Pawan Kalyan: ఓజీ అని అరిచినా, డిప్యూటీ సీఎం అన్నా.. దానికి ఆధ్యం  చిరంజీవిగారే

ABN , Publish Date - Jan 04 , 2025 | 10:28 PM

"ఎదుటి హీరో సినిమా పోవాలని మా జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు. సర్వేజనా సుఖినోభవంతు అని మా తండ్రి గారు మాకు నేర్పించారు. అందరూ బాగుండాలనే మేం కోరుకుంటాం’’ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ అన్నారు.

"ఎదుటి హీరో సినిమా పోవాలని మా జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు. సర్వేజనా సుఖినోభవంతు అని మా తండ్రి గారు మాకు నేర్పించారు. అందరూ బాగుండాలనే మేం కోరుకుంటాం’’ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ అన్నారు. రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మించిన చిత్రం 'గేమ్‌ ఛేంజర్‌’. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా రాజమండ్రిలో ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఏపీ డిప్యూటీ సీఏం పవన్‌కల్యాణ్‌తో పాటు పలువు మంత్రులు పాల్గొన్నారు.  

మెగాస్టార్‌ వారసుడు గ్లోబల్‌ స్టారే అవుతాడు..
"గేమ్‌ ఛేంజర్‌ ట్రైలర్‌ చూశా. నాకు చాలా నచ్చింది. సామాజిక సందేశం ఇచ్చేలా ఉందనిపిస్తోంది. కొత్త సంవత్సరంలో బాక్సాఫీస్‌ బద్దలైపోవాలి. మగధీరుడు, అల్లూరి సీతారామరాజుగా జీవించేశాడు. మెగస్టార్‌ వారసుడు అంటూ అంతే.. మెగాస్టార్‌ కొడుకు గ్లోబల్‌స్టారే అవుతాడు.  చరణ్‌ అందరి హీరోలకు చాలా మంచి ఫ్రెండ్‌.. ఏడాదికి వంద రోజుల అయ్యప్ప మాల, ఆంజనేయ స్వామి మాల అని అంటాడు. అహంకారం రాకుండా ఉండాలని చేస్తుంటాని చెబుతుంటాడు. ఆస్కార్‌ వరకు వెళ్లినా ఒదిగే ఉంటాడు. ఉంటే సూట్‌లో కనిపిస్తాడు.. లేదంటే అయ్యప్ప మాలలో చెప్పులు లేకుండా కనిపిస్తాడు.. రామ్‌ చరణ్‌ మా బంగారం.. నా తమ్ముడు లాంటి వాడు.. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండేవాడు.. అద్భుత విజయాలు అందుకోవాలని బాబాయ్‌గానే కాకుండ అన్నగా ఆశీర్వదిస్తున్నాను’ అని అన్నారు.

aaa.jpg

మూలాలు మరచిపోలేదు..
మన సినిమా పరిశ్రమకు మూలాలైనా రఘుపతి వెంకయ్య నాయుడు, దాదా ’సాహెబ్‌ ఫాల్కే, రాజ్‌ కపూర్‌, సత్య జిత్‌ రేని మర్చిపోలేం, తెలుగు ఖ్యాతిని ఎగరేసిన నాగిరెడ్డి, బీఎన్‌ రెడ్డి రామబ్రహ్మం, తెలుగు జాతి కీర్తి పెంచిన ఎన్టీ రామారావు గారిని, ఏఎన్నార్‌ గారిని తలచుకుంటాం. వేదికపై పవన్‌ కళ్యాణ్‌ ఉన్నా.. రామ్‌ చరణ్‌ ఉన్నా.. దానికి కారణం చిరంజీవి గారు. మీరు కళ్యాణ్‌ బాబు అని అరిచినా, ఓజీ అని అరిచినా, డిప్యూటీ సీఎం అని అరచినా దానికి చిరంజీవి గారే ఆద్యులు. మేం మూలాలు మరిచిపోము. సీఎం చంద్రబాబు గారి సహకారం, మద్దతు వల్లే ఈ రోజు ఇక్కడ ఇలాంటి ఈవెంట్‌ను నిర్వహించుకోగలుగుతున్నాం’’

