Vijay Deverakonda: ఆ యాప్ ఇక్కడ ఓపెన్ అవ్వదు.. ఇంకోసారి రిపీట్ చేయను! CID విచారణలో విజయ్ దేవరకొండ
ABN , Publish Date - Nov 11 , 2025 | 06:30 PM
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో విజయ్ దేవరకొండ మంగళవారం సిట్ విచారణకు హాజరయ్యారు.
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) మంగళవారం సిట్ (Special Investigation Team) విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని సీఐడీ కార్యాలయంలో అధికారుల సమక్షంలో వారి విచారణ కొనసాగింది. సుమారు గంట, గంటన్నరకు పైగా ఈ విచారణ జరుగగా కీలక అంశాలను ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.
అయితే.. నేను ప్రమోట్ చేసిన ఈ 23ఏ యాప్ లీగల్‌గా అనుమతి ఉన్న ప్రాంతాలలో మాత్రమే ఓపెన్ అవుతుందని ఇతర ప్రాంతాలలో ఓపెన్ అవదని అవన్నీ బేరీజు వేసుకుని ఈ యాడ్ చేశానని ఆయన తన వాంగ్మూలంలో తెలిపినట్లు తెలిసింది. ఆపై యాప్ కంపెనీతో చేసుకున్న అగ్రిమెంట్ వివరాలను సీఐడీకి అందజేసి మరోమారు ఈ తరహా ప్రమోషన్స్ రిపీట్ చేయనని CID విచారణలో స్పష్టం చేసినట్లు తెలిసింది. మరోవైపు ఇదే రోజు విచారణకు రావాల్సిన ప్రకాశ్ రాజ్ (Prakash Raj)తన బిజీ షెడ్యూల్ వళ్ల రాలేక పోతున్నానని, మరో రోజు విచారణకు హజరవుతానని తెలపినట్లు సమాచారం.
ఇదిలాఉంటే.. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లపై గతంలో నమోదైన కేసుల ఆధారంగా సిట్ అధికారులు దర్యాప్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. పంజాగుట్ట, మియాపూర్, సూర్యాపేట, విశాఖపట్నం ప్రాంతాల్లో నమోదైన ఫిర్యాదులను సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో మొత్తం 29 మంది సినీనటులు, యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) నమోదు చేశారు. వీరంతా జంగిల్ రమ్మీ, జీత్‌విన్, లోటస్ 365 వంటి బెట్టింగ్ యాప్‌లకు ప్రమోషన్లు చేయడం వల్ల వివాదాస్పదంగా మారారు.
ఈ యాప్‌ల ప్రచారాల ప్రభావంతో పలువురు యువకులు బెట్టింగ్‌లో డబ్బులు పెట్టి మోసపోయారని, కొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులు భారీ స్థాయిలో డబ్బు లావాదేవీలు జరిపి వేల కోట్లు కొల్లగొట్టినట్లు అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. అదే కేసులో మనీలాండరింగ్ కోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా వేర్వేరు మార్గాల్లో దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో సినీ ప్రముఖులను సిట్ ప్రశ్నిస్తోంది.