భారతీయ సినీరంగం గర్వించే విషయం

ABN , Publish Date - Jun 30 , 2025 | 02:33 AM

హీరో కమల్‌ హాసన్‌ ఆస్కార్‌ కమిటీలో సభ్యుడిగా ఎంపికవ్వడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఇది భారతీయ సినీరంగం గర్వించే...

హీరో కమల్‌ హాసన్‌ ఆస్కార్‌ కమిటీలో సభ్యుడిగా ఎంపికవ్వడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఇది భారతీయ సినీరంగం గర్వించే విషయమని ప్రశంసించారు. ‘‘ప్రపంచమంతా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌ అవార్డుల కమిటీలో సభ్యుడిగా పద్మభూషణ్‌ కమల్‌ హాసన్‌ ఎంపికవ్వడం భారతీయ సినీరంగం గర్వించదగ్గ విషయం. ఆరు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో ఆయన నటుడిగా, దర్శకుడిగా, కథకుడిగా భారతీయ, ప్రపంచ సినిమాపై చెరగని ముద్ర వేశారు. సినిమా మేకింగ్‌ విషయంలో ఆయనకు ఉన్న పట్టు స్ఫూర్తిదాయకం. ప్రపంచ సినిమాకు ఆయన ఇలాగే మరింత కాలం సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. కాగా, ‘ది అకాడెమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌’ ఇటీవల విడుదల చేసిన కొత్త కమిటీ సభ్యుల జాబితాలో భారత్‌ నుంచి కమల్‌ హాసన్‌తో పాటు నటుడు ఆయుష్మాన్‌ ఖురానా, దర్శకురాలు పాయల్‌ కపాడియా, ఫ్యాషన్‌ డిజైనర్‌ మాక్సిమా బసు ఉన్నారు. హాలీవుడ్‌ నటీనటులతో పాటు ఆస్కార్‌ ఓటింగ్‌ ప్రక్రియలో వీరు పాలుపంచుకోనున్నారు.

Updated Date - Jun 30 , 2025 | 02:33 AM