జనసేనకు ఇంధనంగా పని చేసింది..
నేను చాలా తక్కువ సినిమాలకు థియేటర్లకు వెళ్లేవాణ్ణి. శంకర్‌ గారు తీసిన జెంటిల్‌మెన్‌ సినిమాను బ్లాక్‌ టికెట్‌ కొని చూశా. ప్రేమికుడు సినిమాకు వెళ్లడానికి ఎవరూ తోడు లేక మా అమ్మమ్మతో వెళ్లి చూశాను. అన్ని వయసుల వారిని ఆకట్టుకునే సినిమాలు తీశారాయన. ఆయన సినిమాలో సామాజిక స్పృహతో ఆయన చిత్రాలుంటాయి. శంకర్‌ తీసిన సినిమాలు తెలుగులో విడుదలైతే ఇది తమిళ సినిమా కాదు.. తెలుగు సినిమా అని గుండెల్లో పెట్టుకుని ఆదరించారు ప్రేక్షకులు. ఆయన తెలుగులో సినిమాలు తీస్తే బావుండును అనుకున్నా. ఇలా గేమ్‌ ఛేంజర్‌తో కుదిరింది. దిల్‌ రాజు తొలిప్రేమ సినిమా మీదున్న నమ్మకంతో ముందుకొచ్చి విడుదల చేశారు. అలా మొదలైన ఆయన నాతో వకీల్‌సాబ్‌ అనే సినిమా తీశారు. పేరుండి డబ్బులు లేని సమయం, మార్కెట్‌ ఉందో లేదో తెలియని స్థితి ఇలా నేను బాగా కష్టాల్లో ఉన్న సమయంలో ఆయన నాతో వకీల్‌సాబ్‌ సినిమా తీశారు. ఆ సినిమా  జనసేన పార్టీ నడవడానికి ఇందనంగా పని చేసింది.

2222-(4).jpg

మీకు మీరే ధైర్యం...
నేను ఇంటర్‌ చదువుతున్న సమయంలో అన్నయ్యకు అబ్బాయి పుట్టాడని మా నాన్న గారు ఎంతో ఆలోచించి రామ్‌ చరణ్‌ అని పేరు పెట్టారు. రాముని చరణాల వద్ద ఉండే వాడు.. ఆంజనేయుడు.. ఎంత బలం ఉన్నా వినయ విధేయంగా ఉంటాడు.. హనుమాది సిద్దులున్నా కూడా ఎంతో వినయంగా ఉండేవాడు. అందుకే రామ్‌ చరణ్‌  అని మా నాన్న పేరు పెట్టారు. నాకు చిరంజీవి పితృ సమానులు. నేను రామ్‌ చరణ్‌కు బాబాయ్‌లా ఉండను. రామ్‌ చరణ్‌ నాకు సోదర సమానుడు. రామ్‌ చరణ్‌ రంగస్థలం సినిమాకు అవార్డు వస్తుందని అనుకున్నాను. అన్నయ్య ఏ నేపధ్యం లేకుండా వచ్చి ఒంటరిగా ఎదిగాడు. మన వెనక ఎవరో ఉండాలనుకోవక్కర్లేదు. మీకు మీరే ధైర్యం. గుండెల్లో బలంగా అనుకుంటే ప్రతి ఒక్కరూ కోరుకున్నా రంగంలో మెగాస్టార్లు అవుతారు. మా అన్నయ్య పెరిగి మా అందరికీ ఊతం ఇచ్చారు. చిరంజీవి గారు ఇచ్చిన మూలల వల్లే నేను ఈ రోజులు మారుమూల ప్రాంతాలకు వెళ్లి రోడ్లు వేయించగలుగుతున్నా. అన్నయ్య కష్టం కళ్లారా చూశా. షూటింగ్‌ నుంచి వచ్చి షూ కూడా తీయలేకపోయేవారు. అన్నయ్య కష్టం చూసి చరణ్‌ ఇంత క్రమశిక్షణగా తయారయ్యాడు. రామ్‌ చరణ్‌ హార్స్‌ రైడింగ్‌ చూస్తే నాకు అసూయగా అనిపిస్తుంది. నాకు హార్స్‌ రైడింగ్‌ రాదు. కానీ గబ్బర్‌ సింగ్‌ టైంలో హార్స్‌ రైడింగ్‌ పెట్టారు. ఏదోలా చేశాను.

Updated Date - Jan 04 , 2025 | 10:28 PM