుంది. అలాంటిది నా సినిమాను నేను ఎందుకు వదిలేస్తాను. ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీలో కులమత ప్రాంత విభేదాలులేవు. ఇక్కడ అంతా ప్రతిభ మీద నడుస్తుంది. టాలెంట్‌ లేకుంటే చిరంజీవి తమ్ముడైన, కుమారుడైన నిలబడటం కష్టం. రేపు నా కుమారుడైనా అంతే’ అని అన్నారు.
 

Updated Date - Jul 21 , 2025 | 02:41 PM