Hari Hara Veera Mallu: బాయ్‌కాట్‌ చేస్తారా అంత భయమెందుకు

ABN , Publish Date - Jul 25 , 2025 | 01:36 AM

‘కొంత మంది మన చిత్రాన్ని బాయ్‌కాట్‌ చేస్తామంటున్నారు. వారికి అంత భయమెందుకు? అలాంటి వారికి నేను ఇచ్చే సమాధానం ఒకటే.. బాయ్‌కాట్‌ చేసుకుంటే చేసుకోండి...

‘కొంత మంది మన చిత్రాన్ని బాయ్‌కాట్‌ చేస్తామంటున్నారు. వారికి అంత భయమెందుకు? అలాంటి వారికి నేను ఇచ్చే సమాధానం ఒకటే.. బాయ్‌కాట్‌ చేసుకుంటే చేసుకోండి. ఇదేమన్నా క్విట్‌ ఇండియా ఉద్యమమా? ఇలాంటి తాటాకుల చప్పుళ్లకు నేను బెదరను. నేను ఈ రోజు ఇంత బలంగా ఉన్నానంటే అందుకు నా అభిమానులే కారణం. మన సినిమా గురించి నెగెటివ్‌గా మాట్లాడుతున్నారంటే మనం బలంగా ఉన్నామని అర్థం. ప్రతి సోషల్‌ మీడియా కామెంట్‌నూ మనం తిప్పికొట్టాలి’ అని అన్నారు పవన్‌ కల్యాణ్‌. ఆయన కథానాయకుడిగా నటించిన ‘హరిహర వీరమల్లు’ చిత్రం గురువారం విడుదలైన సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో సక్సెస్‌ మీట్‌ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ ‘సినిమా జయాపజయాలను నేను పట్టించుకోను. ఏ రంగంలోనైనా మన సామర్థ్యాన్ని మెరుగుపర్చుకునే అవకాశం ఉంటుంది. ఈ కథను మొదట క్రిష్‌, ఏ.ఎం.రత్నం నా వద్దకు తీసుకొచ్చినప్పుడు ఎలా చేయగలం అనే సందేహం కలిగింది. ఈ సినిమా చేస్తున్నప్పుడు నేను చిన్నప్పుడు చదువుకొన్న జిజియా పన్ను గుర్తుకొచ్చింది. మనం ఎప్పుడైనా అక్బర్‌ ద గ్రేట్‌ అని వింటాం. కానీ, కృష్ణరాయ ద గ్రేట్‌ అని, రాణి రుద్రమదేవి ద గ్రేట్‌ అని వినం. మొఘలులు కేవలం 200 ఏళ్లు మాత్రమే పాలించారు. చాళుక్యులు, పల్లవులు, కాకతీయులు, విజయనగర రాజులు వందల ఏళ్లు పరిపాలించారు. ఎందుకో కానీ మన చరిత్రకారులు మన రాజులపై చిన్న చూపు చూశారనిపిస్తోంది. అక్బర్‌, ఔరంగజేబ్‌ గొప్పదనం గురించి వివరించినప్పుడు... జిజియా పన్ను గురించి ఎందుకు మాట్లాడకూడదు? ఔరంగజేబ్‌ మరణించి శతాబ్దాలవుతున్నా ఆయన గురించి మాట్లాడాలంటే ఇప్పటికీ సెన్సిటివ్‌గా ఫీలవుతున్నాం. అందుకే ఔరంగజేబ్‌ దారుణాల గురించి ఈ తరం వాళ్లకు తెలియజేయాలనే ఈ సినిమా తీశాం. ఔరంగజేబ్‌ దారుణాలను ప్రేక్షకుల మదిలోకి తీసుకెళ్లడం అన్నిటికంటే నాకు దక్కిన పెద్ద విజయం. ఒక ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన నిర్మాతకు అండగా ఉండాలనుకున్నాను. అందుకే ఈ సినిమాను నా భుజాలపై వేసుకున్నాను.


నేను నవలలు బాగా చదువుతాను. కానీ ఎప్పుడు కూడా నన్ను నేను హీరోగా ఊహించుకోలేదు. కాలమే నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్‌ రవిశంకర్‌, నవీన్‌ అలాగే పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్‌ ఈ సినిమా విడుదలకు సహకరించారు. ‘హరిహర వీరమల్లు’ రెండో భాగం 25 నుంచి 30 శాతం వరకు చిత్రీకరించాం’ అని అన్నారు. నిర్మాత వై. రవిశంకర్‌ మాట్లాడుతూ ‘పవర్‌ స్టార్‌ పవర్‌ ఏంటో ఫస్ట్‌ షోలోనే చూశాం. అన్ని చోట్లా మంచి టాక్‌ వస్తోంది. ఇదే కంటిన్యూ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం’ అని అన్నారు. మరో నిర్మాత యెర్నేని నవీన్‌ మాట్లాడుతూ ‘సినిమా బ్లాక్‌ బస్టర్‌ అని రాష్ట్రమంతా ఒకే మాట వినపడుతోంది’ అని అన్నారు. చిత్ర దర్శకుడు జ్యోతి కృష్ణ మాట్లాడుతూ ‘ఈ సినిమాకు ఇద్దరు హీరోలు ఒకరు పవన్‌, మరొకరు కీరవాణి. పవన్‌ సార్‌ కంపోజ్‌ చేసిన ఫైట్‌కు మంచి స్పందన వస్తోంది. మా నాన్నగారు ఇంతవరకు చాలా హిట్‌ చిత్రాలు నిర్మించారు. ఆయన తొలి సినిమా హిట్‌ అయిన రోజున ముఖంలో చూసిన ఆనందం మళ్లీ ఈ చిత్రం ప్రీమియర్‌ షో సందర్భంగా చూశాను’ అని అన్నారు. చిత్ర నిర్మాత ఏ.ఎం. రత్నం మాట్లాడుతూ ‘ఇది సినిమా కాదు. ఒక చరిత్ర. సనాతన ధర్మ పరిరక్షణకు ఔరంగజేబుని ఎదుర్కొనే ఓ వీరుడి కథే ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమాను కుటుంబ సభ్యులందరూ కలసి చూస్తున్నారు. ఈ సినిమా కచ్చితంగా సూపర్‌ హిట్‌ అవుతుందనే నమ్మకం నాకుంది’ అని పేర్కొన్నారు. హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ మాట్లాడుతూ చిత్రం విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.

Updated Date - Jul 25 , 2025 | 01:36 AM