Pawan Kalyan OG: ఓజీ టికెట్ రూ.1,29,999..! ఇదెక్కడి.. అభిమానం రా నాయనా
ABN , Publish Date - Sep 21 , 2025 | 05:02 PM
ఓజీ టికెట్లపై పవన్ ఫ్యాన్స్ క్రేజ్ పిచ్చి పీక్స్‌కి చేరింది. యాదాద్రిలో బెనిఫిట్ షో టికెట్ రూ.1.29 లక్షలకు అమ్ముడైంది.
సినీ హీరోలపై అభిమానులు చూపించే ప్రేమ, భక్తి, అభిమానం తరచూ ఊహలకు అందని స్థాయిలో ఉంటుంది. ఇక పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సినిమాల విషయంలో అయితే ఆ క్రేజ్‌కు ఎప్పటికీ, ఎక్కడికీ, ఎంతకీ హద్దులనేవి ఉండవు. తాజాగా సుజీత్ దర్శకత్వంలో పవన్ హీరోగా తెరకెక్కిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ “ఓజీ” (They Call Him OG)సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై అభిమానుల్లో నెలకొన్న ఉత్సాహం టికెట్ల విక్రయాల దగ్గర మరింత స్పష్టంగా కనిపిస్తోంది.
టికెట్‌లకు ఆన్‌లైన్‌లో డిమాండ్
ఇప్పటికే ఓవర్సీసలలో టికెట్లు అమ్మ్ఉడుపోయి సంచలనాలు సృష్టించగా తాజాగా ఇండియాలో ఆన్‌లైన్ బుకింగ్స్ ప్రారంభమైన దగ్గర నుండి ఓజీ టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కొద్ది నిమిషాల్లోనే అనేక థియేటర్లలో షోలు హౌస్‌ఫుల్ అయ్యాయి, అవుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అభిమానులు ప్రత్యేకంగా బెనిఫిట్ షో టికెట్‌లను వేలం పాటల ద్వారా కొనుగోలు చేస్తూ పవన్ పట్ల తమ అభిమానాన్ని మరోసారి చాటుకుంటున్నారు, నిరూపిస్తున్నారు..
యాదాద్రిలో రికార్డు స్థాయి టికెట్ ధర
యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లోని శ్రీనివాస థియేటర్‌లో నిర్వహించిన ఓజీ బెనిఫిట్ షో టికెట్ వేలం పాటలో ఆశ్చర్యపరిచే రేటు నపలికింది. ఈ వేలం పాటలో జబర్దస్త్ ఫేమ్ వినోదిని ప్రత్యేక అతిథిగా పాల్గొనగా, వందలాది అభిమానులు ఉత్సాహంగా బిడ్‌లో పాల్గొన్నారు. చివరికి లక్కారం గ్రామానికి చెందిన పవన్ అభిమాని ఆముదాల పరమేష్ రూ.1,29,999 చెల్లించి టికెట్‌ను దక్కించుకోవడం గమనార్హం.
అయితే.. వేలం పాటలో వచ్చిన ఈ మొత్తాన్ని జనసేన పార్టీ ఆఫీసుకు అందజేస్తామని అభిమానులు తెలిపారు. తమ ప్రీతిపాత్రుడైన హీరో సినిమాకు టికెట్ కొనడమే కాకుండా, ఆ డబ్బు సమాజ సేవకు ఉపయోగించడం గర్వకారణమని పవన్ అభిమానులు భావిస్తున్నారు.
ఓజీపై అంచనాలు
ఈ నెల 22న విడుదల కానున్న ఓజీ ట్రైలర్ ఇప్పటికే భారీ అంచనాలను పెంచేసింది. పవన్ కల్యాణ్ లుక్, సుజీత్ స్టైలిష్ మేకింగ్, థమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ – అన్నీ కలిపి సినిమా హంగామాను రెట్టింపు చేయనున్నాయి. “ఓజీ” రిలీజ్ డే రోజు తెల్లవారుజాము నుండి అనేక థియేటర్లలో ప్రత్యేక షోలు ప్లాన్ చేయగా, అభిమానుల వేడుకలు మరింత ఘనంగా ఉండనున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు ఏపీలో ప్రీమియర్స్ కు రూ. వెయ్యి ఫిక్స్ చేఏయగా తెలంగాణలో రూ.800లుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే.