Pawan Kalyan: గబ్బర్‌సింగ్‌ వంటి హిట్‌ ఇవ్వండి

ABN , Publish Date - Jul 24 , 2025 | 05:28 AM

ప్రతిసారి అన్నా... ఒక్క హిట్‌’ అంటూ అడుగుతుంటారు. తొలిసారి అభిమానుల కోసం హరిహర వీరమల్లు

‘ప్రతిసారి అన్నా... ఒక్క హిట్‌’ అంటూ అడుగుతుంటారు. తొలిసారి అభిమానుల కోసం ‘హరిహర వీరమల్లు’ సినిమాకు గబ్బర్‌సింగ్‌ లాంటి హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నా. నటనలో ఓనమాలు దిద్దిన విశాఖ నేల నుంచి భగవంతుడిని, సరస్వతీదేవిని మీరంతా ఆనందించే హిట్‌ ఇవ్వాలని కోరుకుంటున్నా’ అని చిత్ర హీరో, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అన్నారు. ‘హరిహర వీరమల్లు’ సినిమా గురువారం విడుదల కాబోతున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం విశాఖ ఆర్కే బీచ్‌ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ హాలులో ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ సాధారణంగా తన సినిమాలు ఎప్పుడూ రికార్డులు సృష్టిస్తాయని, బ్లాక్‌ బ్లస్టర్‌ అవుతుందని చెప్పనన్నారు. అయితే, అభిమానుల కోసం ఈ సినిమా హిట్‌ కావాలని సరస్వతీదేవిని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. కృష్ణుడిని తాను నమ్ముతానని, కర్మ చెయ్‌ ఫలితం భగవంతుడికి వదిలేయ్‌ అన్న సిద్ధాంతాన్ని బలంగా విశ్వసిస్తానన్నారు. సత్ఫలితాన్ని ఇవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నట్టు వెల్లడించారు. అందరి హీరోల సినిమాలకు మాదిరిగానే తన సినిమాకు టికెట్‌ రేటు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబునాయుడుకు ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. సినిమా హిట్‌ కావాలని ఆకాంక్షిస్తూ ట్వీట్‌ చేసిన మంత్రి నారా లోకేశ్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రెండేళ్ల కిందట నోవాటెల్‌ హోటల్‌ నుంచి బయటకు రాకుండా ఇబ్బందులకు గురిచేశారని, పోలీసు అధికారులు కాలిబూట్లతో తన్ని అరెస్టు చేయాలని చూస్తే నగరవాసులంతా హోటల్‌ ముందుకువచ్చి కూర్చున్న విషయాన్ని ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ గుర్తుచేసుకున్నారు. అంత బలమైన జ్ఞాపకాన్ని విశాఖ తనకు ఇచ్చిందని, అందుకే ఈ ప్రోగ్రామ్‌ను ప్రత్యేకించి ఇక్కడే పెట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. విశాఖలో సత్యానంద్‌ మాస్టారు వద్ద నటన నేర్చుకునేందుకు చేరానని, అలా నగరంతో తనకు అనుబంధం ఏర్పడిందన్నారు.


GHFJ.jpg

సత్యానంద్‌ మాస్టారు తనకు ఉత్తరాంధ్ర ఆట, పాటను గుండెల్లో అణువణువూ నింపేశారన్నారు. చిన్నప్పటి నుంచి తనకు పెద్దగా ఏమీ లక్ష్యాలు లేవని, తాను ఏమైపోతానన్న భయంతో అన్నయ్య చిరంజీవి సినిమాల వైపు పంపించారన్నారు. అన్యాయం జరిగితే ఎదురుదాడి చేయడం, సహాయం చేయాలన్న లక్షణాలే చిన్నప్పటి నుంచి తనకు అలవాటయ్యాయన్నారు. విశాఖతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, తన గురించి మాట్లాడే వాళ్లంతా బావిలో కప్పలని విమర్శించారు. 1996లో తన తొలి చిత్రం వచ్చిందని, వచ్చే ఏడాదికి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నానని పవన్‌ వెల్లడించారు. నియంత పోకడలు ఉన్న ప్రభుత్వాన్ని ఎదుర్కొనే శక్తిని సినిమాలు, అభిమానులే తనకు ఇచ్చాయన్నారు. సినిమాకు కులం, మతం, ప్రాంతం భేదాలు ఉండవన్నారు. ఈ సినిమాలో దేశంలోని అనేక రాష్ట్రాలు, మతాలకు చెందిన నటీనటులు నటించారన్నారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీరవాణి లేకపోతే ఈ సినిమా లేదన్నారు. సాధారణంగా సినిమాలు ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం చూస్తుంటారని, తన సినిమాలు ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు ఎడ్యుకేట్‌ చేయాలని భావిస్తుంటానన్నారు. సనాతన ధర్మం అంటే ఇతర మతాలకు వ్యతిరేకం కాదని, అందరినీ కలుపుకునిపోయేదన్నారు. కార్యక్రమంలో హీరోయిన్‌ నిధి అగర్వాల్‌, సంగీత దర్శకుడు కీరవాణి, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు, కొణతాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యానంద్‌ మాస్టారు, సంగీత దర్శకుడు కీరవాణిలను పవన్‌ కల్యాణ్‌ సత్కరించారు.

Updated Date - Jul 24 , 2025 | 05:28 AM