Rakul Preet Singh: మరోసారి.. డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు
ABN , Publish Date - Dec 27 , 2025 | 12:25 PM
హైదరాబాద్‌లో బయటపడిన తాజా డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్‌ప్రీత్ సింగ్ పేరు వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం కొనసాగుతోంది. తాజాగా బయటపడిన ఓ డ్రగ్స్ కేసులో ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) సోదరుడు అమన్‌ప్రీత్ సింగ్ (Amanpreet Singh) పేరు వెలుగులోకి రావడం తీవ్ర చర్చకు దారితీస్తోంది.
మాసబ్ ట్యాంక్ పోలీసులు, ఈగల్ టీం సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఈ డ్రగ్స్ దందాకు సంబంధించిన కీలక వివరాలు బయటపడ్డాయి. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు వ్యాపారవేత్తలను పోలీసులు అరెస్ట్ చేయగా, ప్రధాన నిందితుడిగా భావిస్తున్న అమన్‌ప్రీత్ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, 2016 నుంచి హైదరాబాద్ కేంద్రంగా భారీ స్థాయిలో డ్రగ్స్ వ్యాపారం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెట్‌వర్క్‌కు పంజాబ్ రాష్ట్రానికి చెందిన పెద్ద ముఠాలతో బలమైన సంబంధాలు ఉన్నాయని అధికారులు అనుమానిస్తున్నారు. గతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కూడా అమన్‌ప్రీత్ పేరు కీలకంగా వినిపించిందని సమాచారం.
అంతేకాదు, 2017, 2018 సంవత్సరాల్లో పలుమార్లు పోలీసులకు చిక్కినప్పటికీ, కొందరు బడా రాజకీయ నాయకుల అండతో కేసుల నుంచి తప్పించుకున్నాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి మాత్రం ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా పోలీసులు కదులుతున్నారని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, రెండు రోజుల క్రితమే క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్న అమన్‌ప్రీత్ సింగ్ ఒక్కసారిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం అనుమానాలను మరింత పెంచుతోంది. అతడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని, ఈ డ్రగ్స్ రాకెట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను బయటపెడతామని పోలీసు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కేసులో మరిన్ని ప్రముఖ పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.