Dussehra Movies: అఖండ వర్సెస్ గంభీర.. తగ్గేదెవరు.. నెగ్గేదెవరు..?
ABN , Publish Date - Jun 10 , 2025 | 03:22 PM
దసరా 2025.. హీటెక్కనుంది. దసరా కానుకగా రెండు పెద్ద సినిమాలు పోటీకి రెడీ అవుతున్నాయి. అవే OG వర్సెస్ అఖండ 2(Akhanda 2).
Dussehra Movies: దసరా 2025.. హీటెక్కనుంది. దసరా కానుకగా రెండు పెద్ద సినిమాలు పోటీకి రెడీ అవుతున్నాయి. అవే OG వర్సెస్ అఖండ 2(Akhanda 2). పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా సుజీత్(Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం OG. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ మధ్యనే OG షూటింగ్ ను ఫినిష్ చేశాడు పవన్.
గతేడాది సెప్టెంబర్ 25 న రిలీజ్ కావాల్సిన సినిమా.. షూటింగ్ వాయిదా పడడంతో ఎట్టకేలకు ఈ ఏడాది అదే రోజున రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ మధ్యనే OG మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. గంభీర షూటింగ్ పూర్తిచేసుకున్నాడు అంటూ తెలుపుతూ సెప్టెంబర్ 25 న ఈ సినిమా రిలీజ్ కానుందని తెలిపారు.
ఇక పవన్ తో పాటు యుద్దానికి సిద్దమయ్యాడు నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna). బోయపాటి శ్రీను(Boyapati Srinu)దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న చిత్రం అఖండ 2. 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. అఖండ 2 కూడా సెప్టెంబర్ 25 నే రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించారు.
OG వస్తున్న రోజునే అఖండ 2 కూడా వస్తుందని తెలియడంతో ఈ పోటీ మెగా వర్సెస్ నందమూరి వార్ గా మారిపోయింది. రెండు స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు వస్తున్నాయి అంటే.. అది ఇండస్ట్రీలో ఒక పెద్ద సమస్యనే తీసుకొస్తుంది. ఇద్దరికీ సమానంగా థియేటర్లు ఇవ్వాలి. ఈ రెండు కాకుండా డబ్బింగ్ సినిమా వస్తే.. వాటికి కూడా థియేటర్లు ఇవ్వాలి.
ఇక ఈ రెండు సినిమాలకు థియేటర్ల సమస్య కంటే ఫ్యాన్స్ తోనే ఎక్కువ సమస్య. మొదటి నుంచి మెగా వర్సెస్ నందమూరి ఫ్యాన్స్ మధ్య ఎప్పుడు ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. ఇక ఇప్పుడు పవన్ - బాలయ్య ఒకేరోజు సినిమాలతో వస్తున్నారు అంటే ఆరోజు పెద్ద యుద్ధమే జరుగుతుందని చెప్పొచ్చు. అందులో ఈ ఇద్దరు హీరోలు ఒకే ప్రభుత్వంలో ఉన్నారు. వారిద్దరి మధ్య బాక్సాఫీస్ వార్ అంటే బాగోదని కొందరు అంటున్నారు.
మొదట అఖండ 2 నే దసరా డేట్ ను ఫిక్స్ చేసుకున్నా.. పవన్ వస్తున్నాడు అని తెలియడంతో బాలయ్య వెనకడుగు వేస్తాడేమో అనుకున్నారు కానీ, బాలయ్య మాత్రం అదేరోజు పవన్ తో పోటీకి నిలబడ్డాడు. ఇద్దరు ఒకేరోజు రావడం మంచిది కాదని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. అందులోనూ సోషల్ మీడియాలో నెగెటివ్ ట్రోలింగ్ ఎప్పుడు చేద్దామా అని వేచి చూసే జనాలే ఎక్కువ మంది ఉన్నారు. ఈ బాక్సాఫీస్ వార్ ను రాజకీయ పరంగా కూడా తీసుకెళ్లే ఛాన్స్ లేకపోలేదు. దీంతో ఏ ఇద్దరిలో ఒకరు వెనెక్కి తగ్గితే బావుంటుందని కొందరు చెప్పుకొస్తున్నారు. మరి పరిస్థితిని అర్ధం చేసుకొని ఎవరు ఈ రేస్ నుంచి తప్పుకుంటారో .. ఎవరు దసరా విన్నర్ గా గెలుస్తారో చూడాలి.